
విశ్వనగరం వైపు తొలి అడుగు
జీహెచ్‌ఎంసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈపీసీ- యాన్యుటీ విధానంలో రూ.2,631 కోట్లతో మల్టీ లెవెల్ ఫ్లై
మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లకు రంగం సిద్ధం
రూ. 2,631 కోట్ల పనులకు టెండర్లు
ఈపీసీ టెండరు విధానం
కాంట్రాక్టు సంస్థదే నిర్మాణ వ్యయం
పనులు పూర్తయ్యాకే బిల్లులు
20 వాయిదాల్లో... పదేళ్ల పాటు చెల్లింపు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈపీసీ- యాన్యుటీ విధానంలో రూ.2,631 కోట్లతో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు/ గ్రేడ్ సెపరేటర్లు/ జంక్షన్ల నిర్మాణానికి జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దాదాపు రూ.20,600 కోట్లతో పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. తొలిదశలో 18 పనులకు టెండర్లు పిలిచింది. ‘సిగ్నల్ ఫ్రీ’ ప్రయాణానికి సన్నాహాలు చేస్తోంది. ఎలాంటి సిగ్నల్ ఆటంకాలు లేకుండా సాఫీ ప్రయాణానికి 20 ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు మే 30న ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రాధాన్యంగల 20 ప్రదేశాలను తొలిదశలో ఎంపిక చేశారు. వాటిలో రెండుచోట్ల (అబిడ్స్ జీపీఓ - చాదర్‌ఘాట్, మలక్‌పేట మార్గం, సైబర్ టవర్స్ జంక్షన్లు) ప్రస్తుతానికి చేపట్టడం లేదు. టెండరు దక్కించుకున్న సంస్థే నిధులు ఖర్చు చేస్తుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరునెలలకోసారి జీహెచ్‌ఎంసీ బిల్లులుచెల్లిస్తుంది. ఈ మొత్తానికి వడ్డీని టెండర్ల దశలోనే లెక్కించి ఎంత చెల్లించాలనేది నిర్ణయిస్తారు. మొత్తం 20 ఇన్‌స్టాల్‌మెంట్లలో.. అంటే పదేళ్లలో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్టును రెండున్నరేళ్లలో (30 నెలల్లో) పూర్తి చేయాలనేది లక్ష్యం. మూడో సంవత్సరం నుంచి బిల్లుల చెల్లింపు మొదలవుతుంది.
జాయింట్ వెంచర్‌కు అవకాశం
పనిని మొత్తం ఒక్కరే చేయలేని పక్షంలో జాయింట్ వెంచర్‌గా గరిష్టంగా ముగ్గురు కలిసి చేయవచ్చు. ఒక్కో భాగస్వామి కనీస ఈక్విటీ 26 శాతానికి తగ్గకూడదు. డిఫెక్ట్ లయబిలిటీ కింద పనులు చేపట్టే సంస్థే 5 సంవత్సరాల వరకు నాణ్యతకు బాధ్యత వహించాల్సి ఉంది.
స్థలం అందుబాటులో ఉంటేనే...
వంద శాతం స్థలం అందుబాటులో ఉండి... నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించే పనులకు కాంట్రాక్టు దక్కించుకునే సంస్థతో వెంటనే ఒప్పందం చేసుకుంటారు. అలా అవకాశం లేని పక్షంలో స్థలం అందుబాటులోకి వస్తేనే ముందుకు వెళతారు. టెండరు దక్కించుకునే సంస్థ సర్వే, ఇన్వెస్టిగేషన్, సమగ్ర డిజైన్ తదితర పనులు చేయాల్సి ఉంటుంది. ఫ్లై ఓవర్లు,/అండర్‌పాస్‌లలో డ్రైనేజీ వ్యవస్థనుఏర్పాటుచేసి సమీపంలోని డ్రైన్లకు కలపాల్సి ఉంటుంది. విద్యుదీకరణ, ల్యాండ్‌స్కేపింగ్, సైనేజీ, పేవ్‌మెంట్‌మార్కింగ్స్ చేయాలి. అవసరమైన ప్రాంతాల్లో (ఉదా: కేబీర్ పార్కు చుట్టూ, మైండ్‌స్పేస్, ఉప్పల్) తగిన పేవ్‌మెంట్, రిటైనింగ్ వాల్, జాగింగ్‌ట్రాక్ వంటివి నిర్మించాలి.
విశ్వసనీయ సమాచారం మేరకు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ స్పైరల్ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు. దీని అంచనా వ్యయం రూ.170 కోట్లు. ఆరులేన్లతో దీనిని ఏర్పాటు చేస్తారు. మిగతా ప్రాంతాల్లో నిర్మించే ఫ్లై ఓవర్ల ఖర్చు దాదాపు రూ. 60 కోట్ల నుంచి రూ. 100 కోట్లు. ఈ ప్రదేశాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా... రెడ్ సిగ్నళ్లు పడకుండా వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు. అవసరాన్ని బట్టి ఫ్లై ఓవర్లు.. అండర్‌పాస్‌లు..ఒకటి/ రెండు/ మూడు లెవెల్స్‌లో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గానికి పైవరుసలో కానీ లేక దిగువ వరుసలో కానీ నిర్మిస్తారు.
సుదీర్ఘ కసరత్తు
ఈ ప్రాజెక్టు పనుల కోసం జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు ఎనిమిది నెలలుగా సుదీర్ఘ కసరత్తు చేసి ప్రణాళిక రూపొందించారు. సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ, తదితర అంశాలపై విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలు పర్యాయాలు ఈ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. టెండర్ల జారీ తదితర మార్గదర్శకాలకు ఉన్నత స్థాయి కమిటీని నియమించారు.