ఇన్సాన్‌కా పెహచాన్.. జాన్వర్‌కా నిశాన్
ప్రశాంతంగా ఉండే కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాకర్స్ ఉలిక్కిపడ్డారు. ఓ మృగం తుపాకీతో మనిషిపై దాడి చేసి తప్పించుకు పారిపోయింది. యావత్ యంత్రాగం ఆ మృగాన్ని వెతికి పట్టుకునే ప్రయత్నంలో తలమునకలై ఉంది. పంజా విసిరిన ఆ మృగం పట్టుబడేంత వరకూ ఆ మనిషికి అపాయం పొంచి ఉన్నట్టే.
సరిగ్గా వారం కిందట ఇదే కేబీఆర్ పార్క్ గేట్ నంబర్ 1 నుంచి ఓ మృగం తప్పించుకుంది. మనిషి ముసుగు తొడుక్కుని జనారణ్యంలో కలసిపోయింది. ఆ రోజు ఇంత హడావుడి జరగలేదు. ఇంత మంది స్పందించలేదు. ఎందుకంటే అది ప్రాణాపాయం కాదు. పైగా ఈ మృగం పబ్లిగ్గా పంజా విసరలేదు. కానీ ఆ మృగం మన మధ్యే తిరుగుతోంది.అనువు దొరికితే ఏ అమాయక ఆడపిల్లనో కబళించేందుకు మాటు వేసింది.
ఆ రోజు నేను మార్నింగ్ వాక్‌కు కేబీఆర్ పార్క్‌కు వెళ్లాను. పార్కింగ్ గేట్ దగ్గర ఓ చారల చొక్కా ఆకారం గేటును ఆనుకుని నిలబడి ఉంది.. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టు ! యథాలాపంగా లోపలికి వెళ్లబోతున్న నాకు కనిపించిన ఆ దృశ్యం మనసులో రిజిస్టర్ కావడానికి సమయం పట్టింది. క్యాజువల్ వాకర్‌లా ఉన్న అతని రెండు చేతులు ప్యాంట్ జేబులో జుగుప్సాకరంగా ఆడుతున్నాయి. ఓ మై గాడ్ ! వచ్చే పోయే స్త్రీలను చూస్తూ అతని ఆలోచనలు వికృత నాట్యం చేస్తున్నాయని అర్థమయ్యే సరికి నాకు బుర్ర తిరిగిపోయింది.
మానసిక అత్యాచారం..
సూటిగా అతని కళ్లలోకి చూడగానే తడబ డ్డాడు నేను గేటు దాటి పార్కులోకి నడుస్తున్నానే గానీ మనసంతా రెస్ట్‌లెస్‌గా ఉంది. పార్కులో నడుస్తున్న మహిళలను అతను ఫిజికల్‌గా కాకపోయినా.. మానసికంగా రేప్ చేస్తున్నట్టనిపించింది. అందులో నేను ఒకదాన్ని కదా.
ఈ జంతువు బహిరంగంగా ఇలా చేస్తుంటే, వల్నరబుల్‌గా కనిపించిన స్త్రీలను ఏం చేస్తాడో అన్న ఊహ రాగానే వెనక్కి తిరిగాను. నిస్సిగ్గుగా అతడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి అతని వైపు తిప్పి నడవడం మొదలుపెట్టాను. ఇది గమనించి అతను కార్ల వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. నడుస్తున్న మరో ఇద్దరు యువకులను ఆపి విషయం చెప్పి ఎదిరిద్దామని కూడగట్టుకుని బయల్దేరేలోపే ఆ చారల చొక్కా జనారణ్యంలో కలసి పోయింది. ఆ మృగం పారిపోయింది. ఆ యువకులు తిరిగి నడక సాగించారు.
మౌనమె మన ఘోష..
ఈ మృగాన్ని నేనొక్కదాన్నే కాదు ఇంకా ఎందరో అక్కడ చూసి ఉంటారు. నడిచే వాళ్లు పార్కింగ్‌లో డ్రైవర్లు, పక్క షాపులో వాళ్లు, పళ్లు అమ్ముకునే వాళ్లు అంత మందీ చూడకుండా ఉండే అవకాశమే లేదు. చూసీ చూడనట్టు ఉండటమే మంచితనమా. ప్రశ్నించే ధైర్యం లేకనా లేదా ఇది ప్రశ్నించాల్సిన అంశమే కాదా..? ఇలాంటి మదోన్మాదులు తయారయ్యేందుకు ప్రధాన కారణం మన నిశ్శబ్దం. ‘నేను మంచి వ్యక్తిని నాతో అందరూ మంచితనంతో వ్యవహరించాలి కానీ నేను చెడును నిలదీయను’ ఇదీ మన సగటు నగర జీవి వైఖరి.
భారత దేశం ‘రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’ అనిపించుకునే దిశగా అడుగులు వేస్తోంది. తప్పించుకున్న ఇలాంటి ఎన్ని మృగాలు మనిషి ముసుగులో మన మధ్య తిరుగుతున్నాయో. సగటున రోజుకు 93 అత్యాచారాలు నమోదవుతున్న మన దేశంలో నమోదు కాని లైంగిక దాడులు ఎన్ని జరుగుతున్నాయి? ఈ ఆర్టికల్ చదివే వ్యవధిలో ఒకరిపై అత్యాచారం జరిగి ఉంటుంది. ఇద్దరు లైంగికంగా వేదనకు గురై ఉంటారు.
ప్రశ్నే ఆయుధం..
‘నిర్భయ’ విప్లవం తర్వాత మధ్యప్రదేశ్‌లో అదే రీతిలో జరిగిన లైంగిక దాడుల గురించి విన్నాం. మదోన్మాదానికి రాలిపోయిన పసి మొగ్గలనీ చూశాం. కానీ అన్నింటికీ ‘నిర్భయ’ తీరులో స్పందన మాత్రం చూడలేదు. లైంగిక హింసపై మనం ఎందుకింత సహనం ప్రదర్శిస్తున్నాం? వెంటనే ప్రతిస్పందిచగలగడం, నిశ్శబ్దాన్ని ఛేదించడం మనకు అలవాటు కావాలి. ఆ రోజు నాతోపాటు ఆ మృగాన్ని చూసిన మరికొంత మంది వెంటనే ప్రశ్నించి ఉంటే అతని ప్రవర్తనకు ఆస్కారం ఉండేది కాదు. జనం అలెర్ట్‌గా ఉన్నారన్న భయం అతనిలో లేకపోవడం వల్లే అంత నిస్సిగ్గుగా ఆ మృగం తిరుగాడింది.
ఎవరూ ఏమీ చేయరన్న భరోసా మనం ఇవ్వడం వల్ల ఎక్కడో ఓ ఆడపిల్లను మనం ప్రమాదం అంచున నిలబెట్టినట్టే. ఎక్కడ నేను ఫొటో తీస్తానన్న భయానికి ఈ మృగం పారిపోయింది. కానీ మరో చోట నిశ్శబ్దాన్ని అలుసుగా తీసుకుని లైంగికంగా దాడి చేయదన్న గ్యారంటీ ఏంటి? బీ అవేర్. మన నగరం సురక్షితం అని అనుకోవాలంటే మనం అలెర్ట్‌గా ఉండాలి. మౌనం వీడండి. కేవలం ఇలాంటి ఉన్మాదులనే కాదు, చిన్న చిన్నవిగా అనిపించే ట్రాఫిక్ తప్పులు, వెకిలి వేధింపులు ఏవైనా సరే సహకరించకండి. ప్రశ్నించండి. నా దృష్టిలో ప్రశ్నే ఆయుధం.