ఛీ ఛీ కెమెరాలు..
గోడలకు చెవులుంటాయ్.! ఇది పాత మాట. గోడలకు కళ్లుంటాయ్..! ఇది నేటి బాట. ఆ కళ్లలో కొన్నింటికి మనకు కనిపించని ఆకళ్లుంటాయి.. జాగ్రత్త !! ఒళ్లంతా చెవులు చేసుకుని వినండి. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసే కెమెరాలు మన చుట్టూ ఉండొచ్చు.
ఆవిడొకప్పుడు నటి, ఇప్పుడు పొలిటీషియన్ పైగా మంత్రి కూడా. అడుగడుగునా ఆమెను ‘రక్షణ’ చుట్టుముట్టి ఉంటుంది. ఆ భరోసాతో నేను భద్రంగా ఉన్నాను అని ఆమె కళ్లు మూసుకుని ఉంటే ఈ రోజు దేశం ఇలా కెమెరాలు తడుముకుని ఉండేది కాదు. ఆ కెమెరా కళ్లు బంధించిన దృశ్యాలు మరో రకమైన సంచలనమై దేశం సిగ్గుతో చితికిపోయేది. కాని, ఆమె కేవలం మరో సాధారణ మహిళ కాదు. ఆమె సాధికారతకు సరికొత్త చిరునామా స్మృతి ఇరానీ. నిశితమైన ఆమె కంటి చూపునకు ఆ కెమెరా కన్ను చిక్కింది. మీడియాకు మరో సంచలన వార్త దొరికింది. ట్రయల్ రూమ్‌లోకి తొంగి చూసిన ఆ కెమెరా ఎన్నో విషయాలను
ఆలోచించమంటోంది.
కామం కీచకాలోచనం
రక్షణ వ్యవస్థకు మూడో కన్నులాంటి నిఘా కెమెరాలను తప్పుబట్టే అవసరం లేదిక్కడ. ప్రమాదమల్లా ఆ కెమెరాలతో వంకర చూపు చూస్తున్న వారిపై నిఘా లేకపోవడం. ట్రయల్ రూమ్ బయటే ఉన్నప్పటికీ లోపల జరుగుతున్నవి రికార్డ్ అవుతుంటే అప్పటి వరకు ఆ విషయాన్ని సదరు సంస్థలో ఎందుకు గమనించలేదు..? అంటే ఆ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించాల్సిన సెక్యూరిటీ వ్యవస్థ పని చేయనట్టే కదా. ఆ లొసుగు చూసుకునే ‘అష్టావక్రులు’ తమకు కావాల్సింది చూసేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా అద్దంలో నుంచే రహస్య కెమెరాలు పెట్టిన సంఘటనలూ ఉన్నాయి. ఉద్యోగులు చేశారు అని చేతులు దులిపేసుకున్నంత మాత్రాన యాజమాన్యం బాధ్యత లేనట్టెలా అవుతుంది. ఇక కంచె చేను మేసినట్టు యజమానే ఈ కుట్రలో భాగస్వామి అయితే ఎవరికి చెప్పుకోవాలి. మినిస్టర్ గారికి ఎదురైన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది మరి మిగిలిన సందర్భాల్లో.
awayకళ్లు
ఆశ్చర్యకరమైన స్టేట్‌మెంట్ మన సిటీ పోలీస్ యంత్రాంగం నుంచి వచ్చింది. ‘అది ఎక్కడో వేరే నగరంలో జరిగిందండి. మన నగరంలో అసలు అలాంటి కేసులేమీ నమోదు కాలేదు’ అని సెలవిచ్చిన పోలీస్ బాసుల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటిది సిగ్గు విడిచి రిపోర్టు చేయడం, రెండు అసలు మనం వల్నరబుల్‌గా ఉన్నామో లేదో గుర్తించడం. కేసులు నమోదు కానంత మాత్రాన జరగవు అనుకోవడానికి లేదు. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. చాలా సందర్భాల్లో గుడ్డిగా, అలవాటుగా ప్రవర్తిస్తుంటాం. కాని అప్రమత్తంగా ఉండటం స్త్రీలందరం అల వాటు చేసుకోవాలి. ట్రయల్ రూమ్స్, బాత్ రూమ్స్ ఎక్కడైనా సరే ఓ ముందు జాగ్రత్త చూపు చుట్టూ చూడాలి. కెమెరాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండగలవో తెలుసుకోవాలి. ఏది అద్దమో.. ఏది గాజో తెలుసుకోవాలి. మనలను సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కేవలం స్త్రీల సమస్య అనుకుని పురుషులు దూరంగా ఉండకుండా సహకరించాలి. అవగాహన, అప్రమత్తత ఈ రెండూ ఉంటే దొంగ చూపుల కళ్లలో కారం కొట్టినట్టే. మా కళ్లు మీ కెమెరాలను చూస్తున్నాయి.