ఫేస్‌బుక్ ప్రాబ్లమ్స్ | facebook problems | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ప్రాబ్లమ్స్

Published Thu, Nov 27 2014 10:45 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్ ప్రాబ్లమ్స్ - Sakshi

ఫేస్‌బుక్ ప్రాబ్లమ్స్

ఈ రోజు మనం ఓ పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. ప్రపంచంలో దాదాపు అందరి దగ్గరా ఈ పుస్తకం ఉన్నట్టే. ఈ పుస్తకంలో ఎవరికి నచ్చిన పేజీలు వాళ్లు పెట్టేసుకోవచ్చు. ఈ పుస్తకానికి ముఖ చిత్రం ఉండదు.. చిత్రంగా ప్రతి ముఖానికీ ఓ పుస్తకం ఉంటుంది. పుస్తకం కాని ఈ పుస్తకం ఏంటో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫేస్‌బుక్ !!
 
‘నా జీవితం తెరిచిన పుస్తకం’ అని అప్పట్లో ఏ మహానుభావుడు అన్నాడో కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు తమ జీవితాలను పుస్తకాలు తెరిచి మరీ ఎక్కించే అవకాశం కల్పించిన ఘనత ఫేస్‌బుక్కుదే. చిన్ననాటి స్నేహితులను కలిపేందుకు ఫేస్‌బుక్.. తెలియని పరిచయాలను పెంచేందుకు ఫేస్‌బుక్.. ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఏం చేసినా ఫేస్‌బుక్ వ్యక్తిత్వానికి చిరునామా, అస్తిత్వానికి హంగామా ఫేస్‌బుక్.
 
కనెక్టింగ్ పీపుల్..

హల్లో, మీరు ఫేస్‌బుక్‌లో లేరా..! అంటూ ఆశ్చర్యపోయే ముఖపుస్తకరాయుళ్లు ఓ వైపు.. అసలు ఈ ముఖానికి ఓ బుక్కు అవసరమా అంటూ వాదించే వాళ్లు మరోవైపు. అసలంటూ అందులోకి దిగకుండా దాని సత్తా గురించి అంచనా వేయడం కష్టం. సామాజిక నెట్‌వర్కుల్లో సంచలనం అయిన ఫేస్‌బుక్, కోట్లాది నెటిజన్ల ఏకగళమై వినిపించే సామూహిక ఉద్యమంలా మారింది. ఈజిప్ట్ తెహ్రిర్ స్క్వేర్‌లో ప్రజావిప్లవం వెల్లువెత్తడానికి కారణం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్. నిరసన గళాలను వినిపించడానికి నూతన భావాలను పంచుకోవడానికీ ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తుందీ పుస్తకం. కొత్త తరానికి తగ్గ సరికొత్త ఆవిష్కరణ అయిన ఈ వేదిక నిస్సందేహంగా ఓ గొప్ప మాధ్యమం.

ఏ దిల్ మాంగే మోర్..
‘అతి సర్వత్ర వర్జయేత్’ ఫిలాసఫీ ఫేస్‌బుక్‌కీ వర్తింపజేసే క్రమంలో ఉంది ఇప్పటి తరం. చిక్కు మాధ్యమంతో కాదు వాడుతున్న విధానంతో. ఫ్రెండ్, ఫ్రెండ్‌కి ఫ్రెండ్, ఫ్రెండ్ ఫ్రెండ్స్‌కి ఫ్రెండ్స్.. ఇలా ఎలా వచ్చారని కాదన్నయ్యా ఎంతమంది ఉన్నారన్నదే ఇప్పటి ట్రెండ్. అంతేనా లైకుకి ప్రతిలైకు సంస్కారం అలాగని ప్రతీదీ లైక్ చేయడానికి అహంకారం, లైకు రావాలంటే లైక్ కొట్టాలి కానీ అక్కడ లైకులకంటే ఇక్కడ లైకులు ఎక్కువ రావాలి. లైకు లైకుకీ లెక్కలుంటాయి. లైకులు తక్కువైతే తిక్కలుంటాయి. లెక్క ఎక్కువైనా ఫర్లేదు షేర్‌ఖాన్, షేర్లు తక్కువ కాకుండా చూసుకోవాలి.

ఫోన్లో ఫొటో కొట్టాలి, గోడ మీద పోస్ట్ పెట్టాలి, వదల బొమ్మాళీ అంటూ ప్రతి బొమ్మనీ ట్యాగ్ చేయాలి. ఎవరు ఏం పెట్టారో చూడాలి. మనం పెట్టింది ఎంతమంది చూశారో చూడాలి. ఎవరు ఇంకా పెట్టని కొత్తదనాన్ని కనిపెట్టాలి. హమ్మయ్య ! ఇన్ని చేస్తే సోషల్ నెట్‌వర్కింగ్‌లో కొంత హోదా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాదండోయ్. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలంటే ఇది డైలీ డోసు లాగా అలవాటు అవ్వాలి. ఇంత సమయం ఎక్కడుంది అని ఆలోచించేవారికి అదనపు సమాచారం. భారతీయులు సగటున 17 నిమిషాలు ప్రతిరోజూ ఫేస్‌బుక్‌లో గడుపుతున్నారట. రోజులో కనీసం మూడుసార్లు తమ పేజీ చూసుకుంటున్నారట. ఇవి కేవలం సగటు లెక్కలు. ఇక ‘సగటు’ అనిపించుకోవడానికి ఇష్టపడని యూత్ రూటే సపరేటు.
 
లైక్ దిస్..
ప్రతిసారీ కొత్తగా ఉండాలనే తపనలో కొత్త ఒత్తిళ్లకు లొంగిపోతున్నాం. ఈ కింది లక్షణాలు ఫేస్‌బుక్ యూజర్స్‌లో కామన్‌గా కనిపిస్తాయి.
మళ్లీ మళ్లీ ఫేస్‌బుక్ చూడాలనిపించడం
నోటిఫికేషన్ రాకపోయినా సరే ఫోన్ చూసుకోవడం
లైక్స్ ఎన్ని వచ్చాయో లెక్క చూడటం
సెల్ఫీ మనకు నచ్చేంత వరకూ తీసి పోస్ట్ చేయడం
ఫ్రెండ్స్లో సగంపైన ఇదివరకు కలవని వారు ఉండటం
రోజుకు రెండుసార్లు స్టేటస్ అప్‌డేట్ చేయటం
ఈమెయిల్ మెసేజ్‌లు తగ్గించడం
ప్రోఫైల్ లేదా కవర్ ఫొటోలో హీరో/హీరోయిన్ల ఫొటోలు పెట్టడం
ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్ తప్పనిసరిగా చూడటం వీటిలో ఏ మూడు లక్షణాలు మీలో ఉన్నా ఫెస్‌బుక్ డిప్రెషన్ సిండ్రోమ్ అనే ఓ కొత్త తరహా జబ్బుకు మీరు దగ్గరైనట్టే.
 
నహి నహి రక్షతి..
లైకులు సంతోషాన్ని ఇచ్చినట్టే ఉంటాయి. ఫ్రెండ్స్ స్టేటస్ నచ్చినట్టే ఉంటుంది. కానీ ఫేస్‌బుక్ ఎడిక్షన్‌లా మారితే మాత్రం లైకులు రాలేదని డిప్రెషన్, పక్కోడి స్టేటస్ మనకంటే బావుందని అసూయ, అందంగా లేనేమోనన్న ఆత్మన్యూనత, వీటితో పాటు ఇంకెన్నో నెగెటివ్ ఎమోషన్స్ పెరుగుతున్నాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. లైకు రేసులో పోటీపడకుండా ఫేస్‌బుక్‌ని వాడండి, ఫేస్‌బుక్‌కి బుక్కైపోకండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement