ఆస్కార్ బర్నాక్ (వికీపీడియా ఫోటో)
జర్మనీ దేశస్థుడైన ఆస్కార్ బర్నాక్ కెమెరా డిజైనర్, కంటి అద్దాల ఇంజనీర్, పారిశ్రామిక వేత్త కూడా. ఆయన రూపొందించిన ‘లైకా’ కెమెరా అనేక మార్పులతో ఇప్పటికీ అన్నిదేశాల్లో వాడకంలో ఉంది.
మొదట డాగురే 183 సంవత్సరాల క్రితం ‘కెమెరా’ను కనుగొన్నారు. తొలుత తయారైన కెమెరాలు పెద్దసైజులో ఉండేవి. ఫొటోలు తీయడం కూడా చాలా ఖర్చుతో కూడి ఉండేది. ఆ తర్వాత 75 ఏళ్లకు ఆస్కార్ బర్నాక్ అతిసూక్ష్మమైన సైజులో ఉండే కెమెరాను రూపొందించి మొదటి ప్రపంచ యుద్ధం (1914) సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించి పత్రికా రంగానికి ప్రాణం పోశాడు. అందుకే వీరిని ‘ఫొటోజర్నలిజం పితామహుడు’ అంటారు. వారు తీసిన చిత్రాలు 1916లో ప్రచురింపబడి ప్రపంచ మానవాళికి యుద్ధం వల్ల జరిగే నష్టాలను తెలియ చెప్పటంలో కీలకపాత్ర పోషించాయి. ఆస్కార్ బర్నాక్ జన్మదినం నవంబర్ 1ని ‘ప్రపంచ ఫొటోజర్నలిజం’ దినోత్సవంగా జరుపుకొంటున్నారు.
ఎన్నో కొత్త కంపెనీల చిన్న కెమెరాలు ఎన్ని వచ్చినా ఈనాటికీ డిజిటల్ యుగంలో కూడా ఆస్కార్ బర్నాక్ సృష్టించిన లైకా విధాన కెమెరా అత్యంత పరిపూర్ణమైంది.
1914 తర్వాత వార్తలు, సమాచార ఫొటోగ్రఫీ జర్నలిజం ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేయటంలో ఆయన ఆవిష్కరణ కీలక పాత్ర వహించింది. 1932లో ఓ అడుగు ముందుకువేసి బర్నాక్ కెమెరా లోపల ఒక చిన్న మోటారు అమర్చి ఒక దృశ్యాన్ని తీయగానే ఫిలిం ముందుకు జరిగే విధానానికి నాందిపలికి 1937లో ప్రపంచానికి పరిచయం చేశారు. (క్లిక్ చేయండి: ‘అనంత’ సాంస్కృతిక సేనాని)
ఈమధ్య ఆ కెమెరాను వేలంవేయగా దాదాపుగా 19కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బర్నాక్ 57వ ఏట 16 జనవరి 1936న అకాల మరణం చెందారు. 1979 నుంచీ ఆయన శత జయంతి సందర్భంగా ‘లైకా ఆస్కార్ బర్నాక్’ అంతర్జాతీయ అవార్డును ప్రతి ఏటా ఫొటో జర్నలిజంలో విశేషంగా కృషిచేసిన వారికి లైకా సంస్థ అందిస్తోంది.
– టి. శ్రీనివాసరెడ్డి, ఫొటోజర్నలిస్ట్
ఫెలో ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ, గ్రేట్ బ్రిటన్
(నవంబర్ 1న ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment