
గూడు చెదిరిన పక్షులు
పక్షుల కిలకిలారావాలు... పురివిప్పిన మయూరాల మనోహర విన్యాసాలు... కోకిల గానాలు... మహా నగరానికి దూరమవుతున్నాయి. అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. భారీ నిర్మాణాలు, బహుళ అంతస్థుల భవనాల కోసం తొలగిస్తున్న కొండలు, గుట్టలు, చెట్టు, చేమ... జీవకోటి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పర్యావరణ అసమతౌల్యం, చెట్ల తొలగింపుతో అనేక రకాల పక్షులు చెదిరిపోతున్నాయి. బంజారాహిల్స్, కేబీఆర్ పార్కు, మెహిదీపట్నం, అంబర్‌పేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లోనే కాకుండా రాయదుర్గం, అత్తాపూర్, ఇంజాపూర్, ఆదిభట్ల, శంషాబాద్, టోలీచౌకి, మియాపూర్, మణికొండ, పుప్పాలగూడ, హఫీజ్‌పేట్ వంటి శివారు ప్రాంతాల్లోనూ పక్షుల మనుగడపైనీలినీడలు కమ్ముకున్నాయి. -సాక్షి, సిటీబ్యూరో/ రాయదుర్గం
చెదురుతున్న గూళ్లు
ఆకాశాన్ని తాకే భవనాలతో అలరారుతున్న కాంక్రీట్ జంగిల్‌లో పక్షులు గూళ్లు కట్టుకునేందుకు రవ్వంత చోటు కరువవుతోంది.తీతువు లాంటి కొన్ని రకాల పక్షులు బంజరు భూముల్లోనే గుడ్లు పెట్టి పొదుగుతాయి. కొన్నిరకాల పిట్టలు ముళ్ల పొదల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. గుబురుగా పెరిగే రావి, మర్రి, వేప చెట్లూ పక్షులకు ఆవాసాలే. కాకులు తుమ్మచెట్లపైన గూళ్లు కట్టుకుంటాయి. నెమళ్లు అడవి అంచున సేదదీరుతాయి. కానీ ఇప్పుడు అలాంటి భూములు, చెట్లు మచ్చుకైనా కనిపించడం లేదు. కొండలు, గుట్టలు, చెట్లు, చెరువులు జీవ వైవిధ్యానికి ఆనవాళ్లు. ఒకప్పుడు ఇలాంటి వాతావరణంతో ఉన్న అనేక ప్రాం తాలు ఇప్పుడు నగరంలో కలిసిపోయాయి. శేరిలింగంపల్లి ప్రాంతంలోని రాయదుర్గం, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, మధురానగర్, ప్రశాంతిహిల్స్, చిత్రపురి కాలనీ, గోపన్‌పల్లి, కూకట్‌పల్లి, బోడుప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లోని నిర్మాణాలు, భారీ ఎత్తున కొనసాగుతున్న క్వారీ పేలుళ్లతో పక్షుల గూళ్లు చెదిరిపోయాయి. పారిశ్రామికీకరణ సైతం వీటి మనుగడకు పెనుసవాల్‌గా మారింది.
నెమళ్లకు ఎంత కష్టమో...
రాయదుర్గం, నానక్‌రాంగూడ, గోపన్‌పల్లి వంటి ప్రాంతాల్లో మట్టితో కూడిన సహజసిద్ధ కొండలు, గుట్టల్లో నెమళ్లు కనువిందు చేస్తాయి. సర్వే నెంబర్ 83లో గుట్టపై పెద్ద సంఖ్యలో నెమళ్లు సందడి చేస్తున్నాయి. ఉదయం ఏడు గంటల లోపు, సాయంత్రం వేళ గుట్టల్లోకి వెళితే పురివిప్పి ఆడే మయూరాలు మనసు దోచుకుంటాయి. ఈ గుట్టకే ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. దీని చుట్టూ ఉన్న స్థలాన్ని టీఎస్‌ఐఐసీ ప్రైవేటు సంస్థలకు కేటాయించింది. క్వారీ పేలుళ్లతో నెమళ్ల ఉనికికే ముప్పు ఏర్పడుతోంది. చెరువులు కనుమరుగవుతుండడంతో నీటి లభ్యత కూడా జటిలంగానే మారింది.
ఈ పక్షులకు గడ్డుకాలం....
ప్రస్తుతం ఎన్నో జాతుల పక్షుల జీవనం ప్రమాదంలో పడింది. నెమళ్లతో పాటు, ఊదా తేనె పిట్ట, వడ్రంగిపిట్ట, పిగిలిపిట్ట, ఊర పిచ్చుకలు, చిన్న సైద, తీతువు, ఫ్లవర్‌పెకర్, కొంగలు, కోయిలలు, పావురాళ్లు, కాకులు, రామచిలుకలు, చమురుకాకి, నీటి కొంగలు, వంగపండు, పాలపిట్టలు, డేగలు వంటి అనేక రకాల పక్షులకు గూడు కట్టుకునేందుకు చోటేలేదు. ఇవి గుడ్లు పొదిగేందుకు అనువైన వాతావరణం లేక అంతరించిపోతున్నాయి. మున్ముందు అనేక రకాల పక్షులు అంతరించిపోయే వాటి జాబితాలో చేరే ప్రమాదం ఉందని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేపటి తరం కోసమైనా..
సహజంగా పెరిగిన చెట్లు, పొదలు పోయాయి. అందం కోసం రకరకాల చెట్లతో పార్కులను నింపేస్తున్నారు. వీటికి కొమ్మలు ఉండవు. దీంతో పక్షులు గూళ్లు కట్టుకోలేకపోతున్నాయి. రేపటి తరాల కోసం వీటిని కాపాడుకోవాలి. -రజని, వక్కలంక (కాల్‌బ్యాక్ స్వచ్ఛంద సంస్థ)
ఓ గంటైనా కేటాయించాలి
పక్షుల కిలకిలారావాలతో నిద్ర లేచే ఊరు ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. మనసుకు హాయినిస్తుంది. అలాంటి సహజమైన వాతావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ కనిపించే పక్షుల రక్షణ పైన దృష్టి పెట్టాలి. సజ్జలు, జొన్నలు వంటి గింజలు, నీళ్లు ఏర్పాటు చేసి వాటిని కాపాడేందుకు కృషి చేయాలి. -దేవకి జ్యోతి, పక్షి ప్రేమికులు