గంగా తీరమున..సంధ్యా సమయమునా..
యాభై ఏళ్ల కిందట తనను తనకు చూపిన కెమెరాను చూసి ముచ్చటపడ్డ బుడతడు.. లెన్స్‌పై అప్పుడే కన్నేశాడు. చిట్టి చేతులతో ఇతరుల కెమెరా పట్టుకుని తనకు కనిపించిన సిత్రాలను ఛాయాచిత్రాలుగా మలచి మురిసిపోయాడు. ఆ ముచ్చట చూసిన అతని తల్లిదండ్రులు ఏడేళ్ల వయసులోనే కుర్రాడికి ఓ కెమెరాను బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు.
ఇక అప్పటి నుంచి ఆ కెమెరా ప్రకృతి రమణీయతను, పక్షుల కదలికలను, జంతుజాలం హావభావాలను ఒడిసిపడుతూనే ఉంది. ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికల్లో డిప్యూటీ రెసిడెంట్ ఎడిటర్ స్థాయి వరకు పని చేసిన వజ్జ శ్రీనివాస శర్మ.. వార్తలకే కాకుండా ఫొటోగ్రఫీకి ప్రాణం పోశారు. ఆయన కెమెరా నుంచి జాలువారిన వన్ ఆఫ్ ది బెస్ట్ దృశ్యం గురించి ఈ వారం లెన్స్ అండ్ లైఫ్...
మాది పశ్చిమ గోదావరిలోని ఏలూరు. నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై ఆసక్తి. తల్లిదండ్రులు కొనిచ్చిన కొడాక్ బ్రౌనీ కెమెరాతో ఫొటోలు తీసేవాడిని. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఎడ్యుకేషన్ టూర్‌లకు వెళ్లినా.. నా కెమెరా క్లిక్‌మనాల్సిందే. మద్రాస్‌లోని ఓ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టా పొందాను. అప్పుడు కెమెరా లెన్స్‌పై పూర్తి అవగాహన వచ్చింది. కొంతకాలం ఊటీలోని లారెన్స్ స్కూల్, లవ్‌డేల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశా.
తర్వాత మకాం సిటీకి మార్చా. ఇక్కడికి వచ్చాక ఆర్ట్ రివ్యూస్, బుక్ ఎడిటింగ్ చేసేవాణ్ని. ఆ సమయంలోనే ఇంగ్లిష్ దినపత్రికలో చీఫ్ సబ్ ఎడిట ర్‌గా ఉద్యోగం వచ్చింది. అలా జర్నలిస్ట్‌గా మొదలైన నా ప్రయాణం డిప్యూటీ ఎడిటర్ స్థాయి వరకూ వెళ్లింది. వార్తల కోసం బయటకు వెళ్లినప్పుడు కెమెరాకు పని చెప్పేవాణ్ని. ఇలా నేను తీసిన చాలా ఫొటోలు వార్తల్లో నిలిచాయి. పాలిటిక్స్ నుంచి ప్రకృతి వరకు.. ఇలా ఎన్నో నా లెన్స్ చూశాయి.
మంగళ హారతి ఉతారోరే..
2011 వేసవిలో కుటుంబసభ్యులతో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం కాశీకి వెళ్లాను. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లతో ఆ ట్రిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేశాను. గంగా తీరమున, సంధ్యా సమయం.. భక్తజన సంద్రం ఆధ్యాత్మిక వాతావరణంలో పారవశ్యులవుతున్నారు. విశ్వనాథుడు, గంగానది, సూర్యుడు, అగ్ని దేవతలను పూజిస్తూ గంగమ్మకు భక్తులు హారతి ఇస్తున్నారు.
ఆ సమయంలో నేను నదిలో ఓ బోట్‌లో ఉన్నాను. భక్తజనాన్ని, వారు వెలిగించిన కర్పూర జ్యోతులను నా కెమెరాలో బంధించాను. భక్తి పారవశ్యం తొంగిచూసిన ఆ దృశ్యం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇదే కాదు జర్నలిస్ట్‌గా నేను తీసిన ఎన్నో ఫొటోలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఈ ఫొటో కోసం నికాన్ డీ 5001 కెమెరా వాడాను.
చాలెంజింగ్ జాబ్..
ఫొటోగ్రఫీ జర్నలిజం అంటేనే చాలెంజింగ్ జాబ్. ఇందులో రిస్క్ ఎక్కువ. పనిని ఎంత ఆరాధిస్తే అంత ముందుకు వెళ్తారు. ఈ ఫీల్డ్‌లో ఎన్నో కొత్త ప్రాంతాలు, వ్యక్తులను కలిసే అవకాశముంటుంది. సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది.
ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్