సంచలనం కల్గించిన సినీ నటి షాలూ చౌరాసియాపై దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఆగంతకుడిని పోలీసులు గుర్తించలేకపోయారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో నడక సాగిస్తున్న నటి చౌరాసియాపై గత ఆదివారం రాత్రి దుండగుడు దాడి చేసి కొట్టి, హత్యాయత్నానికి పాల్పడి పరారైన విషయం పాఠకులకు విదితమే. అదే రోజు రాత్రి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): నటిపై దాడి కేసులో నిందితుడిని గుర్తించేందుకు బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సమీపంలోని మైలాన్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో మాత్రం నిందితుడి ఆనవాలు అస్పష్టంగా నిక్షిప్తమైనట్లు తెలుస్తున్నది. అక్కడి నుంచి కళింగ ఫంక్షన్ హాల్ చౌరస్తా, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పరిశీలించగా ఎక్కడా ఆచూకీ దొరకలేదు.
కేబీఆర్ పార్కు వాక్‌వేలో ఉన్న 64 సీసీ కెమెరాలు పనిచేయకపోవడంలో నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. ఇప్పటికే పార్కు చుట్టూ 76 సీసీ కెమెరాల ఫుటేజేలను వడపోశారు. ఒక్క దాంట్లో కూడా నిందితుడు ఆచూకీ నమోదు కాలేదు.
సీసీ కెమెరాలను తప్పించుకుతిరిగాడా?
సీసీ కెమెరాలను తప్పించుకుంటూ నిందితుడు పార్కు చుట్టూ తిరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని చిచ్చాస్ హోటల్ వద్ద కూడా సీసీ కెమెరాలు పరిశీలించగా అవి పార్కింగ్ వైపు ఫోకస్ లేకపోవడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు.
► గడిచిన మూడు రోజులుగా 20 మంది పోలీసులు చుట్టూ సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. నటి వద్ద నుంచి నిందితుడు ఫోన్ తస్కరించడంతో ఆ ఫోన్ సిగ్నల్స్ కోసం కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఫోన్‌లో ఉన్న నటి సిమ్ కార్డు తొలగించి నిందితుడు కొత్త సిమ్‌కార్డు వేసుకుంటాడేమోనన్న ఆలోచనతో పోలీసులు ఎప్పటికప్పుడు సిగ్నల్స్‌పై దృష్టి పెట్టారు.
► జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో తరచు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా సంబంధిత పోలీసులు ఏనాడూ దృష్టి పెట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు పనిచేసేలా చేసి ఉంటే నిందితుడిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని బాధితులు పేర్కొంటున్నారు.
ఇక్కడి పోలీసులు మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా అయిపోయాక పార్కు చుట్టూ డజన్ల సంఖ్యలో పోలీసులను మోహరించారు.
ఇంకా మొదలు కానీ మరమ్మతులు...
నటిపై ఆదివారం రాత్రి జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో దాడి జరగగా మూడు రోజులు గడుస్తున్నా వాక్‌వేలో ఉన్న 64 సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టగా కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా దాతల నుంచి విరాళాలు సేకరించి పార్కు చుట్టూ కెమెరాలు ఏర్పాటు చేశారు.
► ఈ కెమెరాలు ఏర్పాటు చేసిన సంస్థకు రూ. 15 లక్షలు బాకీ పడ్డట్లుగా తేలింది. ఫలితంగానే సదరు సంస్థ ఈ కెమెరాల నిర్వహణను గాలికి వదిలేసింది. నగర పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. తక్షణం రూ. 15 లక్షలు అందజేసేందుకు ముందుకొచ్చారు. పని చేయని కెమెరాలకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైతే సదరు సంస్థ మరమ్మతులకు ఇంకా ముందుకు రాలేదు.
కొత్తవి కూడా...
కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో ఇప్పుడున్న సీసీ కెమెరాలను బాగు చేసి అదనంగా మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్కడెక్కడ కెమెరాలు అవసరమో సర్వే చేయాలని కూడా నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో పార్కు చుట్టూ ఒక బృందం పర్యటించి కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయనుంది.
సీసీ కెమెరాలే దిక్కా..!
సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లు లేని కాలంలో అప్పటి పోలీసులు ఏదైనా ఘటన జరిగినప్పుడు దర్యాప్తు ఎలా చేసేవారు..? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతున్నది. తాజాగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వాక్‌వేలో సినీ నటి షాలూ చౌరాసియాపై దుండగుడు దాడి చేసి పరారు కాగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఇంకా సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పైనే ఆధారపడుతున్నారు.
ఇవి లేని కాలంలో అప్పటి పోలీసులు మిస్టరీని ఎలా ఛేదించేవారని ఓ ఉన్నతాధికారి పోలీసులను ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఎంతసేపూ నేరం జరిగినప్పుడు సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లపైనే ఆధారపడుతున్నారని శాస్త్రీయ దర్యాప్తు ఎందుకు జరగడం లేదని ఆయన నిలదీసినట్లుగా కూడా సమాచారం. నగరంలో ఏ ఘటన జరిగినా పోలీసులు హుటాహుటిన సీసీ కెమెరాలు పరశీలిస్తున్నారు.
ఇది ఒకందుకు నేరస్తులను పట్టుకునేందుకు ఉపయోగపడుతున్నా ఒక వేళ అక్కడ కెమెరా లేకపోతే ఇక ఆ నిందితుడిని పట్టుకోవడానికి మార్గమే లేదా అని ఉన్నతాధికారులు కొంత కాలంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఈ దిశలో ఆయా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. కేబీఆర్ పార్కు ఘటనలో ఇక్కడి పోలీసులకు సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లు ఉపయోగపడటం లేదు. దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలంటే మరింత శాస్త్రీయమైన పద్ధతులను అవలంభించాల్సిన పరిస్థితులు తలెత్తగా ఆ దిశగా ఉన్నతాధికారులు కూడా నిర్దేశం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment