
మురుగుతో ముడిచమురు!
ఇళ్లల్లో, వీధుల్లో పేరుకుపోయే చెత్త ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం. అయితే ఇలాంటి చెత్తను పనికొచ్చేలా చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నీటిలో చేరిన, పేరుకుపోయిన మురుగును ముడిచమురు వంటి ఇంధనంగా మార్చేసే సాంకేతికత అందుబాటులోకి తెస్తున్నారు. అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరీ (పీఎన్‌ఎన్‌ఎల్) సిద్ధం చేసిన ఈ సాంకేతికత చాలా సులువైంది కూడా. ‘హైడ్రోథర్మల్ లిక్విఫికేషన్’ అని పిలుస్తున్న ఈ సాంకేతికత భూమి పొరల్లోని పరిస్థితులను గుర్తిస్తుంది. విపరీతమైన వేడి, పీడనం కారణంగా కోట్ల సంవత్సరాల కిందటి జీవజాలం ముడిచమురుగా మారిన విషయం తెలిసిందే.
ఇదేతరహాలో మురుగును 350 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద అత్యంత అధిక పీడనానికి గురిచేస్తే అందులోని కణాలు విడిపోయి ముడిచమురును పోలిన ఇంధనంగా మారిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. చమురు శుద్ధి కర్మాగారాల్లో ముడిచమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. 3,400 గ్యాలన్ల మురుగును చమురుగా మారిస్తే అది మూడు కోట్ల బ్యారెళ్లకు సమానమవుతుందని భావిస్తున్నారు. అంటే ఒక్కో మనిషి వ్యర్థం ద్వారా ఏడాదికి దాదాపు 12 లీటర్ల చమురు ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాదు వ్యవసాయ వ్యర్థాలను కూడా ఈ సాంకేతికతతో ఇంధనంగా మార్చవచ్చునని చెబుతున్నారు.