
ఫ్లూటోపై ‘కాటు’
వాషింగ్టన్: ఫ్లూటో గ్రహం ఉపరితలంపై అతిపెద్ద బైట్ మార్క్ (కాటులా ఉండే ఆకారం)ను నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్క్ ఉత్పతనం (నేరుగా ఘన స్థితి నుంచి వాయు స్థితికి మారడం) వల్ల ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఫ్లూటో ఉపరితలం పై మీథేన్ మంచు రూపంలో పుష్కలంగా ఉంటుంది.
ఈ మీథేన్ ఉత్పతనం చెంది కింది భాగంలో నీరు-మంచు రూపంలో ఒక పొరగా కనపడుతోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్పతనం వల్ల ఫ్లూటో గ్రహంపై ఉన్న భాగం కోసుకుపోయినట్లు కనిపిస్తోందన్నారు. ఫ్లూటో ఉపరితలం చాలా చల్లగా ఉండడం వల్ల అక్కడ నీరు గడ్డ కట్టుకుపోయి నిశ్చలంగా కొండలాగా కనిపిస్తుందని వివరించారు. ఫ్లూటోకి 33,900 కి.మీ. ఎత్తు నుంచి న్యూ హారిజాన్స్ అంతరిక్ష నౌక ఫొటోలు తీసి ఈ విషయాలను ధ్రువీకరించిందని తెలిపారు.