దృశ్యం.. అమితం | View binge .. | Sakshi
Sakshi News home page

దృశ్యం.. అమితం

Published Sun, Jan 4 2015 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

దృశ్యం.. అమితం

దృశ్యం.. అమితం

Lens& లైఫ్
 
ఆమె కెమెరా కన్ను పడితే ప్రతి దృశ్యం అపురూపమే. ప్రతి కదలికా ప్రత్యేకమే. ఆరేళ్ల వయసు నుంచే ‘లెన్స్’తో అనుబంధం... ‘క్లిక్’ల్లో వినూత్నం... సామాజిక నేపథ్యం. చారిత్రక కట్టడాలు, దైవారాధన, ప్రకృతి సౌందర్యం, గిరిజనుల జీవన విధానం, బాల కార్మికుల బతుకులు... ఆమె కెమెరాకు కనిపించే దృశ్యాలివే. పంజాబ్‌లో పుట్టి... సిటీలో స్థిరపడిన అమితా తల్వార్ ‘లెన్స్ అండ్ లైఫ్’ ఆమె మాటల్లోనే...  
 
మాది పంజాబ్‌లోని పాటియాలా. 1954లో పుట్టిన నేను పెరిగింది అక్కడే. పాటియాలా సివిల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసే నాన్న దయాకృష్ణన్‌పూరీ హాబీగా కెమెరా క్లిక్‌మనిపించేవారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, పర్యాటక ప్రదేశాలకు వెళ్లినా పెంటాక్స్ కెమెరా వెంట తీసుకొచ్చేవారు. అలా నాకు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. ఇది గమనించిన అమ్మానాన్న నాకు బేబీ బ్రౌన్ కెమెరా చేతికిచ్చారు. ఇక అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా ఫొటోలు తీయడం హాబీగా మారింది.

చండీగఢ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీజీ చేశా. 1974లో కోల్‌కతాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పరిక్షిత్ తల్వార్‌తో వివాహమైంది. ఆయన నా ఆసక్తిని గమనించి వెన్నుతట్టారు. అలా నేను ఇప్పటివరకు శ్రీనగర్, జైపూర్, అలహాబాద్‌లోని ప్రయాగ్ మేళా, ఛత్తీస్‌గఢ్, లేహ్, లడఖ్, భూటాన్‌లలో పర్యటించి అక్కడి చారిత్రక, ప్రకృతి అందాలను లెన్స్‌లో బంధించగలిగా. లండన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కరస్పాన్‌డెన్స్ కోర్సు చేశా.

కొన్ని ఇంగ్లిష్ పత్రికలకు ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేశా. భర్త ఐటీసీ భద్రాచాలం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాం. సిటీలో జరిగే ఆర్ట్ అండ్ కల్చర్‌ను కళ్లకు కట్టినట్లు చూపించగలిగా. ఇందులో భాగంగానే ఇటీవలే క్యాన్సర్ రోగులు, బాలల విద్య కోసం నిధులు సేకరించేందుకు ఫొటో ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటుచేశా. ఫిల్మ్ మేకింగ్ చేస్తుంటా.
 
ఆ క్లిక్ మరవలేను...

నా కెమెరాలో బందీ అయిన అన్నీ దృశ్యాలు నాకు బెస్ట్. చారిత్రక కట్టడాలు అయినా, ప్రకృతి సౌందర్యమైనా, బాల కార్మికుల స్థితిగతులైనా... ప్రతి ఫొటోకూ మంచి స్పందన వచ్చింది. ఎన్జీవోలకు నిధుల సేకరణ కోసం నా ఫొటోల ఎగ్జిబిషన్ ‘బుక్ ఆఫ్ మై ఫొటోగ్రఫీ’కి వచ్చిన రెస్పాన్స్ సంతృప్తినిచ్చింది. 2011, 2012, 2013... ఇలా మూడేళ్లు బనారస్ పర్యటనకు వెళ్లా.

ఈ ఏడాది కూడా వెళుతున్నా. తొలిసారి నేను ‘కోర్స్ ఆఫ్ రివర్ గంగా’ వద్దకు వెళ్లి, శివుడికి పూజలు అందించే దృశ్యాన్ని క్లిక్‌మనిపించా. గంగా తీరం, సంధ్యా సమయం.. భక్తజన సంద్రం ఆధ్యాత్మిక వాతావరణంలో పారవశ్యులవుతున్నారు. విశ్వనాథుడు, గంగానది, సూర్యుడు, అగ్ని దేవతలను పూజిస్తూ గంగమ్మకు భక్తులు హారతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో హారతికి ముందు విజిల్ వేస్తారు. వేకువ జామునే లేచి... ఆ విజిల్ వేసే దృశ్యాన్ని కెమెరాలో బంధించా.

చలికాలం కావడంతో విపరీతమైన మంచు. భక్తులు, వారు వెలిగించిన కర్పూర హారతులను క్లిక్‌మనిపించా. ఈ ఫొటో నాకెంతో సంతృప్తినిచ్చింది. కుటుంబ సభ్యులతో ప్రముఖ పర్యాటక కేంద్రం కాశీకి వెళ్లాను. ఆ ట్రిప్‌నూ క్లిక్‌లతో ఫుల్ ఎంజాయ్ చేశా. ఇదే కాదు... నేను తీసిన ఎన్నో ఫొటోలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఈ ఫొటో కోసం నికాన్‌డీ 800 కెమెరా వాడా. బనారస్ ఫొటోలన్నింటితో ఓ పుస్తకం తేవాలనుకుంటున్నా. తద్వారా వచ్చే నిధులను సమాజసేవకు వినియోగించాలన్నదే నా అభిలాష.
 
ప్రజంటర్: వాంకె శ్రీనివాస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement