చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన
2 లక్షల హెక్టార్లలో ఏర్పాటుకు అవకాశం
అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధన, శిక్షణకు యునెస్కో నిధులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/కొయ్యూరు: రాష్ట్రంలో చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో 40 రోజుల్లో యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవావరణ పార్కుగా గుర్తించింది.
4,756 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన శేషాచలం పార్కు రాష్ట్రంలో మొదటిది కాగా తాజాగా 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రెండో పార్కును ప్రతిపాదిస్తున్నారు. ప్రధానంగా అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు వివిధ జీవరాశులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బయోస్పియర్ పార్కును అటవీశాఖ ప్రతిపాదిస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలకు యునెస్కో సహాయం అందించనుంది.
బయోస్పియర్ రిజర్వ్‌గా మర్రిపాకల అటవీ ప్రాంతం
మర్రిపాకల అటవీప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్‌గా ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చింతపల్లి డీఎఫ్‌వో వైవీ నర్సింగరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు డిపోలో కలప వేలం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చింతూరు, రంపచోడవరం డీఎఫ్‌వోలను సంప్రదించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
దట్టమైన అడవి ఉన్న మర్రిపాకల ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కొందరు విద్యుత్ తీగలు అమర్చి జంతువులను వేటాడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జీవావరణ పార్కులో 3 జోన్లు ఉంటాయి
కోర్ జోన్: ఈ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలను అనుమతించరు.
బఫర్ జోన్: పరిమితంగా స్థానిక ప్రజలను మాత్రమే అవసరమైన వనరుల సమీకరణకు అనుమతిస్తారు.
ఫ్రీ జోన్: ఇది పార్కు వెలుపలి ప్రాంతం. ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేకుండా సాధారణ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది.
దేశవ్యాప్తంగా 18 పార్కులు..
జీవావరణ పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని 1971లో యునెస్కో చేపట్టింది. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 18 జీవావరణ పార్కులు ఏర్పాటయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment