మానవుడికి విశ్వంతో బంధం!
లాస్‌ఏంజెలిస్: మానవుడికి, విశ్వానికి మధ్య మనం ఊహించిన దాని కన్నా దగ్గరి సంబంధాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మానవుడి కణ ద్రవ్య నిర్మాణం, పరమాణు నక్షత్రం (న్యూట్రాన్ స్టార్) సమానంగా ఉన్నాయని, ఈ రెండింటి మధ్య చాలా సారూప్యత ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్న స్ప్రింగ్ మాదిరి కొన్ని నిర్మాణాలకు సంబంధించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్త శాంటా బార్బరా అధ్యయనం చేశారు. ఈ నిర్మాణాలకు ‘టెరసకి రాంప్స్’ అని పేరుపెట్టారు.
పరమాణు నక్షత్ర పటలంలో కూడా ఇలాంటి నిర్మాణాలే ఉన్నట్లు పరమాణు భౌతికశాస్త్రవేత్త చార్లెస్ హోరోవిట్జ్ కనుగొన్నారు. పరమాణు నక్షత్రంలోని నాళికలు (స్పగెట్టీ), పత్రాలను (లసగ్నా) స్ప్రింగ్ మాదిరి నిర్మాణాలు కలిపి ఉంచుతున్నాయని, ఈ స్ప్రింగులు.. టెరసకి రాంప్స్ నిర్మాణాలతో సరిపోలుతున్నాయని గుర్తించారు. అయితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉష్ణగతిక శాస్త్రంపై ఆధారపడి ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా భౌతిక శాస్త్రవేత్త గ్రెగ్ హుబర్ పేర్కొన్నారు. కేంద్రకం, కణాంతర్గతంగా ఉన్న సాంద్రత, ఉష్ణోగ్రత, పీడనం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.