chain theft
-
‘గొలుసు’ దొంగ దొరికాడు..!
తొమ్మిదేళ్లుగా కేబీఆర్ పార్కులో స్నాచింగ్‌లు - వాకింగ్ చేసేవారే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలు - కెమెరాకు చిక్కడు.. రెండు నెలల గ్యాప్‌తో చోరీలు - ఎట్టకేలకు ఊహాచిత్రం ఆధారంగా నిందితుని గుర్తింపు - నర్సింహను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు హైదరాబాద్: ఒకే ఒక్కడు.. ఆరు కిలోమీటర్ల కేబీఆర్ పార్కు.. 90 సీసీటీవీ కెమెరాలు.. నిత్యం గస్తీ కాసే పోలీసు వాహనాలు.. వీటన్నింటినీ తప్పించుకుని 11 స్నాచింగ్‌ల్లో 44 తులాల బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. తొమ్మి దేళ్లుగా తమను ముప్పుతిప్పలు పెట్టిన ఈ చైన్ స్నాచర్‌ను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసు లు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్‌కు వచ్చే ఇద్దరు సెలబ్రిటీలు ఊహాచిత్రం ఆధారంగా నిందితుడి గుర్తించి సమాచారం ఇవ్వడంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరా నగర్లో నివాసం ఉంటున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నర్సింహ (29)ను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదేళ్ల క్రితం మొదలు కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వచ్చేవారిని టార్గెట్ చేసుకుని తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన నర్సింహ స్నాచింగ్ పర్వం గత జూలై 19 వరకూ సాగింది. స్నాచర్ కోసం పోలీసులు పార్కు చుట్టూ ఏకంగా 60 కెమెరాలను ఏర్పాటు చేశారు. పార్కులో మరో 30 కెమెరాలు ఉన్నా యి. రెండు నెలల విరామంతో స్నాచింగ్ చేసే నర్మింహ కోసం 15 మందికిపైగా పోలీసులు మఫ్టీలో పార్కు వద్ద గస్తీ కాసేవారు. అయినా వీరి కంటపడకుండా మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తూ నర్సింహ పోలీసులకు సవాల్ విసిరాడు. అసలు కెమెరాకు చిక్కకుండా స్నాచర్ ఎలా తప్పించుకుంటాడనేది పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. వాకింగ్‌కు వచ్చేవారే టార్గెట్.. వృద్ధ జంటలను టార్గెట్‌గా పెట్టుకుని ముందు భర్త వెళ్తుంటే వెనుక నడిచే భార్య మెడలో నుంచి గొలుసు తెంపుకుని నింపాదిగా పార్కు లోకి వెళ్లి తప్పించుకోవడం చాలాకాలంగా నర్సింహ అలవాటు చేసుకున్నాడు. చివరగా జూలై 19న సుశీలాదేవి(84) అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల చైన్‌ను దొంగిలించాడు. దీంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుల నుంచి స్నాచర్ ఆనవాళ్లను సేకరించిన పోలీసులు.. ఊహాచిత్రాన్ని గీయించి ప్రతిరోజూ పార్కుకు వచ్చే వాకర్లకు చూపేవారు. ఆ ఊహాచిత్రాన్ని గుర్తించిన ఇద్దరు హీరోలు.. తమ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఇలాంటి పోలికలతోనే ఉంటాడని పోలీసులకు తెలిపారు. దీంతో రెండు రోజుల క్రితం బంజా రాహిల్స్ పోలీసులు స్నాచర్‌ను నర్సింహగా గుర్తించి అరెస్టు చేశారు. కేబీఆర్ పార్కు స్నాచర్ తానేనని అతను ఒప్పుకున్నట్లు తెలిసింది. నర్సింహ పార్కు లోపలికి గేటులో నుంచి కాకుండా గ్రిల్స్ దూకి ప్రవేశిస్తున్నట్లు విచారణ లో తేలింది. పోలీసుల దృష్టికి రాని స్నాచింగ్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. -
బామ్మా మంచినీళ్లివ్వమని గొలుసు చోరీ..
బంజారాహిల్స్: ఇంట్లోకి టిప్..టాప్‌గా వచ్చాడు ఓ యువకుడు... మంచినీళ్లు కావాలని వృద్ధురాలిని అడిగాడు.. అచ్చం పక్కింటి అబ్బాయేమోనని అనుకొని ఆమె మంచినీళ్లిచ్చింది.. అంతే ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న అతను ఆమెను బెదిరించి గొలుసు లాక్కొని పరారయ్యాడు.. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీనగర్ కాలనీ ఎల్ఐసీ కాలనీలో నివసించే కె.శ్యామలాంబ(79) ఇంటికి శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో టిప్ టాప్‌గా తయారై వచ్చిన ఓ యువకుడు తలుపు కొట్టి లోనికి ప్రవేశించి మంచినీరు కావాలని అడిగాడు. తమ పక్కింట్లో నివసిస్తున్న యువకుడిలాగే ఉన్నాడని భావించిన శ్యామలాంబ చెంబుతో నీళ్లిచ్చింది. అవి తాగి బయటకు వెళ్లిన అతను మరో పది నిమిషాల్లోనే తిరిగి ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో శ్యామలాంబ వంటింట్లోకి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఆగంతకుడు నేరుగా కిచెన్ లోకి కట్టర్‌తో ఆమె మెడలోంచి రెండు గొలుసులను కట్‌చేశాడు. అందులో ఒక గొలుసు పూర్తిగా చేతుల్లోకి రాగా ఇంకో గొలుసు ఆమె పట్టుకోవడంతో సగం మాత్రమే ఆగంతకుడి చేతుల్లోకి వచ్చింది. క్షణాల్లోనే ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయాన్ని ఆమె మొదటి అంతస్తులో ఉంటున్న కొడుకు, కోడలు దృష్టికి తీసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. సీసీ కెమెరా లేకపోవడంతో ఆగంతకుడి వివరాలు అందుబాటులోకి రాలేదని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగలు ఈడ్చుకుంటూ వెళ్లినా వదల్లేదు
చందానగర్: గొలుసు స్నాచింగ్‌కు యత్నిం చిన దొంగలను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమె తీవ్రగాయాలకు గురైంది. వివరాలు... సురక్షహిల్స్‌కు చెందిన రాధాబాయి శుక్రవారం ఉదయం 7 గంటలకు వాకింగ్‌కు వెళ్లింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన రాధాబాయి వారిని ప్రతిఘటించింది. దీంతో తోకముడిచిన దొంగలు పారిపోతుండగా రాధాబాయి వారి బైక్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో దొంగలు ఆమెను చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి రాధాబాయి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఎంతో ధైర్యంగా స్నాచర్లను ఎదుర్కొని గొలుసును కాపాడుకున్న ఆమెను అభినందించారు. -
సిగరెట్ కావాలని వచ్చి గొలుసు చోరీ
కిరాణా దుకాణం యజమానురాలి నుంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు ఇబ్రహీంపట్నం: సిగరేట్ కావాలంటూ బైక్‌పై కిరాణా దుకాణానికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు షాపు యజమానురాలి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుపోయారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సాహెబ్‌గూడకు చెందిన వట్నాల పుష్పలత(35) స్థానికంగా ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం ఇంటిగంట సమయంలో ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై ఆమె దుకాణం వద్దకు వచ్చారు. సిగరెట్ కావాలని అడిగారు. దీంతో పుష్పలత సిగరెట్ ఇచ్చేంతలోపు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలో, తాజాగా సోమవారం సాహెబ్‌గూడలో చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
ఆ ఐదుగురూ గొలుసు చోరీల్లో దిట్ట
అమలాపురం టౌన్ : మహిళల మెడల్లోని నగలను తెంపుకుని పరారవడంలో ఆ ఐదుగరూ నేర్పరులు. ఆరునెలలుగా పలు జిల్లాల్లో గొలుసు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా హడలెత్తిస్తున్న ఈ ఘరానా ముఠాను ఎట్టకేలకు అమలాపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల విలువైన 75 కాసుల బంగారు నగలు, రూ.1.50 లక్షల విలువైన మూడు మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నేరాల చిట్టాను జిల్లా అడిషనల్ ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, అమలాపురం ఇన్చార్జి డీఎస్పీ సుంకర మురళీమోహన్, పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్, రూరల్ సీఐ జి.దేవకుమార్ బుధవారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో విలేకరులకు వివరించారు. చర్లపల్లి జైలులో పరిచయం : తాళ్లరేవుకు చెందిన గుత్తుల చంటి, కాట్రేనికోన మండలం కందికుప్పకు చెందిన పొతూరి ధనంజయరాజు, ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన బొక్కా సురేష్, యానాం కురసంపేటకు చెందిన కడలి ఈశ్వరరావు, అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన వినుకొండ గణేష్ పాతనేరస్తులు. చోరీ కేసులో గుత్తల చంటి, భార్యను హత్య చేసిన కేసులో ధనంజయరాజు, ఓ హత్యాత్నం కేసులో వినుకొండ గణేష్ చర్లపల్లి జైలుకు వెళ్లారు. ఈ ముగ్గురికి అక్కడే పరిచయమైంది. ఆ తర్వాత పాత నేరస్తులైన బొక్కా సురేష్, కడలి ఈశ్వరరావులతో కోర్టులకు వాయిదాలకు వెళ్లిన సమయంలో పరిచయాలు ఏర్పడ్డాయి. వీరంతా చైన్‌స్నాచింగ్ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డారు. ఈ ముఠా తూర్పుగోదావరి జిల్లాలో 15 చోరీలకు పాల్పడగా, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, విశాఖ జిల్లాలో ఒకటి, హైదరాబాద్‌లో మరొక చోరీకి పాల్పడింది. ఈ ముఠా అమలాపురంలో మంగళవారం చోరీచేసిన నగలు పంచుకుంటుండగా, పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు. పోలీసులకు రివార్డులు ఈ ముఠాను చాకచక్యంగా అరెస్టుచేసిన అమలాపురం పోలీసులను ఏఎస్పీ దామోదర్ అభినందించారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్, అమలాపురం క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు బత్తుల రామచంద్రరావు, గుబ్బల సాయి, వాసిరెడ్డి వరహాలు, సుందర అనిల్‌కుమార్, రాయడు వీర వెంకట సత్యనారాయణకు ఎస్పీ రవిప్రకాష్ రివార్డులు ప్రకటించనున్నట్లు ఏఎస్పీ వివరించారు.