ఓబులేసుకు ప్రాణాంతక వ్యాధి!
- జల్సాల కోసమే అపహరణ యత్నం
- అరెస్టుకు ముందు ఆత్మహత్యకు ప్రణాళిక
- గతంలో ఓ మాజీ ఐఏఎస్ మనవడి కిడ్నాప్
- చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డి అపహరణకు యత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు(37) ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శుక్రవారం మీడియా సమావేశానికి ముందు అతన్ని పోలీసులు కిడ్నాప్ యత్నంపై విచారించారు. ఈ సందర్భంగా నిందితుడు పలు వివరాలను వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 19న కేబీఆర్ పార్కు వద్ద ఘటన తరువాత ఓబులేసు రాత్రి 11 గంటలకు కర్నూలుకు చేరుకుని ఓ లాడ్జిలో బసచేశాడు.
తన తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్న ఘటనను టీవీలో చూశాడు. దీంతో తనను పోలీ సులు ఎలా అయినా పట్టుకుంటారని భావించి ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. రాత్రి 11.30 సమయంలో బజారుకు వెళ్లి పురుగుల మందు తెచ్చుకున్నాడు. తర్వాత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. కొద్ది సేపటికే పోలీసులు వలపన్ని అతన్ని పట్టుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా నిందితుడిని ప్రాణాలతో పట్టుకునే అవకాశం దక్కేది కాదని అధికారులు పేర్కొన్నారు.
జల్సాల కోసం బ్యాంకాక్..
ఓబులేసు ఎక్కువ కాలం జీవించలేని ఓ వ్యాధి తో బాధపడుతున్నాడు. బతికినన్ని రోజులు ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతో జల్సాలకు అలవాటుపడ్డాడు. గత ఫిబ్రవరిలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి మనవడిని కిడ్నాప్ చేసి వసూలు చేసిన రూ. 10 లక్షలు అయిపోవడంతో మళ్లీ అపహరణకు యత్నించాడు. ఈసారి వసూలు చేసిన డబ్బుతో బ్యాంకాక్ వెళ్లి జల్సా చేయాలని భావించినట్లు విచారణలో వెల్లడైంది.
చంచల్‌గూడ జైలుకు ఓబులేసు....
ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏకే-47 లో పోలీసులకు 17 బుల్లెట్లు మాత్రమే లభ్యమవగా, మిగతా వాటి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులు ఓబులేసును ఏడు రోజులు పోలీసు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఫిబ్రవరిలో కిడ్నాప్ ఉదంతంపై బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లేనిపక్షంలో సుమోటోగా కేసు నమోదు చేస్తామన్నారు. మరోపక్క ఓబులేసును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. గండిపేటలోని గ్రేహౌండ్స్ నుంచి గత ఏడాది డిసెంబర్‌లో ఏకే-47 చోరీ అయిందని అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్‌రావు ఫిబ్రవరి 3న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చోరీ అయిన రైఫిల్ కేబీఆర్ కాల్పుల ఘటన స్థలంలో లభ్యం కావడంతో నార్సింగ్ పోలీసులు నమోదు చేసిన చోరీ కేసు మిస్టరీ కొలిక్కి వచ్చింది.
ఓబులేసు అద్దె ఇంట్లో తనిఖీలు...
ఓబులేసు ఉంటున్న నివాసాన్ని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. నార్సింగి వైఎస్సార్ చౌరస్తా ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అతను కొన్ని నెలలుగా నివాసముంటున్నాడు. అర్థరాత్రి పోలీసులు పెద్దసంఖ్యలో నార్సింగి గ్రామానికి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం ఓబులేసు ఇక్కడే అద్దెకు ఉన్నాడని తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌కు గురైన చైన్ స్నాచర్ శివ అద్దెకు ఉండేవాడు. సంచలనం సృష్టించిన ఈ రెండు కేసుల నిందితులు నార్సింగిలోనే తలదాచుకోవడం గమనార్హం.