కెమెరా హమారా | Hamara camera | Sakshi
Sakshi News home page

కెమెరా హమారా

Published Thu, Feb 12 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

Hamara camera

నాలుగొందల ఏళ్ల చారిత్రక వైభవాన్ని ఒడిసిపట్టుకోవాలంటే ఎన్ని జతల కళ్లు అలసటను మర్చిపోవాలి? నవ నాగరిక వర్తమాన విశేషాలను నిక్షిప్తం చేసుకోవాలంటే ఎన్ని వందల కెమెరాలు క్లిక్‌మంటూనే ఉండాలి? మన సిటీ..ఫొటోగ్రాఫర్లకు పెన్నిధి అయింది అందుకే. అరుదైన ఛాయాచిత్రాల అపురూప‘భాగ్య’మైంది అందుకే.
 ..:: ఎస్.సత్యబాబు
 
సంప్రదాయాలకు పెట్టని కోట లాంటి నగరమిది. అత్యాధునిక పోకడలకు పెట్టిన పేరు లాంటి సిటీ ఇది. ప్రార్థన మందిరాల్లో పవిత్ర సందేశాల నుంచి.. పబ్బుల్లో విచిత్ర సంగీతాల దాకా.. అడుగడుగునా వైవిధ్యమే. అణువణువునా వినూత్నమే. విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు, అబ్బురపరిచే జీవనశైలులకు నిలయమైన ఈ నగరం సహజంగానే ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ‘చేతి’నిండా పనిపెడుతోంది. ఎంత చూసినా, ఎన్నిసార్లు తీసినా తనివి తీరడం లేదంటున్నారు వేర్వేరు రంగాల్లో, వృత్తి వ్యాపకాల్లో మునిగితేలుతూ ప్రవృత్తిగా కెమెరాను చేతబట్టిన పలువురు సిటిజనులు.
 
విశేషాలను వెతికే కళ్లు..


మనకు నిత్యం కనిపించే చారిత్రక కట్టడాలు, ప్రాంతాల్లోని ఎవరికీ తెలియని విశేషాలను వెతికిపట్టుకోవడమే తన క్లిక్‌కు కిక్ ఇస్తుందంటున్న బిజినెస్ మేన్ ఉదయన్... గోల్కొండ కోటలో పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఎవరికీ అంతగా తెలియని కాళిమాత ఆలయాన్ని కెమెరాలో బంధించాడు. కాకతీయుల కాలంలో నిర్మించినట్టు చెబుతున్న ఈ రెండు పెద్ద కొండరాళ్ల మధ్య ఉన్న కాళి టెంపుల్...  వైవిధ్యంగా అనిపిస్తుంది.
 
సిటీ ఆఫ్ లైట్...

‘హైదరాబాద్ ఒక కాంతివంతమైన నగరం. ఫొటోగ్రాఫర్లకు దారి చూపే లైట్‌లాంటిదీ సిటీ’ అంటాడు అవినాష్. లైట్ల వెలుతురులో బిర్లామందిర్ అందాలను, అవి హుస్సేన్‌సాగర్ నీళ్లలో ప్రతిఫలించే వైనాన్ని తన కెమెరాలో బంధించిన అవినాష్... సిటీకి సంబంధించి తాను తీసిన బెస్ట్ పిక్చర్‌లలో దీనికి స్థానం ఇస్తాడు. సికింద్రాబాద్‌కు 10కి.మీ దూరంలో ఉన్న మౌలాలి సమీపంలోని ఒక పర్వతం మీద నుంచి వెలుగులీనుతున్న సిటీ అందాన్ని కెమెరాలో బంధించిన చిత్రం కూడా తనకెంతో ఇష్టమైనదని చెబుతాడు.
 
బుద్ధం చిత్రం గచ్ఛామి..


సిటీలో కెమెరా ఫస్ట్‌టైమ్ పట్టుకున్న ఎవరికైనా వెంటనే క్లిక్‌మనిపించాలనే స్పాట్‌లు.. ట్యాంక్‌బండ్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, బుద్ధ విగ్రహం పరిసరాలు. ‘బుద్ధ విగ్రహం దాని చుట్టుపక్కల సాగర్ జలాలు నా ఫేవరెట్ స్పాట్. ఎన్ని సార్లు కెమెరాలో బంధించినా ఇంకా తీయాలనిపిస్తుంది’ అంటాడు కరణ్. తను తీసే ఫొటోల్లో ప్రొఫెషనలిజం కనబరిచే ఈ యువకుడు.. ఫొటోగ్రఫీ ప్రయోగాలకు సిటీ బెస్ట్ ప్లేస్ అంటున్నాడు.
 
చార్మినార్.. కెమెరాకి ప్యార్...


చార్మినార్ ప్రస్తావన తేని వాడు రాష్ట్ర చరిత్రకారుడెలా కాడో చార్మినార్ ఫొటో తీయని వాడు ఫొటోగ్రాఫర్  కాలేడంటోంది ఛాయా చిత్ర ప్రపంచం. ‘రంజాన్ సమయంలో చార్మినార్‌ను చూడాలంటే ఎన్ని కళ్లున్నా సరిపోవు. ఆ మెమొరీ కోసం ఎన్ని సార్లయినా కెమెరాను క్లిక్‌మనిపించవచ్చు’’అని చెప్పింది నమ్రత. కాలేజీ విద్యార్థిని అయిన ఈ యువతి... సిటీ ఫొటోగ్రాఫర్లకు హాట్‌స్పాట్ అంటోంది.
 
చిత్రాల కోట

రాజరిక వైభవానికి చిహ్నం లాంటి గోల్కొండ కోట నా ఫేవరెట్ స్పాట్ అంటాడు సమర్. తరచుగా గోల్కొండకు రౌండ్స్ కొట్టే ఈ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్... ఎంత తవ్వినా తరగని వి-చిత్రాల గనిగా నగరాన్ని అభివర్ణిస్తాడు. గోల్కొండ, దాని పరిసరాలను భిన్న కోణాల్లో చిత్రీకరించడం తనకిష్టమని చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement