
కేబీఆర్ పార్కు
సాక్షి, సిటీబ్యూరో: కేబీఆర్ పార్కు చుట్టూ రూ.586 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకున్న ఫ్లై ఓవర్ల పనులు అగమ్య గోచరంగా మారాయి. టెండర్లు పూర్తయి కూడా దాదాపు రెండున్నరేళ్లు దాటినా పనులు ప్రారంభం కాలేదు. పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లతో పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు చేపట్టిన ఆందోళన లతో పనులకు బ్రేక్ పడటం తెలిసిందే. అక్కడ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎకో సెన్సిటివ్ జోన్ అంశానికి సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉంది. అప్పటి దాకా ఏమీ చేయ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టెండర్లను రద్దు చేసుకునే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే దాదాపు నాలుగునెలల క్రితం లేఖ రాసినట్లు సమాచారం. టెండరు పొందిన కాంట్రాక్టరుకు 24 నెలల్లో పనులు చేసేందుకు స్థలాన్ని అప్పగించని పక్షంలో నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో ఇందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
సిగ్నల్ ఫ్రీ కోసం...
ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నగరంలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం దాదాపు రూ.25 వేల కోట్లతో ప్రణాళికలు రూపొం దించడం తెలిసిందే. ఎస్సార్‌డీపీలో మొత్తం ఐదు దశలుండగా, తొలిదశలో తొలిప్యాకేజీ కేబీఆర్‌చుట్టూ ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. అందులో ఆరు ముఖ్యమైన పనులున్నాయి. అవి..
1. కేబీఆర్‌పార్కు ఎంట్రెన్స్ జంక్షన్
2. ఫిల్మ్‌నగర్ జంక్షన్
3. రోడ్ నెంబర్ 45 జంక్షన్
4. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్
(ఇక్కడ రోడ్డు వెడల్పుతోపాటు పాదచారులకు సదుపాయాలు, ప్రత్యేక బస్‌బేలు, జాగింగ్‌ట్రాక్ తదితరమైనవి ఉన్నాయి)
5. ఎన్‌ఎఫ్‌సీఎల్– కేబీఆర్‌పార్క్ ఎంట్రెన్స్
6. రోడ్ నెంబర్ 45 – దుర్గంచెరువు జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్.
వీటిల్లో దుర్గంచెరువు జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు మాత్రం ప్రారంభం కాగా, ఎకో సెన్సిటివ్‌జోన్ అంశంతో ముడిపడి ఉన్నందున మిగతా ఐదు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వీటి రద్దు కోసం ప్రభుత్వానికి రాయడంతో ఇవి కార్యరూపం దాలుస్తాయా.. లేదా అనే సంశయాలు నెలకొన్నాయి. అన్నీ అనుకూలిస్తే కార్యరూపం దాల్చేందుకు ఎంత సమయం పడుతుందన్నది కూడా అంతుపట్టకుండా ఉంది.
దాదాపు రూ. 25వేల కోట్ల ఎస్సార్‌డీపీ పనుల్లో దిగువ పనులున్నాయి.
7 స్కైవేలు : 135 కి.మీ.
11 మేజర్ కారిడార్లు: 166 కి.మీ.
68 మేజర్ రోడ్లు: 348 కి.మీ.
ఇతర రోడ్లు: 1400 కి.మీ.
గ్రేడ్ సెపరేటర్లు: 54
♦ ఇవి పూర్తయితే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, బాచుపల్లి, పటాన్‌చెరు, ఆబిడ్స్, చార్మినార్, ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ కారిడార్లలో సమస్యలు పరిష్కారమవుతాయి.
♦ చింతల్‌కుంట, అయ్యప్పసొసైటీ అండర్‌పాస్‌లు, కామినేని, మైండ్‌స్పేస్ జంక్షన్ల ఫ్లై ఓవర్ల పనులు పూర్తయి ఇప్పటికే అందుబాటులోకి రాగా, షేక్‌పేట, ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్లలో రూ.333.55 కోట్ల పనులు, బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లలో రూ.263.09 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు వివిధ ప్రక్రియల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment