
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి భార్యపై ఓ వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేశాడు. కర్రతో తలపై బలంగా బాదడంతో తీవ్ర రక్తస్రావమై, అపస్మారక స్థితికి గురైన ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్చారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లో నివసించే ఐపీఎస్ అధికారి దుర్గాప్రసాద్ భార్య సుజాత మంగళవారం సాయంత్రం 5:30 ప్రాంతంలో కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్నారు. గౌని వెంకటరమణ (40) అనే వ్యక్తి ఆమెను అనుసరిస్తూ ఓ కర్రతో తలపై బలంగా కొట్టాడు. దాంతో తలకు తీవ్ర గాయమై, ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే చుట్టుపక్కల వాకర్లు బాధితురాలిని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఇదే సమయంలో అక్కడి నుంచి పరారవుతున్న వెంకటరమణను వాకర్లతో పాటు సెక్యూరిటీ గార్డులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన వాకర్లను భయాందోళనకు గురిచేసింది. కర్రతో పరుగులు తీస్తున్న వ్యక్తిని చూసి కొందరు వాకర్లు బయటకు పరుగులు తీశారు. కాగా బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిందితుని మానసిక స్థితిపై బంజారాహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు గత 20 రోజుల నుంచి రెక్కీ నిర్వహించి ఆమెను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డాడని వారి విచారణలో తేలింది. ఘటనాస్థలాన్ని పోలీసులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం బృందం పరిశీలించింది. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment