‘గొలుసు’ దొంగ దొరికాడు..!
తొమ్మిదేళ్లుగా కేబీఆర్ పార్కులో స్నాచింగ్‌లు
- వాకింగ్ చేసేవారే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలు
- కెమెరాకు చిక్కడు.. రెండు నెలల గ్యాప్‌తో చోరీలు
- ఎట్టకేలకు ఊహాచిత్రం ఆధారంగా నిందితుని గుర్తింపు
- నర్సింహను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు
హైదరాబాద్: ఒకే ఒక్కడు.. ఆరు కిలోమీటర్ల కేబీఆర్ పార్కు.. 90 సీసీటీవీ కెమెరాలు.. నిత్యం గస్తీ కాసే పోలీసు వాహనాలు.. వీటన్నింటినీ తప్పించుకుని 11 స్నాచింగ్‌ల్లో 44 తులాల బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. తొమ్మి దేళ్లుగా తమను ముప్పుతిప్పలు పెట్టిన ఈ చైన్ స్నాచర్‌ను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసు లు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్‌కు వచ్చే ఇద్దరు సెలబ్రిటీలు ఊహాచిత్రం ఆధారంగా నిందితుడి గుర్తించి సమాచారం ఇవ్వడంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నర్సింహ (29)ను అదుపులోకి తీసుకున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం మొదలు
కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వచ్చేవారిని టార్గెట్ చేసుకుని తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన నర్సింహ స్నాచింగ్ పర్వం గత జూలై 19 వరకూ సాగింది. స్నాచర్ కోసం పోలీసులు పార్కు చుట్టూ ఏకంగా 60 కెమెరాలను ఏర్పాటు చేశారు. పార్కులో మరో 30 కెమెరాలు ఉన్నా యి. రెండు నెలల విరామంతో స్నాచింగ్ చేసే నర్మింహ కోసం 15 మందికిపైగా పోలీసులు మఫ్టీలో పార్కు వద్ద గస్తీ కాసేవారు. అయినా వీరి కంటపడకుండా మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తూ నర్సింహ పోలీసులకు సవాల్ విసిరాడు. అసలు కెమెరాకు చిక్కకుండా స్నాచర్ ఎలా తప్పించుకుంటాడనేది పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
వాకింగ్‌కు వచ్చేవారే టార్గెట్..
వృద్ధ జంటలను టార్గెట్‌గా పెట్టుకుని ముందు భర్త వెళ్తుంటే వెనుక నడిచే భార్య మెడలో నుంచి గొలుసు తెంపుకుని నింపాదిగా పార్కు లోకి వెళ్లి తప్పించుకోవడం చాలాకాలంగా నర్సింహ అలవాటు చేసుకున్నాడు. చివరగా జూలై 19న సుశీలాదేవి(84) అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల చైన్‌ను దొంగిలించాడు. దీంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుల నుంచి స్నాచర్ ఆనవాళ్లను సేకరించిన పోలీసులు.. ఊహాచిత్రాన్ని గీయించి ప్రతిరోజూ పార్కుకు వచ్చే వాకర్లకు చూపేవారు.
ఆ ఊహాచిత్రాన్ని గుర్తించిన ఇద్దరు హీరోలు.. తమ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఇలాంటి పోలికలతోనే ఉంటాడని పోలీసులకు తెలిపారు. దీంతో రెండు రోజుల క్రితం బంజా రాహిల్స్ పోలీసులు స్నాచర్‌ను నర్సింహగా గుర్తించి అరెస్టు చేశారు. కేబీఆర్ పార్కు స్నాచర్ తానేనని అతను ఒప్పుకున్నట్లు తెలిసింది. నర్సింహ పార్కు లోపలికి గేటులో నుంచి కాకుండా గ్రిల్స్ దూకి ప్రవేశిస్తున్నట్లు విచారణ లో తేలింది. పోలీసుల దృష్టికి రాని స్నాచింగ్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు.