వాషింగ్టన్: అల్లంత దూరాన అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది. ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్ క్యాప్సూల్ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక భూభాగంలో దిగింది. నమూనాను సోమవారం హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అనంతరం వాటిమీద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి.
వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని మీదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్ ఒక్కటే ఆస్టరాయిడ్ శకలాలను భూమికి తెచ్చింది.
Today's #OSIRISREx asteroid sample landing isn't just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time.
— NASA (@NASA) September 24, 2023
These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg
ఏడేళ్ల ప్రయత్నం...
ఆస్టరాయిడ్లపై పరిశోధన నిమిత్తం నాసా 2016లో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. రెండేళ్ల అనంతరం అది బెన్నూగా పిలిచే ఆస్టరాయిడ్ ఉపరితలంపై దిగింది. 2020లో దాని మీదినుంచి స్వల్ప పరిమాణంలో శకలాలను ఒక క్యాప్సూల్ లోకి సేకరించి వెనుదిరిగింది. అప్పటికే అది కోట్లాది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంది.
దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని అంచనా. ఓసిరిస్ ఎక్స్ ప్రస్తుతం అపోఫిస్‌గా పిలిచే మరో ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది.
బెన్నూ రైట్ ఛాయిస్
సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు.
బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుట్టును ఒసైరిస్-రెక్స్ నమూనాలు విప్పే అవకాశం ఉంది.
చాలా గ్రహశకలాలు.. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న గ్రహశకల వలయంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెన్నూ మాత్రం ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వచ్చి వెళుతుంటుంది. అందువల్ల ఆ గ్రహశకలం వద్దకు వ్యోమనౌకను పంపి, భూమికి తిరిగి రప్పించడం చాలా సులువు.
ఉత్కంఠ ప్రయాణంలో..
రోదసిలో దాదాపు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్-రెక్స్.. భూమికి చేరువైంది. భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది.
గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్‌లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్‌లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్-రెక్స్.. తన ఏడేళ్ల ప్రస్థానంలో.. సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది.
Comments
Please login to add a commentAdd a comment