బంజారాహిల్స్: ఇంట్లోకి టిప్..టాప్‌గా వచ్చాడు ఓ యువకుడు... మంచినీళ్లు కావాలని వృద్ధురాలిని అడిగాడు.. అచ్చం పక్కింటి అబ్బాయేమోనని అనుకొని ఆమె మంచినీళ్లిచ్చింది.. అంతే ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న అతను ఆమెను బెదిరించి గొలుసు లాక్కొని పరారయ్యాడు.. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీనగర్ కాలనీ ఎల్‌ఐసీ కాలనీలో నివసించే కె.శ్యామలాంబ(79) ఇంటికి శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో టిప్ టాప్‌గా తయారై వచ్చిన ఓ యువకుడు తలుపు కొట్టి లోనికి ప్రవేశించి మంచినీరు కావాలని అడిగాడు.
తమ పక్కింట్లో నివసిస్తున్న యువకుడిలాగే ఉన్నాడని భావించిన శ్యామలాంబ చెంబుతో నీళ్లిచ్చింది. అవి తాగి బయటకు వెళ్లిన అతను మరో పది నిమిషాల్లోనే తిరిగి ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో శ్యామలాంబ వంటింట్లోకి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఆగంతకుడు నేరుగా కిచెన్ లోకి కట్టర్‌తో ఆమె మెడలోంచి రెండు గొలుసులను కట్‌చేశాడు. అందులో ఒక గొలుసు పూర్తిగా చేతుల్లోకి రాగా ఇంకో గొలుసు ఆమె పట్టుకోవడంతో సగం మాత్రమే ఆగంతకుడి చేతుల్లోకి వచ్చింది.
క్షణాల్లోనే ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయాన్ని ఆమె మొదటి అంతస్తులో ఉంటున్న కొడుకు, కోడలు దృష్టికి తీసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. సీసీ కెమెరా లేకపోవడంతో ఆగంతకుడి వివరాలు అందుబాటులోకి రాలేదని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.