Hyderabad: కేబీఆర్‌ చుట్టూ 6 ఫ్లై ఓవర్లు  | 6 Flyovers Around KBR Park Get Wildlife Nod, More Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: కేబీఆర్‌ చుట్టూ 6 ఫ్లై ఓవర్లు 

Published Sat, Jul 13 2024 1:11 PM | Last Updated on Sat, Jul 13 2024 3:06 PM

6 flyovers around KBR Park get wildlife nod

కొత్త ప్రభుత్వం చర్యలు 

ఫ్లై ఓవర్లతో పాటు అండర్‌పాస్‌లు కూడా..

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి చేపట్టిన ఎస్సార్‌డీపీ లో భాగంగా గత ప్రభుత్వం చేయలేకపోయిన కొన్ని పనుల్ని ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో భాగంగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా సదుపాయాలకు అధిక ప్రాధాన్యమిచి్చంది. 

హెచ్‌ఎండీఏ పరిధి వరకు ట్రాఫిక్‌ చిక్కులు లేని సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం కోసం దాదాపు రూ.25 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఆ పనుల్ని ఐదు ఫేజ్‌ల్లో  చేయాలని భావించింది. అందులో భాగంగా తొలిదశలో కేబీఆర్‌ పార్కు కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్‌ చిక్కుల్లేకుండా చేసేందుకు ఆరు పనులకు దాదాపు రూ.586 కోట్ల అంచనాతో ప్రణాళిక రూపొందించింది. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి, ఎదురైన ఆటంకాలతో మెజార్టీ పనుల్ని వాయిదా వేసింది. ఆయా ఫేజ్‌ల్లోని పనులు మారిపోయాయి. ఐదు ఫేజ్‌లు సైతం మారిపోయాయి. అయినా ఐదు ఫేజ్‌ల్లో పేర్కొన్న పనుల్లో  చాలా పనుల్ని ఆ ప్రభుత్వం పూర్తిచేసింది.  

⇒ అప్పుడు ఫేజ్‌–1లో భాగంగా కేబీఆర్‌ పార్కు ఎంట్రన్స్‌ జంక్షన్, ఫిల్మ్‌నగర్‌ జంక్షన్, రోడ్‌ నెంబర్‌ 45 జంక్షన్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌–కేబీఆర్‌పార్కు ఎంట్రన్స్, రోడ్‌నెంబర్‌ 45– దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలనుకున్నారు. కానీ.. వీటిలో రోడ్‌నెంబర్‌ 45– దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ మాత్రమే పూర్తయింది. మిగతావి పూర్తికాలేదు. అందుకు కారణం కేబీఆర్‌ పార్కు ఎకో సెన్సిటివ్‌ జోన్‌లో ఉండటం, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కావాల్సి ఉండటంతో పాటు పర్యావేరణ వేత్తల అభ్యంతరాలు వంటి వాటితో ఆ పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు హైకోర్టులోనూ కేసులున్నట్లు సమాచారం.  

1. జూబ్లీ చెక్‌పోస్ట్‌ 
2. రోడ్‌ నెంబర్‌– 45 
3. ఎల్‌వీ ప్రసాద్‌  
4. బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌ 
5.మహారాజా అగ్రసేన్‌ 
6. ఫిల్మ్‌నగర్‌ .. 

వీటిలో బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌ వద్ద తొలుత ప్రతిపాదనలున్నప్పటికీ, అనంతరం తొలగించారు. తిరిగి ఇప్పుడు మళ్లీ అక్కడ కూడా ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. 

 ఫ్లై ఓవర్లతో పాటు అండర్‌పాస్‌లు సైతం నిర్మించనున్నారు. ట్రాఫిక్‌ ఫ్రీ కోసం చేపట్టే పనులకు ఎక్కువ నిధులు ఖర్చు కాకుండా ఉండేందుకు అండర్‌పాస్‌లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.  

సిటీ హార్ట్‌గా .. 
కేబీఆర్‌ పార్కు అనేది నగరానికి హార్ట్‌లా ఉండటంతో పాటు సంపన్న వర్గాలు, సినీతారలు, రాజకీయ ప్రముఖులు, తదితర వీఐపీలు నిత్యం సంచరించే ప్రాంతం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆ జంక్షన్‌పై దృష్టి సారించినట్లు తెలిసింది. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులకు సైతం అభ్యంతరాలు ఉండవనే ధీమాతో ప్రభుత్వం ఉంది.

సీఎం రేవంత్‌ చొరవతో..
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేబీఆర్‌ చుట్టూ ఆగిపోయిన ప్రాజెక్టుల్ని  చేపట్టే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు తెలిసింది.  మున్సిపల్‌ పరిపాలన శాఖ కూడా ఆయన వద్దే ఉండటం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తిరిగి దిగువ ప్రాంతాల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు సంబంధించి కన్సల్టెంట్‌ సేవల్ని జీహెచ్‌ఎంసీ కోరుతోంది. త్రీడీ డిజైన్‌లో వాటిని అందజేయాల్సిందిగా తెలిపింది. అంటే ప్రస్తుతం ఆయా జంక్షన్లలో పరిస్థితులు, ట్రాఫిక్‌ రద్దీ,  ఫ్లై ఓవర్లు పూర్తయితే ఎలా ఉంటాయి.. ట్రాఫిక్‌ చిక్కులు ఎలా తగ్గుతాయి.. సిగ్నల్‌ ఫ్రీగా ఎలా సదుపాయంగా ఉంటుంది అనే అంశాల్ని యానియేషన్‌ ద్వారా ప్రదర్శించాల్సి ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement