భాంగ్రా డ్యాన్స్‌తో ఇరగదీసిన ప్రధాని
ఇటీవల ఎన్నికల్లో కెనడా వాసుల హృదయాలను, ఓట్లను కొల్లగొట్టిన ఆ దేశ యువ ప్రధాని జస్టిన్ ట్రూడ్యూ.. ఓ వీడియోతో భారతీయుల మనస్సుల్లోనూ చోటు సంపాదించారు. ఓ ప్రవాస భారతీయ కార్యక్రమంలో హుషారెత్తించే భాంగ్రా డ్యాన్స్‌తో ఆయన అదరగొట్టారు. కుర్తా-పైజామా ధరించి.. తోటి డ్యాన్సర్లతో పోటీపడుతూ ఆయన వేసిన బాలీవుడ్ స్టెప్పులు ఇప్పుడు ఆన్లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
మూడేళ్ల కిందట భారత 66వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కెనడాలోని మాంట్రియల్ నగరంలో జరిగిన ఇండియా-కెనడా అసోసియేషన్ సదస్సులో పాల్గొన్న యువ నాయకుడు జస్టిన్ ట్రూడ్యూ.. బాలీవుడ్ పాటకు హుషారుగా పాదం కదిపారు. మైకాసింగ్ పాడిన 'దిల్ బోలే హడిప్ప' పాటకు భారతీయులు వేదికపై నాట్యం చేస్తుండగా.. ఆయన కూడా వారితో జతకలిసి.. పోటీపడి బాలీవుడ్ స్టెప్పులు వేశారు. కుర్తా-పైజామా ధరించి భారతీయ ఆహార్యంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్ లో బాగా ఆకట్టుకుంటున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన 43 ఏళ్ల జస్టిన్ ట్రూడ్యూ.. కెనాడా ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.