చెత్త మూటలు కట్టిపెట్టోయ్.. | kavya got national film award for best child artist | Sakshi
Sakshi News home page

చెత్త మూటలు కట్టిపెట్టోయ్..

Published Thu, Nov 6 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

చెత్త మూటలు కట్టిపెట్టోయ్..

చెత్త మూటలు కట్టిపెట్టోయ్..

1995.. ప్రసాద్ ల్యాబ్‌లో డబ్బింగ్ థియేటర్. నాలుగేళ్ల  ఓ చైల్డ్ ఆర్టిస్ట్ చాక్లెట్ ఇస్తే తినేసి ర్యాపర్ పట్టుకుని ల్యాబ్ అంతా తిరిగింది. అది పడేసే చోటు కోసం.. అంటే చెత్తబుట్ట కోసం ! ఓ పక్కన పడవేయమని ఎంతమందన్నా.. పట్టుబట్టి తనే స్వయంగా చెత్తబుట్టలో వేసింది. ఆ చిన్నారి బేబీ కావ్య. లిటిల్ సోల్జర్స్ చిత్రంతో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్న కావ్యకు ఉత్తమ సిటిజన్ సత్కారం ఇవ్వాలి.
 
2014 జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్. ఓ స్కూల్ బస్సు ఆగింది. లోపల పిల్లలకు చాక్లెట్లు పంచినట్టున్నారు. 3 నిమిషాల వ్యవధిలో కిటికీ నుంచి 4 చాక్లెట్ ర్యాపర్లు బయటకు వచ్చిపడ్డాయి. నేను ఓ వైపే చూశాను. మరోవైపు ఎన్ని పడ్డాయో తెలియదు. వాళ్లంతా కార్పొరేట్ విద్యార్థులు. వాళ్లకి రోడ్డే ఓ చెత్తబుట్ట. ఇది దేనికి సంకేతం..? ఒకప్పుడు పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తకుండీలు అరుదుగా కనిపించేవి. కానీ, వ్యవస్థలో మార్పు కోసం మున్సిపాలిటీలు ఆకర్షణీయమైన చెత్తకుండీలు ఏర్పాటు చేశాయి. మార్పు రానిదల్లా మనలోనే. మనకు రోడ్లే చెత్తకుండీలు. ఇందుగలదు.. అందులేదన్న.. సందేహం వలదు.. అన్న చందాన చెత్త కనిపించనిదెక్కడ? ముందు మనం ‘చెత్త’డిసిప్లిన్ అలవాటు చేసుకుందాం.

టైప్స్ ఆఫ్ వేస్ట్
చెత్త గురించి చెప్పాలంటే వంటింట్లో తయారయ్యే చెత్త.. కూరగాయ తొక్కలు, వండిన ఆహారం, పండ్లు, మాంసం.. ఇవి డీ కంపోజ్ అయ్యే చెత్త. ఇది కుళ్లి భూమిలో కలసిపోతుంది. ఇక  డ్రై వేస్ట్.. పేపర్లు, గాజు, చెక్క వీటిలో చాలా వరకు రీసైకిల్ చేసేందుకు అనువుగా ఉంటాయి. పాలిథిన్ మహమ్మారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మన ఇంట్లో ఉత్పత్తయ్యే మరో రకం చెత్త ‘ఈ-వేస్ట్’. ఎలక్ట్రానిక్ విడిభాగాలు, బ్యాటరీలు, బల్బులు, కంప్యూటర్ సంబంధిత వేస్టేజ్.

వీటిని ఎలా మేనేజ్ చేయాలో చాలామందికి తెలియదు. అందుకే ఈ-వేస్ట్‌ను కూడా సాధారణ చెత్తకుండీల్లో వేస్తున్నాం. ఇక ఇళ్లల్లో తక్కువగా, హాస్పిటల్స్‌లో ఎక్కువగా ఉత్పత్తయ్యే చెత్త మెడికల్ వేస్ట్. ఆస్పత్రుల్లో ఈ రకం చెత్తను రంగుల్లో విభజించి తరలిస్తారు. కానీ మన ఇళ్లలో సిరంజీలు, మాత్రలు వంటివి సాధారణ చెత్తలో కలసిపోతాయి. వీటిని వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపడం ఎంత తలనొప్పి వ్యవహారమో ఒక్కసారి ఆలోచించండి.
 
కలివిడిగా నడుద్దాం..
గోవాలో పాంజిమ్, మహారాష్ట్రలోని పుణే నగరాల్లో మున్సిపాలిటీలు తడి, పొడి చెత్తను విడివిడి రోజుల్లో కలెక్ట్ చేస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించడంతో అవి క్లీన్‌సిటీలుగా మెరిసిపోతున్నాయి. మన మున్సిపాలిటీలోనూ దాన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు గానీ.. ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దాని సంగతి అటుంచితే.. మన నుంచి కొందరైనా చెత్తను విభజించి పంపిద్దాం. మన డంపింగ్ సమస్యల మేనేజ్‌మెంట్ గురించి గళమెత్తుతున్న సుకుకి ఎక్స్‌నోరా అనే స్వచ్ఛంద సంస్థ రెండు చెత్తల విధానాన్ని ప్రోత్సహించమని ప్రభుత్వాన్ని, సమాజాన్ని కదిలిస్తోంది. మనం కూడా ఈ రెండు చెత్తబుట్టల ఉద్యమంలో కలుద్దాం.

తడిపి మోపెడు చేయొద్దు..
ఇప్పటికే చాలామంది వంటింటి వేస్టేజ్‌కు సపరేట్ చెత్తబుట్ట వాడుతున్నారు. పొడిచెత్త కలపకుండా డీకంపోజ్ అయ్యే చెత్తను మాత్రమే అందులో వేయండి. ఇంకో చెత్తబుట్టలో డ్రై వేస్ట్ అంటే రీసైకిల్ చేయగలిగిన పేపర్, గాజు, ప్లాస్టిక్, చెక్క వంటి వస్తువులు వేయండి. ఇందులో తడి చెత్త వేయకండి. పొడి చెత్తబుట్టకు న్యూస్ పేపర్ గానీ, పేపర్‌తో తయారు చేసిన బ్యాగులో గానీ ఇవి వేయండి. పారిశుధ్య కార్మికులకు న్యూస్‌పేపర్ బ్యాగ్ కానీ, పొట్లం కానీ రీసైకిల్‌కు సంకేతమని అర్థం అవుతుంది. ఇక మెడికల్ వేస్ట్‌ను వీటిలో కలపకుండా వీలు చూసుకుని దగ్గర్లోని హాస్పిటల్స్ ట్రాష్‌లో వేయండి. ‘ఈ-వేస్ట్’ సాధారణ చెత్తలో వేయకుండా...పాతసామాన్లు కొనే వారికి ఇవ్వండి. కనీసం అప్పుడైనా అది చేరాల్సిన చోటికి చేరుతుందేమో !

కంపౌండ్‌లో కంపోస్ట్..
తడి చెత్తను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి పారేస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు. కుదిరితే నల్లని రీసైకిల్డ్ బ్యాగ్‌లను వాడండి. మా ఇంట్లో పేపర్ సంచులు మేమే తయారు చేసుకుంటున్నాం. వీటి తయారీ పిల్లలూ ఇష్టపడతారు. పైగా ‘చెత్త’పాఠాలు నేర్చుకుంటారు. మరో అడుగు ముందుకు వేయగల్గితే.. ఇళ్లలో, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో తడి చెత్తను మనమే కంపోస్ట్‌గా మార్చుకోవచ్చు. కంపోస్ట్ గుంటను గానీ, రెడీమెడ్ మట్టి కంపోస్ట్ కుండీలో గానీ వాడితే చెత్తను ఎరువుగా తయారు చే యొచ్చు. అదీ పెద్ద శ్రమ, ఖర్చు లేకుండానే.

మూడేళ్లుగా మా ఇంటి చెత్తను మేం కంపోస్ట్ చేస్తున్నాం. ఇక అమల అక్కినేని గారైతే స్వయంగా కంపోస్ట్ చేయడమే కాక, అది తనకు స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ అని మరీ చెప్తారు. ఈ కంపోస్ట్ తయారీ గురించి మరిన్ని వివరాలు హైదరాబాద్ గోస్ గ్రీన్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందు ఏ చెత్తను ఏ బుట్టలో వేయాలో అందులోనే వేద్దాం. అంతకంటే ముందు చెత్తను చెత్త బుట్టలో వేసే ‘చెత్త డిసిప్లిన్’ అలవాటు చేసుకుందాం. లెట్స్ గ్రో క్లీన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement