
కేబీఆర్ పార్క్‌కు నిజాం పేరా?
* పునః పరిశీలించాలంటూ కేసీఆర్‌కు పాల్వాయి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పేరును పెడుతున్నట్టు వార్తలు వచ్చాయని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడం కోసం చాలామంది చనిపోయారని గుర్తుచేశారు.
నిజాం బలగాలు, రజాకర్ల దాష్టీకానికి చాలా కుటుంబాలు బలయ్యాయని, తమ కుటుంబంపై కూడా దాడి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ముస్లింల మెప్పు పొందాలన్న కాంక్షతో నిజాం పేరు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. చాలామంది ముస్లింలు కూడా హైదరాబాద్ స్టేట్‌కు స్వాతంత్య్రం కోసం పోరాడిన సంగతిని మరువరాదన్నారు. రావి నారాయణ రెడ్డి పేరు గానీ, రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి పేరు గానీ, సాలార్‌జంగ్ బహదూర్ పేరు గానీ పెట్టాలని పాల్వాయి సూచించారు.