spaceship
-
వోయేజర్–1 పునరుత్థానం!
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గురుడి చందమామ యూరోపా..
“ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?”… అని ప్రశ్నిస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్రదేశాలను కనిపెట్టేదెలా?వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్రదేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేషించాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ భారత కాలమానం ప్రకారం ఈ నెల 14న రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది.నీరు-రసాయనాలు-శక్తి… ఈ మూడు వనరుల నెలవు!జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది.భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’ యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15-25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట.గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు).అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కల్పించే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’ సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న!గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’ తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది.అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’ గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’ తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది.రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది.యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్’ (జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది.- జమ్ముల శ్రీకాంత్ -
చందమామపై యాక్సిడెంట్.. మీరేం తీసుకెళ్తారు?
మన ఇస్రో మొన్న చందమామపైకి రోవర్‌ను పంపింది. నిన్న రష్యా కూడా పంపింది. ఇంకొన్నేళ్లు ఆగితే మనుషులూ వెళతారు. అక్కడక్కడా కాలనీలు కట్టుకుంటారు. అప్పుడప్పుడూ జనం భూమ్మీదికి, చంద్రుడిపైకి వచ్చిపోతూ ఉంటారు. ఇంతవరకు సరేగానీ.. ఒకవేళ మీరు చంద్రుడిపైకి వెళ్లిన అంతరిక్ష నౌకలో సమస్య వచ్చి, మనుషుల కాలనీకి దూరంగా పడిపోతే ఎలా? అంతరిక్ష నౌకలో దెబ్బతినగా మిగిలిన వస్తువులను ఎలా వాడుతారు? అన్న ఓ కొత్త సవాల్ తెరపైకి వచ్చింది. అదేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఆలోచనకు పరీక్ష.. మెదడుకు మేత.. అంతరిక్షంలో విహరించాలన్నది చాలా మంది కల. ఇప్పటికే చంద్రుడిపై అడుగుపెట్టాం. ఇటీవల మరిన్ని ప్రయోగాలు చేపట్టాం. భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీలనూ కట్టేసుకోనున్నాం. 2025లో మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు అమెరికా ఆర్టిమిస్ మిషన్‌ను కూడా చేపట్టింది. ఈ క్రమంలో చంద్రుడిపైకి రాకపోకలు మొదలై, ఏదైనా సమస్య వస్తే ఎలాగన్న ప్రశ్న ఓ వైపు.. అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి మేధోశక్తికి పరీక్ష పెట్టడం, కొత్త ఆలోచనలు కల్పించే లక్ష్యం మరోవైపు.. అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ ‘ది నాసా మూన్ సరై్వవల్ టెస్ట్’ను రూపొందించింది. ఏ వస్తువుకు.. ఎంత ప్రాధాన్యత అంటూ.. మీరు చంద్రుడిపైకి కొంత మందితో కలిసి వెళ్లిన స్పేస్‌షిప్.. మనుషులు ఉండే కాలనీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. కమ్యూనికేషన్ పరికరాలు పాడయ్యాయి. స్పేస్‌షిప్‌లో పాడైనవి పోగా మిగిలిన 15 వస్తువుల సాయంతో.. అక్కడి నుంచి నడుస్తూ కాలనీకి వెళ్లాలి. గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎగురుతూ, నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న సామగ్రి, పరికరాల లిస్టు ఇది.. వీటిలో దేనికి మొదటి ప్రాధాన్యత, తర్వాత దేనికి.. ఇలా అన్నింటికి నంబర్లు వేయాలి. ఉన్నవి ఇవీ.. ప్రాధాన్యతలు ఏవి? ♦ అగ్గిపెట్టె ♦ పోషకాలన్నీ దట్టించిన ప్రత్యేక ఆహారం ♦ 50 అడుగుల నైలాన్ తాడు ♦ పారాచూట్ సిల్క్ (వస్త్రం) ♦ పోర్టబుల్ హీటింగ్ యూనిట్ (వేడిని ఇచ్చే పరికరం) ♦ రెండు కాలిబర్ పిస్టళ్లు ♦ ఒక బాక్స్ నిండా పాల సీసాలు ♦ ఒక్కోటీ 45కిలోల బరువున్న రెండు ఆక్సిజన్ సిలిండర్లు ♦ అంతరిక్షంలో చుక్కల స్థానాన్ని బట్టి మన స్థానం తెలుసుకునే మ్యాప్ ♦ లైఫ్ రాఫ్ట్ (అత్యవసర సమయాల్లో ఒక్కసారిగా గాలి నిండి పడవలా మారే బెలూన్) ♦ దిక్కులను చూపించే మాగ్నెటిక్ కంపాస్ ♦ 20 లీటర్ల నీళ్ల క్యాన్ ♦ సిగ్నల్ ఫ్లేర్స్ (బాణాసంచా రాకెట్లా గాల్లోకి పంపి మన స్థానం తెలిపే పరికరం) ♦ వివిధ రకాల విటమిన్లు, అత్యవసర మందుల సిరంజీలు ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ♦ సోలార్ పవర్‌తో పనిచేస్తూ.. ఎఫ్ఎం రేడియో సిగ్నళ్లు పంపే, అందుకునే పరికరం (చందమామపై కాలనీకి దూరంగా చిక్కుకుపోయిన మీరు వీటిలో ఏయే పరికరాలకు ఎంత ప్రాధాన్యత క్రమం ఇస్తారో ఇవ్వండి. తర్వాత కింద నాసా నిపుణులు ఇచ్చిన ఫలితాలు చూడండి) ఇదీ ప్రాధాన్యత.. దేనికి? ఎందుకు? 1. ఆక్సిజన్ ట్యాంకులు: అంతరిక్షంలో మనం జీవించడానికి ఆక్సిజన్ అత్యంత కీలకం. ఆహారం లేకుండా కొన్నిరోజులు ఉండొచ్చు. స్పేస్‌సూట్ శరీరంలోని నీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఇంకొన్ని రోజులు బతకొచ్చు. కానీ ఆక్సిజన్ లేకుంటే నిమిషం కూడా బతకలేం. అందుకే దీనికి ఫస్ట్ ప్రయారిటీ. చంద్రుడిపై గ్రావిటీ తక్కువ కాబట్టి ఆక్సిజన్ ట్యాంకుల బరువు కూడా పెద్ద విషయమేం కాదు. భూమ్మీదితో పోలిస్తే.. ఒక్కో ట్యాంకు ఏడెనిమిది కిలోలే ఉంటుందట. 2. మంచి నీళ్లు: ఆక్సిజన్ తర్వాత అత్యంత ముఖ్యమైనవి మంచి నీళ్లే. తగిన స్థాయిలో నీళ్లు ఉంటే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చు. కాలనీకి చేరుకోవచ్చు. 3. అంతరిక్ష మ్యాప్: చంద్రుడిపై కూడా దాదాపు భూమి నుంచి చూసినట్టే.. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు కనిపిస్తాయి. అందువల్ల ముందే కాలనీలు మార్క్ చేసి ఉన్న మ్యాప్ ఉంటే.. ఆ వైపుగా ప్రయాణం చేయవచ్చు. 4. ప్రత్యేక ఆహారం: చిక్కుకున్న చోటి నుంచి కాలనీకి వెళ్లాలన్నా, రెస్క్యూ బృందం వచ్చేదాకా బతకాలన్నా ఆహారం కావాల్సిందే. 5. ఎఫ్ఎం పరికరం: ఎఫ్ఎం ట్రాన్స్మిటర్/రిసీవర్ పరికరాలు కొన్ని కిలోమీటర్ల వరకే సిగ్నళ్లను పంపడం, అందుకోవడం చేయగలుగుతాయి. అయినా అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూకు, సమీపంలోని ఇతర బృందాలకు సమాచారం ఇవ్వడానికి పనికివస్తాయి. 6. నైలాన్ తాడు: చంద్రుడిపై నైలాన్ తాడు ఎందుకు అనిపించొచ్చు. అక్కడ గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు తాడుతో పట్టుకుని ఉండొచ్చు. చిన్నపాటి కొండల్లాంటివి ఉంటే ఎక్కడానికి వినియోగించుకోవచ్చు. మన సామగ్రిని ఒక్కదగ్గర కట్టి ఉంచుకోవచ్చు. 7. ఫస్ట్ ఎయిడ్ కిట్: స్పేస్ షిప్ కూలిపోయినప్పుడు గాయపడినా, ప్రయాణంలో సమస్య తలెత్తినా, ఏదైనా అకస్మాత్తు అనారోగ్యానికి గురైనా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో లాభం ఉంటుంది. అందులోని విటమిన్ ఇంజెక్షన్లు.. మన శరీరం సంతులనంగా ఉండటానికి తోడ్పడుతాయి. 8. పారాచూట్ వస్త్రం: చంద్రుడిపై వాతావరణం ఉండదు. కాబట్టి సూర్యుడి అతినీలలోహిత (యూవీ) కిరణాలు నేరుగా పడతాయి. దీనితో స్పేస్ సూట్, సామగ్రితోపాటు మన కళ్లకూ నష్టం. అలా జరగకుండా పారాచూట్ వస్త్రం కప్పుకోవచ్చు. 9. లైఫ్ రాఫ్ట్: అత్యవసర పరిస్థితుల్లో వాడే లైఫ్రాఫ్ట్లో వేగంగా వాయువు నిండటానికి కార్బన్ డయాక్సైడ్ను బాగా ఒత్తిడితో నింపిన బాటిళ్లు ఉంటాయి. చంద్రుడిపై గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి.. బాటిళ్లను స్పేస్సూట్కు కట్టుకుని, కార్బన్ డయాక్సైడ్ను మెల్లగా వదులుతూ ఉంటే.. రాకెట్లా ముందుకెళ్లిపోవచ్చు. 10. సిగ్నల్ ఫ్లేర్స్: కాలనీలకు దూరంగా ఎక్కడో స్పేస్‌షిప్ కూలిపోతే.. సిగ్నల్ ఫ్లేర్స్‌తో ప్రయోజనం లేనట్టే. అయితే రెస్క్యూ బృందాలు వచ్చినప్పుడు మాత్రం వాటితో మనమున్న స్థానాన్ని గుర్తించేలా చేయవచ్చు. 11. కాలిబర్ పిస్టళ్లు: చందమామపై పిస్టళ్లు దేనికి అనే అనుమానం రావొచ్చు. అయితే లైఫ్ రాఫ్ట్లలోని కార్బన్ డయాక్సైడ్ క్యాన్ల తరహాలో.. మనం వేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు రాకెట్లలాగా పిస్టల్ కాల్పులు ఉపయోగపడతాయట. 12. పాల క్యాన్లు: పోషకాలతో కూడిన ప్రత్యేక ఆహారం ఎలాగూ ఉంది. ఇంకా ఈ పాలక్యాన్లు అదనపు బరువు. ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తే మాత్రం వీటితో ప్రయోజనం 13. హీటింగ్ యూనిట్: చంద్రుడిపై వెలుతురు భాగంలో వేడికి కొదవ లేదు. ఒకవేళ చీకటి భాగంలోకి వెళితే మాత్రం హీటింగ్ యూనిట్ అవసరం. లేకుంటే ఉత్తదే. 14. మ్యాగ్నెటిక్ కంపాస్: చంద్రుడిపై అయస్కాంత క్షేత్రం సరిగా లేదు. అందువల్ల అక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్‌కు పనిలేదు. 15. అగ్గిపెట్టె: దీన్ని ఎంచుకోవడం అన్నింటికన్నా వృథా. ఎందుకంటే చంద్రుడిపై ఆక్సిజన్ ఉండదు కాబటి అగ్గిపుల్ల వెలగదు, మంట అంటుకోదు. మనం సరై్వవ్ కావడానికి ఏమాత్రం పనికిరాదు. -
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్‌వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రునిపై కూలిన జపాన్ వ్యోమనౌక!
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ ఐస్పేస్ ప్రయోగించిన ల్యాండర్ మంగళవారం చంద్రునిపై దిగే క్రమంలో కుప్పకూలినట్టు సమాచారం. చంద్రుని ఉపరితలానికి కేవలం 10 మీటర్ల దూరంలో ఉండగా దానితో సంబంధాలు తెగిపోయాయి. 6 గంటలకు పైగా విఫలయత్నం చేసిన అనంతరం, చివరి అంకంలో ల్యాండర్ చంద్రున్ని ఢీకొట్టి కుప్పకూలిందని ఐస్పేస్ ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై ల్యాండర్‌ను దించిన తొలి ప్రైవేట్ కంపెనీగా అది చరిత్రకెక్కేది. ఇంతటితో కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నిస్తామని దాని సీఈఓ హకమడ ప్రకటించారు. -
నమ్మశక్యం కాని అనుభవం
హ్యూస్టన్: అంతరిక్షం నుంచి భూగోళాన్ని వీక్షించడం నమ్మశక్యం కాని, జీవితాన్ని మార్చే గొప్ప అనుభవమని ఇండియన్ అమెరికన్, తెలుగు బిడ్డ శిరీష బండ్ల పేర్కొన్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ–22 స్పేస్‌షిప్‌లో రిచర్డ్ బ్రాన్సన్, మరో నలుగురితో కలిసి ఆమె ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. రోదసిలో తనకు ఎదురైన అనుభవాన్ని శిరీష సోమవారం ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్పేష్‌షిప్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం, క్షేమంగా భూమిపైకి తిరిగి రావడం.. మొత్తం ప్రయాణం ఒక అద్భుతమన్నారు. తన అనుభవాన్ని వర్ణించడానికి ‘నమ్మశక్యం కాని’ కంటే మరో ఉత్తమమైన పదం కోసం వెతుకుతున్నానని, ప్రస్తుతానికి ఆ పదమే తన మదిలో మెదులుతోందని అన్నారు. రోదసి నుంచి మన భూమిని వీక్షించడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రోదసిలోకి వెళ్లాలన్నది తన కల అని, అదిప్పుడు సాకారమయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగామి కావడం చిన్నప్పటి నుంచి తన లక్ష్యమని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐఎస్ఎస్కు ఎలుకలు, పురుగులు
కేప్ కార్నివాల్ (అమెరికా): ఆదివారం తెల్లవారుజామునే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కొత్త మిత్రులు సందడి చేశాయి. స్టేషన్ కమాండర్, ఇటలీకి చెందిన ల్యూకా పార్మిటానో ఓ పెద్ద రోబో చెయ్యిని వినియోగించి వాటిని కేంద్రంలోకి తీసుకొచ్చి సాదరస్వాగతం పలికారు. ఇంతకీ ఈ మిత్రులు ఎవరో చెప్పలేదు కదా..! ఓ స్మార్ట్ రోబో, కండలుదిరిగిన పెద్దపెద్ద ఎలుకలు, క్రిమిసంహారక పురుగులే..!‘స్పేస్ ఎక్స్’అనే అమెరికా సంస్థే వీటిని ఐఎస్ఎస్కి చేర్చింది. దీనికోసం కేప్ కార్నివాల్‌లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రెండు అంతరిక్ష నౌకల సాయంతో 3 రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎలుకలు, పురుగులే కదా.. వీటి బరువు కేవలం ఓ రెండు, మూడు కిలోలు ఉంటాయని అనుకుంటే పొరపాటే. వీటి బరువు దాదాపు 3 టన్నులు.. అంటే 2,720 కిలోగ్రాములు అన్నమాట. కొత్త మిత్రుల్లో ఓ 40 ఎలుకలు ఉన్నాయి. వీటిని కండలు, ఎముకల పరీక్షల కోసం అక్కడకు పంపించారు. వీటిలో జన్యుపరంగా తయారు చేయబడిన బాహుబలి లాంటి ఎలుకలు 8 ఉన్నాయి. వీటి బరువు సాధారణ ఎలుకల కంటే రెట్టింపు ఉంటుంది. అలాగే లక్షా 20 వేల నులి పురుగులు ఉన్నాయి. వీటిని వ్యవసాయంలో క్రిమిసంహారకం కోసం అక్కడకు పంపించారు. కృత్రిమ మేథస్సు సాంకేతికతతో పనిచేసే రోబో అయితే ఎదుటివారి భావాలను అర్థం చేసుకోగలదు. దీని పేరు సిమన్. దీనిని వ్యోమగాముల భావాలను అర్థం చేసుకోవడానికి పంపించారు. ఇక ఐఎస్ఎస్లో ఉన్న ఆరుగురు వ్యోమగాముల కోసం నాసా క్రిస్మస్ పండుగ సందర్భంగా బహుమతులు పంపింది. -
సంచలనం.. ఆ రోజు స్ట్రెచర్‌పై ఉంది ఏలియన్
-
సంచలనం.. ఆ రోజు స్ట్రెచర్‌పై ఉంది ఏలియన్
మెక్సికో : సరిగ్గా 1947లో అమెరికా, మెక్సికోలోని పత్రికలన్నీ వేర్వేరు కథనాలతో నిండిపోయాయి. ప్రపంచ దృష్టి సైతం కూడా ఆ వైపుగా పడింది. ఏలియన్ల ప్రస్తావన కూడా అప్పటి నుంచే ఊపందుకొంది. ఎందుకంటే ఆ ఏడాదిలో మెక్సికోలోని రోస్వెల్ అనే ప్రాంతానికి సమీపంలోని 51 అనే ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా బలగాలు చెప్పాయి. అయితే, కొందరు మాత్రం ఓ ప్లైయింగ్ సాసర్ పేలిపోయిందని, అది ఏలియన్ల అంతరిక్ష నౌక అని మరికొందరు చెప్పారు. మరోపక్క, రష్యా అణుబాంబు పరీక్ష వివరాలు తెలుసుకునేందుకు సీక్రెట్‌గా ఏర్పాటుచేసిన ప్రయోగంలో ఆ బెలూన్ పేలిపోయిందంటూ మరిన్న కథనాలు వినిపించాయి. దాని అనంతరం ఎన్నో పరిశోధనలు, ఎన్నో సైద్ధాంతిక గ్రంథాలు ఆఖరికి సినిమాలు, సీరియల్స్ కూడా వచ్చాయి. అయితే, వాటన్నింటిని పటాపంచలు చేసేలా ఓ సంచలనాత్మక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ పేలుడు సంభవించిన సమయంలో అక్కడికి చేరుకున్న యూఎస్ బలగాలు ఓ స్ట్రెచర్‌పై ఏలియన్ బాడీని తీసుకెళుతున్నట్లు అందులో ఉంది. యూఎఫ్ఓ స్పేస్ షిప్ అక్కడే కూలిపోయిందని దాంతో అందులోని ఏలియన్ గాయపడిందని, దానిని స్ట్రెచర్‌పై స్వయంగా తరలించారని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. భిన్నకథనాలు పుట్టుకొచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మంది కచ్చితంగా ఆరోజు ప్లైయింగ్ సాసర్ పేలిపోయిందని, అందులో ఓ ఏలియన్‌ను కూడా తాము చూశామని చెప్పేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఏ చర్చకు దారి తీస్తుందో చూడాలి. -
ఏలియన్స్, నక్షత్రాలను చేరుకునేందుకు..
న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ రష్యా బిలియనీర్ యూరీ మిల్నర్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్లతో కలిసి నక్షత్ర యానం చేసే చిన్న స్పేస్‌క్రాఫ్ట్‌లను తయారుచేసేందుకు 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని హాకింగ్స్, మిల్నర్‌లు వన్ వరల్డ్ అబ్జర్వేటరీ ఇన్ న్యూయార్క్‌లో ప్రకటించారు. తక్కువ సమయంలో.. 'బ్రేక్ త్రూ స్టార్ షాట్' పేరుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో కాంతి వేగానికి 20 రెట్లు ఎక్కువగా ప్రయాణించగల నానోక్రాఫ్ట్లను ( ప్రస్తుత స్పేస్‌క్రాఫ్ట్‌లతో పోల్చితే 1,000 రెట్లు వేగంగా ప్రయాణించగలవు) తయారుచేయనున్నారు. నానోక్రాఫ్ట్లు నిర్మించడం పూర్తయిన తర్వాత ఇవి ఆల్ఫా సెంటౌరీ (భూమికి 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం) ని చేరుకోగలదని, ఇందుకు 20 సంవత్సరాల కాలం పడుతుందని మిల్నర్ తెలిపారు. సాధారణ స్పేస్ క్రాఫ్ట్‌లు ఈ దూరాన్ని పూర్తి చేయడానికి 30,000 సంవత్సరాలకు పైచిలుకు సమయం పడుతుంది. చిన్న భాగాలతో.. మొత్తం రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అందుబాటులో ఈ నానోక్రాఫ్ట్ల్లో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. 1. కంప్యూటర్ సీపీయూ సైజ్‌లో ఉండే 'స్టార్ చిప్' 2. మెటామెటీరియల్‌తో రూపొందించిన 'లైట్సెయిల్' ఇందులో కేవలం కొన్ని వందల ఆటమ్స్ మందంగా ఉంటాయి. కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉండే స్టార్చిప్లో విశ్వ పరిశోధనకు అవసరమైన కెమెరాలు, నావిగేషన్, సమాచార సాధనాలు ఇమిడి ఉంటాయి. స్టార్చిప్లను ఐ-ఫోన్ ఖరీదులోనే ఒకేసారి తయారు చేసుకోవచ్చని మిల్నర్ వివరించారు. ఏలియన్ల వెతుకులాటకు.. సాధనాలను శక్తిమంతమైన లేజర్ సాయంతో విశ్వ ప్రయాణానికి పంపుతామని, ఇందుకు 100 గిగావాట్ల పవర్‌ను ఉపయోగిస్తామని న్యూస్కాన్ఫరెన్స్ పేనెలిస్ట్ లోఏబ్ తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పదిహేను ఏళ్ల కిందట ఇటువంటి ప్రయోగాలు చేయడంపై పెట్టుబడి పెట్టడం అర్ధం లేదని కానీ, ఇప్పుటి పరిస్థితులు వేరు' అని మిల్నర్ అన్నారు. గత ఏడాది జులై 2015లో మిల్నర్, హాకింగ్స్లు పాలపుంతకు దగ్గరగా ఉన్న 100 గెలాక్సీల్లో ఏలియన్లను వెతకడానికి ప్రారంభించిన ప్రాజెక్టు కూడా బ్రేక్ త్రూలో ఒక భాగం. 'భూమ్యకర్షణ శక్తి మనల్ని కిందే ఉండేలా చేస్తుంది. కానీ, నేను అమెరికాకు ఎగురుకుంటూ వెళ్లగలిగాను.' అని హాకింగ్స్ పేర్కొన్నారు. 'ఆల్ఫా సెంటౌరీని చేరుకోవడం ఒక్కటే మా లక్ష్యం కాదు. ఆ మార్గంలో మేం ఎదుర్కొనే సవాళ్లు కూడా మా లక్ష్యమే. ఇందులో చాలా పెద్ద మొత్తంలో సైన్స్‌ను తెలుసుకోబోతున్నాం' అని జెమీసన్ అన్నారు. 'ఈ రోజు మనిషి మొదటిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన రోజు. ఇదే రోజున మేం మరో పెద్ద కార్యాన్ని తలపెడుతున్నాం' అని హాకింగ్స్ అన్నారు.