ravi narayana reddy
-
విలువలకు నిదర్శనం రావి జీవితం
కుటుంబం కోసం కాకుండా జీవితాంతం ప్రజల కోసం పరితపించిన తన తాత రావి నారాయణరెడ్డి జీవితం తనకు ఆదర్శమని ఆయన మనవరాలు రావి ప్రతిభారెడ్డి తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా హరిజనులు, సామాన్యుల అభ్యున్నతి కోసం తపిస్తూ సాధారణ జీవితాన్ని గడిపారని.. ఎంపీగా పొందిన పింఛన్‌ను సైతం ప్రజల అవసరాల కోసం ఖర్చు చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. విలువలు, దార్శనికత కలిగిన రావి నారాయణరెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి ప్రభావం తనపై ఎంతో ఉందని ప్రతిభారెడ్డి చెప్పారు. తాత చూపిన మార్గంలో పయనించాలని ఉద్యోగాన్ని వదిలేశానని, ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాటం.. అందులో పాల్గొన్న వీరుల చరిత్ర తెలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు.. అయినా నిగర్వి.. రావి నారాయణరెడ్డి ఓ నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు. నీతి, నిజాయతీ కోసం ప్రాణం ఇచ్చేవారు. విలువలకు ఆయన ప్రాధాన్యతను ఇచ్చే వారు. ఆయన 1952 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా, ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారంటేనే ఆయన నీతి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంపీగా నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్న గర్వం ఆయనలో ఎప్పుడూ కనిపించేది కాదు. హరిజనులను ప్రేమించే వారు.. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ తాత సాధారణ జీవితం గడిపే వారు. తనకున్న 500 ఎకరాల భూమిని హరిజనులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంట్లో కార్లు కూడా ఉండేవి కాదు. ఆయనకు రెండు, మూడు జతల దస్తులే ఉండేవి. నానమ్మ బంగారు నగలను గాంధీజీ హరిజన సేవా సంఘానికి ఇచ్చారు. హిమాయత్‌నగర్‌లో మా ఇంటికి ఎప్పడూ భువనగిరి నుంచి వచ్చే వారికి నానమ్మ అన్నం పెట్టేది. తినకుండా ఎవరినీ వెళ్లనిచ్చే వారుకాదు. తాత చివరి దశలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి చూడటానికి వచ్చి నీకు ఏమైనా కావాలా అని అడిగితే కుటుంబం కోసం కాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయాలని అడిగారు. తాతయ్యతో ఎంతో అనుబంధం .. చిన్నతనం నుంచి హిమాయత్‌నగర్‌లోని మా ఇంట్లో తాతయ్య రావి నారాయణరెడ్డి దగ్గరే పెరిగాను. నాపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. నేను 8, 9 తరగతులు చదువుతున్న వయసులో హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలు, సమావేశాలతోపాటు రెడ్డి హాస్టల్‌కు నన్ను ఎప్పుడూ తీసుకెళ్లేవారు. నిజాయితీగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని నాకు చెప్పేవారు. ఆడపిల్లలకు చదువు అవసరమనేవారు. నన్ను కూడా బాగా చదువుకోమనే వారు. ఇంట్లో నానమ్మ రావి సీతాదేవి, మేనేత్త రావి భారతి, అమ్మానాన్నలు రావి ఉర్మిల, సంతో‹Ùరెడ్డిలు ఉండేవారు. అప్పుడున్న పరిస్థితులను చర్చించే వారు. స్త్రీలకు సమాన హక్కులు, విద్య, రైతాంగ సమస్యలు, సామాజిక విప్లవం, రాజకీయ చైతన్యం గురించి చెప్పేవారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, విద్యా, వైద్యసౌకర్యాలపై చర్చించే వారు. ఆయా అంశాలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. తాతయ్య ఆశయాల సాధన కోసం 17 సంవత్సరాలు చేసిన ఉద్యోగం వదిలి ఆయన చూపిన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నా. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనుంది.. తాత కోరుకున్న సమ సమాజం కోసం పనిచేస్తా. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 4 వేల కుటుంబాలకు ఏదైనా మంచి చేయాలన్న తాత ఆలోచనలను ముందుకు తీసుకెళ్తా. బొల్లేపల్లిలోని పాఠశాలతో నాకు అనుబంధం ఉంది. దానికోసం నాకు ఏమైనా చేయాలని ఉంది. గత సంవత్సరం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. జూన్ 4న తాత జయంతి సందర్భంగా టెన్త్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నగదు బహుమతులు అందజేశాం. బొల్లేపల్లిలో శిథిలావస్థలో ఉన్న తాత పుట్టిన ఇంటిని బాగు చేసి సంక్షేమ సెంటర్‌గా తీర్చిదిద్దుతా. అక్కడ స్త్రీల సాధికారత కోసం కంప్యూటర్ విద్య, కుట్టు పనులు నేర్పిద్దామనుకుంటున్నా. నేటి రాజకీయం డబ్బుమయం.. ప్రస్తుతం రాజకీయాలు డబ్బులమయమయ్యాయి. తాత లాగా ముక్కుసూటిగా మాట్లాడే వారు ఇప్పుడు రాజకీయాల్లో నెగ్గలేరు. ప్రస్తుతం నాయకులు పార్టీలు మారడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ప్రజలు సంక్షేమ పథకాలకు, డబ్బులకు అలవాటుపడ్డారు. ఓట్ల కోసం నాయకులు ఇస్తున్న డబ్బుతో చిన్నచిన్న అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకునికి ఐదేళ్ల కాలానికి చేసే అభివృద్ధి విజన్ ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలిసి ఉండాలి. అలాంటి వారినే ప్రజలు ఎన్నుకోవాలి. - యంబ నర్సింహులు -
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు: ఈ విషయాలు మీకు తెలుసా?
మీకు తెలుసా? ►1952 ఎన్నికల సమయంలో తెలంగాణతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన కొన్ని జిల్లాలతో కలసి హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. అప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో తెలంగాణ వరకు చూస్తే కాంగ్రెస్‌కు 38 సీట్లు, పీడీఎఫ్ 36, సోషలిస్ట్ పార్టీకి 11, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్‌కు మూడు సీట్లు రాగా ఇండిపెండెంట్లు ఏడుగురు గెలిచారు. అప్పట్లో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. కాని ఆ పార్టీ వారంతా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్నికలలో పోటీచేశారు. అప్పట్లో సోషలిస్టు పార్టీ కూడా కాస్త బలంగానే ఉండేది. ► 1956లో ఆంధ్ర, తెలంగాణ విలీనం అయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, 1957లో మాత్రం తెలంగాణ భాగానికే ఎన్నికలు జరిగాయి. దానికి కారణం 1955లో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు జరగడమే. ఆంధ్రలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు 1962 వరకు పదవిలో ఉండే అవకాశాన్ని పార్లమెంటు కలి్పంచింది. తెలంగాణలో 1957లో రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 68, పీడీఎఫ్ 22, సోషలిస్టు 2, ప్రజాపార్టీ ఒకటి, ఎస్.సి.ఎఫ్ ఒకటి గెలుచుకోగా, ఇండిపెండెంట్లు పది మంది గెలిచారు. తొలి ఎన్నికల్లోనే రెండు సభలకు ఎన్నిక సాక్షి, యాదాద్రి: తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో పీడీఎఫ్ పార్టీ తరఫున పోటీచేసి భువనగిరి ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్ సభ్యునిగా రావినారాయణరెడ్డి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచారు. భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. రావి నారాయణరెడ్డి స్వగ్రామం బొల్లేపల్లి. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల తీరే వేరు. వారి రూటే సెపరేటు. అధికారంలోకి వస్తామన్న ధీమానో...కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదనే బెంగనో కానీ, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెగ ఉబలాటపడిపోతున్నారు. ఆఖరుకు కుమారుడి కంటే తనకే టికెట్ ముఖ్యమని, అన్ని కలిసి వస్తే మంత్రి పదవి దక్కుతుందని నగరానికి చెందిన ఓ మాజీ ఎంపీ భావిస్తూ, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎంపీలేమో ఏకంగా సీఎం సీటునే ఆశిస్తున్నారు. బీజేపీకి పూర్తి భిన్నంగా కాంగ్రెస్ వైఖరి ఉందనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో అందరూ పెద్దనాయకులే.. అందరూ సీఎం పదవికి పోటీదారులే. అందుకే వారంతా ఎప్పుడో మరో ఐదారు నెలలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా గడప ముందున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే సిద్ధమైపోతున్నారు. అన్ని బాగుండి అధికారంలోకి వస్తే... సరేసరి. ఒకవేళ ఓడిపోయినా.. తిరిగి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎలాగూ ఉంటుందన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కువ అన్న ప్రచారమూ ఉంది. ఇప్పుడున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికై కాంగ్రెస్ వాణిని, రాష్ట్ర సమస్యలను గట్టిగానే వినిపించారన్న పేరు ఉంది. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ ఈసారి కొత్తగా ఎన్నికల సంఘం అవకాశం కరీంనగర్ అర్బన్: నామినేషన్‌కు సాంకేతికతను జోడించింది ఎన్నికల సంఘం. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇంట్లో నుంచే నామినేషన్ వేసేలా ఆన్లైన్లో వెసులుబాటు కల్పించింది. దీంతో అభ్యర్థులు స్వదేశం, విదేశం ఎక్కడి నుంచైనా నామినేషన్ దాఖలు చేయొచ్చన్న మాట. SUVIDHA.ECI.GOV.IN యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించారు. నిర్దిష్ట విధానంలో సాధారణ నామినేషన్ తరహాలోనే ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. దరఖాస్తు ఫారంలో దశలవారీగా అభ్యర్థుల వివరాలు పొందుపరచాలి. వివరాలన్నింటినీ సమర్పించిన తరువాత నామినేషన్ దాఖలు చేసేందుకు ఉన్న నిర్ణీత సమయంలో స్లాట్‌లో సమయాలను బుక్ చేసుకోవాలి. రిటర్నింగ్ అధికారిని నేరుగా కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వివరాలతో కూడిన పత్రాలు మూడుసెట్లు అందించాల్సి ఉంటుంది. నామినేషన్ చివరి రోజు లోపుగా ఆన్లైన్ సెట్లను తప్పనిసరిగా అందించాలి. రిటర్నింగ్ అధికారికి నేరుగా అందిస్తేనే నామినేషన్ దాఖలు చేసినట్లుగా భావిస్తారు. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటి విషయంలో నేరుగా అభ్యర్థులు లేక వారి తరఫు ప్రతినిధులు హాజరు కావాల్సి ఉంటుంది. -
ఎమ్మెల్యేలయ్యారు.. ఎంపీలూ అయ్యారు!
నల్గొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా విజయం సాధించి పదవులకు వన్నె తెచ్చారు. ఏ పదవిలో ఉన్నా తమను ఎన్నుకున్న ప్రజలకు సేవే లక్ష్యంగా ముందుకు సాగారు. కొందరు నాయకులు ముందు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎంపీలుగా గెలిచారు. మరికొందరు ముందు ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. రావి నారాయణరెడ్డి మాత్రం తొలి ఎన్నికల్లోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు రావి నారాయణరెడ్డి : 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున భువనగిరి ఆసెంబ్లీ, నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రావి నారాయణరెడ్డి రెండు చోట్ల విజయం సాధించారు. ఆ వెంటనే భువనగిరి ఆసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. అనంతరం 1957లో భువనగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1962లో మరోసారి నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు దేశంలో అత్యధిక మెజార్టీ సాధించడంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రావి నారాయణరెడ్డికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పార్లమెంట్ నూతన భవనాన్ని రావినారాయణరెడ్డి చేత ప్రారంభించారు. బొమ్మగాని ధర్మభిక్షం : సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మభిక్షం, 1962లో నల్లగొండ నుంచి, 1967లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1991, 1996లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. పేదవర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే నాయకునిగా ఆయనకు జనం మదిలో నిలిచిపోయారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి : 1957లో సూర్యాపేట, 1967లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన భీంరెడ్డి నర్సింహారెడ్డి.. 1984, 1991లో రెండు సార్లు మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికయ్యారు. పీడిత ప్రజల సమస్యలు, భూపోరాటలతో ఆయన జీవితం ప్రజాసేవకే అంకితమైంది. చకిలం శ్రీనివాసరావు : నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన చకిలం శ్రీనివాసరావు 1967, 1972 నల్లగొండ నుంచి రెండు సార్లు, 1983లో మిర్యాలగూడెం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ఎం.రఘుమారెడ్డి : టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన మల్రెడ్డి రఘుమారెడ్డి 1984లో నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1989లో నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం ప్రభంజనంలో గెలిచిన ఆయన ప్రజలకు చేరువయ్యారు. రవీంద్రనాయక్ : గిరిజన నాయకుడు రవీంద్రనాయక్ 1978, 1983లో దేవరకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఈయన కొంతకాలం క్రియాశీలక రాజకీయలకు దూరంగా ఉన్నారు. 2004లో వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి : నల్లగొండ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆ వెంటనే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సా«ధించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి : కోదాడ, హూజూర్నగర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి : మునుగోడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు 1967, 1972, 1978, 1983, 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. -
కేబీఆర్ పార్క్‌కు నిజాం పేరా?
* పునః పరిశీలించాలంటూ కేసీఆర్‌కు పాల్వాయి లేఖ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు నిజాం పేరును పెడుతున్నట్టు వార్తలు వచ్చాయని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ, హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడం కోసం చాలామంది చనిపోయారని గుర్తుచేశారు. నిజాం బలగాలు, రజాకర్ల దాష్టీకానికి చాలా కుటుంబాలు బలయ్యాయని, తమ కుటుంబంపై కూడా దాడి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ముస్లింల మెప్పు పొందాలన్న కాంక్షతో నిజాం పేరు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. చాలామంది ముస్లింలు కూడా హైదరాబాద్ స్టేట్‌కు స్వాతంత్య్రం కోసం పోరాడిన సంగతిని మరువరాదన్నారు. రావి నారాయణ రెడ్డి పేరు గానీ, రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి పేరు గానీ, సాలార్జంగ్ బహదూర్ పేరు గానీ పెట్టాలని పాల్వాయి సూచించారు. -
సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్
-
సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్
హైదరాబాద్: తమ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్న సోనియా గాంధీకి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలుసా అని అడిగారు. వీర తెలంగాణ నాది.. వేరు తెలంగాణ కాదన్న రావి నారాయణరెడ్డి గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. చీలికవాదం తెలంగాణకు హానికరమని రావి నారాయణరెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి జగన్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం విభజించిన తర్వాత ఇక్కడి ఆస్తుల విలువలు పడిపోతే ఆ విలువ సోనియా ఇస్తారా, చంద్రబాబు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. భారతదేశ పౌరసత్వం తీసుకున్న వారిని ఇటలీకి తిరిగి వెళ్లిపోమంటే ఒప్పుకుంటారా అంటూ అడిగారు. 30 ఏళ్లుగా ఉంటున్న సోనియాకే భారతదేశంపై ఇంత అధికారం ఉంటే వందల ఏళ్లుగా ఉంటున్న తమకు ఎంత అధికారం ఉండాలని సూటిగా ప్రశ్నించారు. ఈ మాట అంటే కాంగ్రెస్ నాయకులు కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోతారని జగన్ ఎద్దేవా చేశారు. ఓట్ల, సీట్ల కోసం విభజించే రాజకీయాలు తెరమరుగు కావాలని ఆకాంక్షించారు. సోనియా గుండెలు అదిరేలా, కిరణ్-చంద్రబాబు గూబలదిరేలా సమైక్య గళాన్ని వినిపించాలన్నారు. తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా అంటూ సభలోని వారిని జగన్ ప్రశ్నించగా 'నో' అనే సమాధానం వచ్చింది. విభజన బిల్లు ఆపే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకూ పోరాడుదాం.. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం, ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే నేతనే ప్రధానిని చేద్దామన్నారు. -
ప్రజల మనిషి రావి నారాయణరెడ్డి
భువనగిరి, న్యూస్‌లైన్ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నిజాం ప్రభువుల గుండెల్లో దడ పుట్టించిన వ్యక్తుల్లో నారాయణరెడ్డి ముఖ్యులు. ఉన్నత కుటుంబంలో పుట్టినా పేదవాడి కష్టసుఖాలు తెలుసుకుంటూ వారిలో ఒకరిగా బతుకుతూ ప్రజల హృదయాల్లో చెరగని గూడు కట్టుకున్న మహోన్నత ధీరోదాత్తుడు రావినారాయణరెడ్డి. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908 జూన్ 4న భూస్వామ్య కుటుంబంలో ఆయన జన్మించారు. అభ్యుదయ భావాలతో 1930లో స్వాతంత్య్ర పోరాటంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో తెలంగాణ ప్రతినిధిగా హైదరాబాద్ రాష్ర్టం నుంచి పాల్గొన్నారు. 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన సంఘం ద్వారా కమ్యూనిస్టు సాయుధ ఉద్యమాన్ని నడిపారు. ప్రజా వ్యతిరేకులైన నైజాం పాలకులకు, వారి తాబేదార్లయిన భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా దళాలను ఏర్పాటు చేసి సాయుధ పోరాటాలు నడిపిన వీరోచిత సేనాని. భూమి లేని నిరుపేదలకు తన స్వంత భూమిని 200 ఎకరాలు దానం చేశారు. 1991 సెప్టెంబర్ 7న ఆయన తుదిశ్వాస విడిచారు. సమావేశాలకు మారువేషంలో వచ్చేవారు నైజాం నవాబులు తెలంగాణ పోరాటయోధులపై దమనకాండకు దిగుతుండడంతో వారి బారినుంచి తప్పించుకునేందుకు రావి నారాయణరెడ్డి మారువేషాల్లో తిరిగేవారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసేందుకు ఆయన రాత్రి వేళల్లో మారువేషం వేసుకొని అక్కడికి వెళ్లి సమావేశాలు నిర్వహించి వారిని చైతన్యం చేసేవారు. అప్పట్లో కమ్యూనిస్టు నాయకులంతా బొల్లేపల్లి కేంద్రంగా ఉద్యమాలు నిర్మించేవాళ్లు. ముగ్ధుం మొయినొద్దీన్, పుచ్చలపల్లి సుందరయ్య, ఆరుట్ల రాంచంద్రారెడ్డి దంపతులు వంటి వారెందరో ఈ ఊరికి వచ్చేవారు. - పడాల మధుసూదన్, రావి నారాయణరెడ్డి అనుచరుడు, బొల్లేపల్లి రెండు సంవత్సరాల జైలు జీవితం గడిపా సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడుతున్న బీఎన్‌రెడ్డి నాయకత్వంలో నేను పాల్గొన్నా. అందుకు గాను రెండు సంవత్సరాలు జైలుజీవితం గడిపాను. నాతో పాటు ఇదే గ్రామానికి చెందిన పొడపంగి భిక్షం, సీహెచ్.వీరయ్య, కొండ నర్సయ్య, పి.వీరయ్య, కాకి చంద్రారెడ్డి దళంలో సభ్యులుగా పనిచేశారు. వరంగల్ జిల్లా దాట్ల గ్రామంలో నైజాం సైన్యం దొరలకు వత్తాసు పలికి గ్రామంలోకి ఎవ్వరినీ రాకుండా అడ్డుకుంటున్నట్లు వార్త తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్లి మహిళలచే నైజాం సైనికుల కళ్లల్లో కారం కొట్టించి ఎదురుదాడికి పాల్పడ్డాం. అనంతరం గ్రామంలో ఎర్రజెండాలను ఎగురవేశాం. అదే విధంగా సర్వారం గ్రామంలో అగ్రకులస్తులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే తమ దళ సభ్యులు మారువేషాల్లో అక్కడకు చేరుకొని తుపాకులతో దాడి చేసి గ్రామంలో ఉన్న చెట్టుకు ఎర్రజెండాను ఎగురవేశాం. అదే విధంగా ఆత్మకూర్.ఎస్ మండలం కోటపహాడ్ గ్రామంలో పోలీస్‌లకు, కమ్యూనిస్టులకు జరిగిన దాడిలో ఊదరబాంబు సంఘటనలో పోలీసులు చనిపోయేందుకు కీలకపాత్ర పోషించాను. మహారాష్ట్రలోని జాల్నా జైలులో ఒక సంవత్సరం, గుల్బర్గా జైలులో ఒక సంవత్సరం, వరంగల్ జైలులో ఆరు నెలలు జైలు జీవితం గడిపాను. -కుశలపల్లి నారయ్య, రావిపహాడ్, మోతె (మం)