అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్‌ఫేస్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు.
ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్‌ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు.
ఇది సైన్స్ ఫిక్షన్ కాదు
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్‌వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్‌లో ఏఐ ఆధారిత ఇంటర్‌ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు.
అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు.
అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment