ఆ ప్రధాని అందరూ అవాక్కయ్యేలా..
అంటారియో: అది ఓ దేశ ప్రధాని మీడియా సమావేశం. అంతర్జాతీయ సంబంధాలు, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశం తీసుకుంటున్న చర్యలు గురించి మాట్లాడుతున్న సందర్భం. అయితే ఆ సమయంలో ఓ కొంటె రిపోర్టర్ సాక్షాత్తూ.. దేశ ప్రధానినే ఓ వ్యంగ్యమైన ప్రశ్న అడిగారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విచక్షణ కోల్పోయే నేతలను మనం చాలా మందిని చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రశ్న ఎదుర్కొన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడేవ్ అందరినీ అవాక్కయ్యేలా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడేవ్ శుక్రవారం అంటారియోలోని 'ద పెరీమీటర్ ఇనిస్టిట్యూట్ ఫర్ థీయరిటికల్ ఫిజిక్స్' ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కెనడా తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించే సమయంలో ఓ రిపోర్టర్ 'క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను' అని ప్రధానితో వ్యంగ్యంగా అన్నారు. దీనిని సవాల్గా తీసుకున్న ట్రుడేవ్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి గడగడా ఉపన్యాసం మొదలుపెట్టారు. ప్రధాని ఊహించని స్పందనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కేరింతలతో ఆయన ఉపన్యాసాన్ని ఉత్సాహపరిచారు.
రాజకీయాల్లోకి రాక ముందు వాంకోవర్లోని ఓ ఎలిమెంటరీ స్కూల్తో పాటు హై స్కూల్లో బోధించిన అనుభవం ట్రుడేవ్కు ఉంది. అంతేకాదు ఇంజనీరింగ్ పట్టబద్రుడైన ట్రుడేవ్.. ఎన్విరాన్మెంటల్ జాగ్రఫిలో మాస్టర్స్ డిగ్రీని సైతం అభ్యసించారు. ఈ అనుభవంతో ట్రుడేవ్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి లెక్చర్ దంచేశాడంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ట్రుడేవ్ చెప్పిన విషయాలు అతను ఆరోజు ఉదయమే దాని గురించి చదివాడా అన్నంత ఆశ్చర్యానికి గురిచేశాయని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ ప్రొఫెసర్ మార్టిన్ లఫోరెస్ట్ అన్నారు.