
బుధవారం నిత్యానందరెడ్డి కారులో ఓబులేసు వదిలి పారిపోయిన ఏకే 47. మీడియాతో మాట్లాడుతున్న నిత్యానందరెడ్డి
అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌నకు యత్నం
కేబీఆర్ పార్కులో కలకలం
కారులోకి దూరి ఏకే 47 తుపాకీతో బెదిరింపు
ఘాతుకానికి పాల్పడింది ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు
నిత్యానందరెడ్డి సోదరుడు వచ్చి ప్రతిఘటించడంతో విచక్షణరహితంగా కాల్పులు..
కారు అద్దాల్లోకి 3, పైకప్పులోంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లిన వైనం
దొరికిపోతానని భావించి ఆయుధం, బ్యాగ్‌లను
వదిలి పారిపోయిన కానిస్టేబుల్
12 గంటల్లోనే నిందితుడిని గుర్తించిన పోలీసులు
నిత్యానందరెడ్డికి పలువురు ప్రముఖుల పరామర్శ
ఘటనపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్:
బుధవారం ఉదయం 7.15..
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు..
వాకింగ్‌కు వచ్చిన వారితో పార్కు సందడిగా ఉంది..
ఇంతలో ఒక్కసారిగా ధన్..ధన్..ధన్.. మంటూ కాల్పుల శబ్దం..! ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా తూటాల మోతతో దద్దరిల్లింది!! ఈ కాల్పులకు తెగబడింది ఓ కానిస్టేబుల్. అరబిందో ఫార్మా సంస్థ వైస్ చైర్మన్ కంభం నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. సమయానికి నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి వచ్చి ప్రతిఘటించడంతో.. ఆయన చేయి కొరికి, తుపాకీని అక్కడే వదిలేసి పారిపోయాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగించారు. 12 గంట ల్లోనే నిందితుడిని గుర్తించారు. అతడు అంబర్‌పేటలోని స్టేట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్(ఎస్‌ఏఆర్‌సీపీఎల్)లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఓబులేసుగా తేలింది. కాల్పులకు వాడిన ఏకే-47 రైఫిల్‌ను గతేడాదే ఇతడు అపహరించినట్లు వెల్లడైంది.
అసలేం జరిగింది..?
సరిగ్గా ఉదయం 6.15 గంటలకు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కంభం నిత్యానంద రెడ్డి కేబీఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వచ్చారు. గంటపాటు వాకింగ్ చేసిన తర్వాత ఆయన పార్కు ప్రధాన గేటుకు 400 మీటర్ల దూరంలో పార్క్ చేసిన తన ఆడి కారు (ఏపీ 09సీఎం 2367) వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఫుట్‌పాత్‌పై ఓబులేసు ఆయన కోసం మాటువేశాడు. నిత్యానంద రెడ్డి కారు డోర్ తీసి డ్రైవర్ సీటులో కూర్చుని సీటు బెల్టు పెట్టుకుంటున్నారు. ఇంతలో కారు ఎడమ వైపు డోర్‌ను తీసుకొని భుజానికి పెద్ద బ్యాగు తగిలించుకున్న ఓబులేసు కారులోకి ప్రవేశించాడు. బ్యాగు నుంచి ఏకే 47 తీసి నిత్యానందరెడ్డికి గురిపెట్టాడు. ‘కారు ముందుకు పోనీ..’ అంటూ గద్దించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన నిత్యానందరెడ్డి.. ‘ఎవరు నువ్వు.. డబ్బులు ఎంత కావాలన్నా ఇస్తా వెళ్లిపో..’ అని అన్నారు. అయినా అతడు కారును ముందుకు పోనీమంటూ రెట్టించాడు. ఈ సందర్భంగా నిత్యానందరెడ్డి ఓబులేష్‌ను గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ఇద్దరి పెనుగులాటలో కారు అటూఇటూ ఊగడాన్ని అప్పుడే వాకింగ్ ముగించుకొని వస్తున్న నిత్యానంద రెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి గమనించారు. వెంటనే ఎడమవైపున్న వెనక డోరు తీసుకొని కారులోకి ప్రవేశించాడు. ఓబులేష్ మెడను గట్టిగా పట్టుకున్నారు. ఈ పరిణామంతో బెదిరిపోయిన అతడు కాల్పులకు తెగబడ్డాడు. నిత్యానందరెడ్డి సోదరుడు తుపాకీ బ్యారల్‌ను పైకి లేపడంతో 3 తూటాలు కారు ముందున్న అద్దాలలోకి దూసుకుపోయాయి. మరో 2 బుల్లెట్లు కారు పైకప్పు లోంచి దూసుకుపోయాయి. కదలడానికి వీలు లేక పోడంతో ఇక దొరికి పోవడం ఖాయమని ఓబులేష్ భయపడ్డాడు. ప్రసాద్‌రెడ్డి రెండు చేతులను కొరికి విదిలించుకొని కారు డోర్ తీసుకొని అక్కడ్నుంచి పరారయ్యాడు. ఏకే 47 తుపాకీ, రెండు బ్యాగులను అక్కడే వదిలివేసి, అన్నపూర స్డూడియో రోడ్డు వైపు పారిపోయాడు.
పట్టించిన రశీదు..
కాల్పుల సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు 15 నిమిషాల తర్వాత ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలు, క్లూస్ టీంలతో అణువణువూ గాలించి ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఏకే 47 తుపాకీపై, కారు డోర్‌పైన వేలిముద్రలను సేకరించారు. ఓబులేష్‌కు చెందిన రెండు బ్యాగ్‌లను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కారు పరిసరాల్లో 8 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓబులేష్ బ్యాగ్‌లో కొత్త బట్టలు, వాటిని కొనుగోలు చేసిన రశీదు, కూల్‌డ్రింక్స్ బాటిల్, లుంగీ తదితర వస్తువులు లభ్యమయ్యాయి. ఈ రశీదు ఆధారంగా రెండ్రోజుల క్రితం ఓబులేష్ మెహదీపట్నంలోని చందనా బ్రదర్స్‌లో బట్టలు ఖరీదు చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు చందనాబ్రదర్స్‌కు వెళ్లి అతడు బట్టలు కొన్న రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లో అతని కదలికలు స్పష్టంగా కనిపించాయి. బట్టలు సెలెక్ట్ చేసుకోవడం, బిల్ కట్టడం, బయటికి వెళ్లే సమయంలో ఇలా మూడు సార్లు టీవీ కెమెరాల్లో అతడి దృశ్యాలు పోలీసులకు లభించాయి. ఈ దృశ్యాల్లో ఉన్న వ్యక్తి.. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఒకరేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. చివరికి అతడు కానిస్టేబుల్ ఓబులేషే అని తేలింది. దీంతో అతడి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఇంట్లో పలు కీలక పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓబులేష్ తన స్వస్థలం అనంతపురానికి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఓ ప్రత్యేక పోలీసు బృందం హుటాహుటినా అక్కడికి వెళ్లింది. అనంతపురంలో అతను పోలీసులకు చిక్కినట్లు సమాచారం.
డబ్బు కోసమే... కిడ్నాప్ వ్యూహం
ఓబులేష్ ఇంతకుముందు కూడా కేబీఆర్ పార్క్‌కు వచ్చె వీఐపీలపై గురిపెట్టాడు. ఇటీవలే ఇక్కడ్నుంచి ఓ ఉన్నతాధికారికి ఏకే-47 చూపించి కారులో కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆయన నుంచి రూ.10 లక్షలు వసూలు కూడా చేశాడు. ఆ తర్వాత వదిలిపెట్టాడు. ఫిర్యాదు చేస్తే చంపేస్తామని ఆ అధికారిని బెదిరించాడు. ఈ ఘటనపై సదరు అధికారి ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం నిత్యానంద రెడ్డి కిడ్నాప్‌నకు యత్నించాడు.
అది వైజాగ్‌లో చోరీ చేసిన ఆయుధమే..
అనంతపురానికి చెందిన ఓబులేషు.. మొదట కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో రిజర్వ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అక్కడ నాలుగేళ్లు పనిచేసిన తర్వాత గ్రేహౌండ్స్‌కు బదిలీ అయ్యాడు. గ్రేహౌండ్స్‌లో ఉన్న సమయంలో వైజాగ్‌కు నక్సల్స్ ఏరివేతకు వెళ్లిన బృందంలో ఇతను కూడా ఉన్నాడు. ఆ సమయంలోనే ఏఎస్‌ఐ రామారావుకు చెందిన ఏకే-47 ఆయుధం అదృశ్యమైంది. ఆ ఆయుధాన్ని ఓబులేషే దొంగిలించాడు. ఆయుధం మిస్ కావడంపై కేసు కూడా నమోదైంది. ఇది ఇంకా దర్యాప్తులోనే ఉంది. బుధవారం నాటి ఘటనలో లభించిన ఏకే-47, వైజాగ్ మిస్ అయిన ఆయుధం ఒకటేనని పోలీసులు నిర్ధారించారు. ఓబులేష్ గ్రేహౌండ్స్ నుంచి ఇటీవలే సీఏఆర్‌సీపీఎల్‌కు బదిలీ అయ్యాడు. ఇక్కడ విధులు నిర్వహిస్తునే తన వద్ద ఉన్న ఆయుధంతో నేరాలకు పథకం పన్నాడు.
ఘటనపై అసెంబ్లీలో సీఎం ప్రకటన
కేబీఆర్ పార్కులో కాల్పుల ఉదంతం అసెంబ్లీలో కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రశ్నించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. ‘‘పార్కులో వాకింగ్ ముగించుకొని వస్తున్న అరబిందో ఉపాధ్యక్షుడు నిత్యానందరెడ్డిని డబ్బు కోసం అగంతకుడు రైఫిల్‌తో బెదిరించగా, జరిగిన పెనుగులాటలో అగంతకుని చేతిలో ఉన్న ఏకే 47 రైఫిల్ పేలి బుల్లెట్లు కారు అద్దంలోంచి దూసుకు పోయాయి’’ సభకు తెలిపారు. దుండగుడు వదిలి వెళ్లిన ఏకే-47 రైఫిల్ గతేడాది డిసెంబరులో గ్రేహాండ్స్ విభాగంలో చోరి అయినట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కాల్పులపై సీఎం ప్రకటన చేయాలని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి సభలో డిమాండ్ చేశారు.
ప్రముఖుల పరామర్శ..
కాల్పుల ఘటన తెలియగానే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. నిత్యానందరెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి కూడా ఆయన నివాసానికి వెళ్లారు.
నాకు ఎవరితో శత్రుత్వం లేదు: నిత్యానందరెడ్డి
30-35 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తి నాపై కాల్పులు జరిపాడు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పాను. అయినా వినిపించుకోలేదు. నాకు ఎవరిపైనా శత్రుత్వం లేదు.
ఈ ఆయుధం అదే..: కమిషనర్
ఓబులేషు ఉపయోగించిన ఏకే 47 గతేడాది డిసెంబర్‌లో గ్రేహౌండ్స్ విభాగం నుంచి మిస్సైనదేనని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. దీనిపై గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు వివరించారు.