లింగ వివక్షతకు వ్యతిరేకంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద లెస్బియన్లు, గేలు సంయుక్తంగా అవగాహన నడక నిర్వహించారు.
హైదరాబాద్: లింగ వివక్షతకు వ్యతిరేకంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద లెస్బియన్లు, గేలు సంయుక్తంగా అవగాహన నడక నిర్వహించారు. నగర నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది లెస్బియన్లు, గేలు తమను కూడా సమాజంలో ఒకరిగా గుర్తించాలంటూ, ప్రేమించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ 5 కే రన్, 10 కే రన్ నిర్వహించారు.
క్రియేట్ క్యాంపస్ హైదరాబాద్, హైదరాబాద్ సాల్మానా అనే గ్రూపులతో పాటు స్నేహితుల బృందాలు పెద్ద సంఖ్యలో ఈ నడకలో పాల్గొన్నాయి. గత వారం ఓ చానెల్‌లో లెస్బియన్ల గురించి కించపరిచే రీతిలో ప్రసారాలు జరిగాయని దానికి నిరసగా కూడా తాము ప్లకార్డులు ప్రదర్శించామని వెల్లడించారు.
లెస్బియన్లు, గేలు అందరూ కలిసి చేస్తున్న ఈ నడకలో హక్కుల కోసం పోరాడటమే లక్ష్యంగా నినాదాలు చేసినట్లు వెల్లడించారు. మమ్మల్ని అసహ్యించుకోకండి.. కుదిరితే ప్రేమించండి... మాలోనూ ప్రేమ దాగి ఉంది, సమానత్వం కోసం పరిగెడతాం అన్న టీషర్ట్‌లను ధరించారు.