షూట్ @ సైట్ | blue funk team | Sakshi
Sakshi News home page

షూట్ @ సైట్

Published Wed, Dec 10 2014 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 4:43 PM

షూట్ @ సైట్ - Sakshi

షూట్ @ సైట్

ఓ అనాథాశ్రమానికి మీరు వెళ్లారు. అక్కడ కనీస వసతులు లేవు. అప్పుడు ఏం చేస్తారు?నిర్వాహకులకు కొన్ని ఉచిత సలహాలు పడేస్తారు. వీలైతే.. కొంత ఆర్థికసాయం చేస్తారు. అలాగే ఓ పదమూడేళ్ల బాలిక అయిన వారికి దూరమై అష్టకష్టాలు పడుతోందనే విషయం తెలిస్తే అయ్యో అని జాలిపడతారు. ఆ అమ్మాయి గాని మిమ్మల్ని కలిస్తే కాసిన్ని డబ్బులిచ్చి సాయపడతారు. ఈ టీమ్ మాత్రం అలా సరిపెట్టదు. సదరు సమస్యలపై కెమెరా ఎక్కుపెడుతుంది. వాటిని ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక బలమైన చేయూతను పోగు చేసుకుని మరీ పరిష్కారాల్ని కనిపెడుతుంది. ఆ టీమ్ పేరు బ్లూ ఫంక్. వీరేం చేశారో, చేయనున్నారో తెలుసుకోవాలనుందా..? అయితే... గెట్ ఇన్ టు దిస్ స్టోరీ...
- ఎస్.సత్యబాబు

 
ఓసారి బ్లూ ఫంక్ టీమ్.. మలక్‌పేటలోని ప్రభుత్వ అంధ పాఠశాలలో వసతుల లేమిపై డాక్యుమెంటరీ తీసింది. దాన్ని నగరంలోని 15 కాలేజీల్లో ప్రదర్శించింది. దీంతో వాళ్లకి కొన్ని ప్రాథమిక అవసరాలు తీరడంతో పాటుగా 12 కంప్యూటర్లు కూడా లభించాయి. సంఘంలో పేరుకుపోయిన సమస్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్న బ్లూ ఫంక్ టీమ్ రూపకర్త అన్షుల్ సిన్హా. ఈ పాతికేళ్ల కుర్రాడి సార థ్యంలో నడుస్తున్న ఈ టీమ్ వినూత్న తరహాలో సొసైటీలోని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ చూపిస్తోంది.
 
బేస్.. కాలేజ్ డేస్..
‘మా సోషల్ రెస్పాన్సిబిలిటీకి బీజం పడింది కాలేజ్ డేస్‌లోనే’ అని చెప్తారు అన్షుల్. మూడేళ్ల క్రితం ఎంబీఏ చదువుతుండగా రోజుకు తలో రూపాయి కలెక్ట్ చేసి పలు ఆర్ఫనేజ్ హోమ్‌లు, ఎన్‌జీవో సంస్థలకు అందించేవాళ్లీ ఫ్రెండ్స్. ‘అయితే మేం చేసే కాసింత సాయం ఏ మూలకీ రాదని తెలిశాక.. ఈ డాక్యుమెంటరీ ఐడియా వచ్చింది’ అంటూ వివరించారు అన్షుల్. అప్పటి నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యల్లో నుంచి కొన్నింటిని ఎన్నుకుని డాక్యుమెంటరీలుగా మలుస్తున్నామన్నారు.
 
సామాజిక కోణం..
‘ఓ ఆర్ఫనేజ్‌కి వెళ్లినప్పుడు నాగోల్ అమ్మాయి వైష్ణవి (13)ని కరీంనగర్ తీసుకెళ్లి చైల్డ్‌లేబర్‌గా మార్చిన వైనాన్ని తెలుసుకుని, ఆ అమ్మాయి కష్టాల్ని యథాతథంగా చిత్రీకరించాం. డాక్యుమెంటరీగా మలచి.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాం’ అంటూ కేవలం ఆర్థిక సాయానికి మాత్రమే కాకుండా మరికొన్ని సామాజిక సమస్యలపై కూడా తాము స్పందించే తీరును వెల్లడించాడు అన్షుల్. అలా ఒక ఏడాదిలో ఈ బృందం 12 డాక్యుమెంటరీలు తీసింది.

వీటిలో కొన్ని పలు అవార్డులను సైతం దక్కించుకున్నాయి. అవార్డుల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సోషల్ కాజ్ కోసమే ఖర్చు పెడుతోందీ టీమ్. రిమూవ్ పావర్టీ ఫ్రం ఇండియా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అనే అంశంపై తీసిన చాకొలెట్ రూమ్, బయో మెడికల్ వేస్టేజ్ పై చిత్రం, హైదరాబాద్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద 3 నెలలు రీసెర్చ్ చేసి తీసిన మరో డాక్యుమెంటరీ.. ఇలా సామాజిక సమస్యల పై స్పందిస్తున్న అన్షుల్ బృందం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
 
ఆ మార్గంలోనే..
‘హ్యాండీ కామ్ లాంటి చిన్న సాధనంతోనే పెద్ద పెద్ద సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అర్థమయ్యాక ఆ మార్గాన్ని వీడలేకపోయాను’ అని అంటాడు అన్షుల్. ఇంటర్ కాలేజ్ ఫిలిం ఫెస్టివల్స్‌లో 14 అవార్డ్స్, మై చాకొలెట్ కవర్ ద్వారా మరో డజనుకు పైగా పురస్కారాలు, కమ్యూనలిజంపై తీసిన ‘లాపెట్’ ద్వారా అంతర్జాతీయ స్థాయి అవార్డ్స్.. ఇలా డాక్యుమెంటరీల ద్వారా అత్యధిక పురస్కారాలు అందుకున్న యువ బృందంగా నిలిచింది బ్లూఫంక్.  తెగిపడి తమ ముందు వాలిన పతంగి కోసం భిన్న మతాలకు చెందిన నలుగురు చిన్నారులు కొట్లాడు కోకుండా దాని చిరుగులు అతికించి, మరింత బాగా ఎగిరేలా చేయడం అనే కాన్సెప్ట్‌తో తీసిన లాపెట్.. పలు అంతర్జాతీయ పురస్కారాలను ఎగరేసుకుపోయింది.
 
సమస్య ఏదైనా..
‘యువతరం తలచుకుంటే అసాధ్యమనేది లేదు. ఒక కాలేజ్‌కు చెందిన కొందరు విద్యార్థులే ఇంత చేయగలిగితే.. సిటీలోని అన్ని కాలేజీల విద్యార్థులు చేయి కలిపితే.. ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంద’ని అంటాడు అన్షుల్. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, తర్వాత విద్యార్థి లోకంలో తలెత్తిన అయోమయాన్ని వివరిస్తూ వీరు తీసిన డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ది ఆన్‌సీన్ డిజాస్టర్, బ్లైండ్ ఇమేజ్, స్విచ్ ఆఫ్, ఫ్లిప్ బుక్, లాపెట్ రిటర్న్స్, రోడ్ ఆఫ్ సెపరో.. ఇలా దాదాపు 38 చిత్రాలు తీసిన ఈ బృందం 48 అవార్డులు సొంతం చేసుకుంది.

ఆర్గాన్ మాఫియాపై గురి...
ఇన్నాళ్లు సామాజిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించిన వీరి కెమెరా.. ఇప్పుడిప్పుడే సవాళ్లకు సై అంటోంది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా పరిశోధనాత్మక చిత్రాలను రూపొందించే పనిలో ఉంది. నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వాస్పత్రులకు చెందిన సిబ్బంది నిర్వాకంతో యథేచ్ఛగా సాగుతున్న ఆర్గాన్ మాఫియాను చూపించడం తమ తొలి ప్రయత్నంగా అన్షుల్ వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా అల్లుకున్న అవయవ వ్యాపారం సిటీలో కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగుతున్న వైనంపై ఏడాది పాటు పరిశోధించి తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ‘ఆర్గాన్ మాఫియాపై తీసిన చిత్రం ‘గేట్ వే టు హెవెన్’ సెన్సార్ దశలో ఉంది, అది వెలుగులోకి వస్తే ఆర్గాన్ మాఫియా జాడలు సమాజానికి తెలుస్తాయి’ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు అన్షుల్. కెమెరా నేత్రంతో వ్యవస్థ బాగు కోసం పాటుపడుతున్న బ్లూ ఫంక్‌కు హ్యాట్సాఫ్ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement