Human Colonies On The Moon In The Future - Sakshi
Sakshi News home page

చందమామపై యాక్సిడెంట్‌.. మీరేం తీసుకెళ్తారు?

Published Mon, Aug 14 2023 1:32 AM | Last Updated on Mon, Aug 14 2023 5:58 PM

Human colonies on the moon in the future - Sakshi

మన ఇస్రో మొన్న చందమామపైకి రోవర్‌ను పంపింది.  నిన్న రష్యా కూడా పంపింది. ఇంకొన్నేళ్లు ఆగితే మనుషులూ వెళతారు. అక్కడక్కడా కాలనీలు కట్టుకుంటారు.  అప్పుడప్పుడూ జనం భూమ్మీదికి, చంద్రుడిపైకి వచ్చిపోతూ  ఉంటారు. ఇంతవరకు సరేగానీ.. ఒకవేళ మీరు చంద్రుడిపైకి వెళ్లిన అంతరిక్ష నౌకలో సమస్య వచ్చి, మనుషుల కాలనీకి దూరంగా పడిపోతే ఎలా? అంతరిక్ష నౌకలో దెబ్బతినగా  మిగిలిన వస్తువులను ఎలా వాడుతారు? అన్న ఓ కొత్త  సవాల్‌ తెరపైకి వచ్చింది. అదేమిటో తెలుసుకుందామా? 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

ఆలోచనకు పరీక్ష.. మెదడుకు మేత.. 
అంతరిక్షంలో విహరించాలన్నది చాలా మంది కల. ఇప్పటికే చంద్రుడిపై అడుగుపెట్టాం. ఇటీవల మరిన్ని ప్రయోగాలు చేపట్టాం. భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీలనూ కట్టేసుకోనున్నాం. 2025లో మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు అమెరికా ఆర్టిమిస్‌ మిషన్‌ను కూడా చేపట్టింది. ఈ క్రమంలో చంద్రుడిపైకి రాకపోకలు మొదలై, ఏదైనా సమస్య వస్తే ఎలాగన్న ప్రశ్న ఓ వైపు.. అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి మేధోశక్తికి పరీక్ష పెట్టడం, కొత్త ఆలోచనలు కల్పించే లక్ష్యం మరోవైపు.. అమెరికాకు చెందిన టెక్సాస్‌ యూనివర్సిటీ ‘ది నాసా మూన్‌ సరై్వవల్‌ టెస్ట్‌’ను రూపొందించింది. 

ఏ వస్తువుకు.. ఎంత ప్రాధాన్యత అంటూ.. 
మీరు చంద్రుడిపైకి కొంత మందితో కలిసి వెళ్లిన స్పేస్‌షిప్‌.. మనుషులు ఉండే కాలనీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. కమ్యూనికేషన్‌ పరికరాలు పాడ­య్యాయి. స్పేస్‌షిప్‌లో పాడైనవి పోగా మిగిలిన 15 వస్తువుల సాయంతో.. అక్కడి నుంచి నడుస్తూ కాలనీకి వెళ్లాలి. గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎగురుతూ, నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న సామగ్రి, పరికరాల లిస్టు ఇది.. వీటిలో దేనికి మొదటి ప్రాధాన్యత, తర్వాత దేనికి.. ఇలా అన్నింటికి నంబర్లు వేయాలి. 

ఉన్నవి ఇవీ.. ప్రాధాన్యతలు ఏవి? 
 అగ్గిపెట్టె 
 పోషకాలన్నీ దట్టించిన ప్రత్యేక ఆహారం 
 50 అడుగుల నైలాన్‌ తాడు 
 పారాచూట్‌ సిల్క్‌ (వస్త్రం) 
 పోర్టబుల్‌ హీటింగ్‌ యూనిట్‌ (వేడిని ఇచ్చే పరికరం) 
 రెండు కాలిబర్‌ పిస్టళ్లు 
 ఒక బాక్స్‌ నిండా పాల సీసాలు 
 ఒక్కోటీ 45కిలోల బరువున్న రెండు ఆక్సిజన్‌ సిలిండర్లు 
 అంతరిక్షంలో చుక్కల స్థానాన్ని బట్టి మన స్థానం తెలుసుకునే మ్యాప్‌ 
 లైఫ్‌ రాఫ్ట్‌ (అత్యవసర సమయాల్లో ఒక్కసారిగా గాలి నిండి పడవలా మారే బెలూన్‌) 
  దిక్కులను చూపించే మాగ్నెటిక్‌ కంపాస్‌ 
 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ 
  సిగ్నల్‌ ఫ్లేర్స్‌ (బాణాసంచా రాకెట్‌లా గాల్లోకి పంపి మన స్థానం తెలిపే పరికరం) 
   వివిధ రకాల విటమిన్లు, అత్యవసర మందుల సిరంజీలు ఉన్న ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ 
   సోలార్‌ పవర్‌తో పనిచేస్తూ.. ఎఫ్‌ఎం రేడియో సిగ్నళ్లు పంపే, అందుకునే పరికరం 

(చందమామపై కాలనీకి దూరంగా చిక్కుకుపోయిన మీరు వీటిలో ఏయే పరికరాలకు ఎంత ప్రాధాన్యత క్రమం ఇస్తారో ఇవ్వండి. తర్వాత కింద నాసా నిపుణులు ఇచ్చిన ఫలితాలు చూడండి) 

ఇదీ ప్రాధాన్యత.. దేనికి? ఎందుకు? 
1. ఆక్సిజన్‌ ట్యాంకులు: అంతరిక్షంలో మ­నం జీవించడానికి ఆక్సిజన్‌ అత్యంత కీల­కం. ఆహారం లేకుండా కొన్నిరోజులు ఉండొ­చ్చు. స్పేస్‌సూట్‌ శరీరంలోని నీటిని రీసైకిల్‌ చే­య­డం ద్వారా ఇంకొన్ని రోజులు బతకొచ్చు. కానీ ఆక్సిజన్‌ లేకుంటే నిమిషం కూడా బతకలేం. అందుకే దీనికి ఫస్ట్‌ ప్రయారిటీ. చంద్రుడిపై గ్రావి­టీ త­క్కువ కాబట్టి ఆక్సిజన్‌ ట్యాంకుల బరు­వు కూ­డా పెద్ద విషయమేం కాదు. భూమ్మీదితో పోలి­స్తే.. ఒక్కో ట్యాంకు ఏడెనిమిది కిలోలే ఉంటుందట.  

2. మంచి నీళ్లు: ఆక్సిజన్‌ తర్వాత అత్యంత ముఖ్యమైనవి మంచి నీళ్లే. తగిన స్థాయిలో నీళ్లు ఉంటే డీహైడ్రేషన్‌ బారినపడకుండా ఉండొచ్చు. కాలనీకి చేరుకోవచ్చు. 

3. అంతరిక్ష మ్యాప్‌: చంద్రుడిపై కూడా దాదాపు భూమి నుంచి చూసినట్టే.. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు కనిపిస్తాయి. అందువల్ల ముందే కాలనీలు మార్క్‌ చేసి ఉన్న మ్యాప్‌ ఉంటే.. ఆ వైపుగా ప్రయాణం చేయవచ్చు.  

4. ప్రత్యేక ఆహారం: చిక్కుకున్న చోటి నుంచి కాలనీకి వెళ్లాలన్నా, రెస్క్యూ బృందం వచ్చేదాకా బతకాలన్నా ఆహారం కావాల్సిందే.  

5. ఎఫ్‌ఎం పరికరం: ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్‌/రిసీవర్‌ పరికరాలు కొన్ని కిలోమీటర్ల వరకే సిగ్నళ్లను పంపడం, అందుకోవడం చేయగలుగుతాయి. అయినా అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూకు, సమీపంలోని ఇతర బృందాలకు సమాచారం ఇవ్వడానికి పనికివస్తాయి. 

6. నైలాన్‌ తాడు: చంద్రుడిపై నైలాన్‌ తాడు ఎందుకు అనిపించొచ్చు. అక్కడ గ్రావిటీ తక్కు­వగా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు తాడుతో ప­ట్టుకుని ఉండొచ్చు. చిన్నపాటి కొండల్లాంటివి ఉంటే ఎక్కడానికి వినియోగించుకోవచ్చు. మన సామగ్రిని ఒక్కదగ్గర కట్టి ఉంచుకోవచ్చు.  

7. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌: స్పేస్‌ షిప్‌ కూలిపోయినప్పుడు గాయపడినా, ప్రయాణంలో సమస్య తలెత్తినా, ఏదైనా అకస్మాత్తు అనారోగ్యానికి గురైనా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌తో లాభం ఉంటుంది. అందులోని విటమిన్‌ ఇంజెక్షన్లు.. మన శరీరం సంతులనంగా ఉండటానికి తోడ్పడుతాయి.  

8. పారాచూట్‌ వస్త్రం: చంద్రుడిపై వాతావరణం ఉండదు. కాబట్టి సూర్యుడి అతినీలలోహిత (యూవీ) కిరణాలు నేరుగా పడతాయి. దీనితో స్పేస్‌ సూట్, సామగ్రితోపాటు మన కళ్లకూ నష్టం. అలా జరగకుండా పారాచూట్‌ వస్త్రం కప్పుకోవచ్చు. 

9. లైఫ్‌ రాఫ్ట్‌: అత్యవసర పరిస్థితుల్లో వాడే లైఫ్‌రాఫ్ట్‌లో వేగంగా వాయువు నిండటానికి కార్బన్‌ డయాక్సైడ్‌ను బాగా ఒత్తిడితో నింపిన బాటిళ్లు ఉంటాయి. చంద్రుడిపై గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి.. బాటిళ్లను స్పేస్‌సూట్‌కు కట్టుకుని, కార్బన్‌ డయాక్సైడ్‌ను మెల్లగా వదులు­తూ ఉంటే.. రాకెట్‌లా ముందుకెళ్లిపోవచ్చు. 

10. సిగ్నల్‌ ఫ్లేర్స్‌: కాలనీలకు దూరంగా ఎక్కడో స్పేస్‌షిప్‌ కూలిపోతే.. సిగ్నల్‌ ఫ్లేర్స్‌తో ప్రయోజనం లేనట్టే. అయితే రెస్క్యూ బృందాలు 
వచ్చినప్పుడు మాత్రం వాటితో మనమున్న స్థానాన్ని గుర్తించేలా చేయవచ్చు. 

11. కాలిబర్‌ పిస్టళ్లు: చందమామపై పిస్టళ్లు దేనికి అనే అనుమానం రావొచ్చు. అయితే లైఫ్‌ రాఫ్ట్‌లలోని కార్బన్‌ డయాక్సైడ్‌ క్యాన్ల తరహాలో.. మనం వేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు రాకెట్లలాగా పిస్టల్‌ కాల్పులు ఉపయోగపడతాయట. 

12. పాల క్యాన్‌లు: పోషకాలతో కూడిన ప్రత్యేక ఆహారం ఎలాగూ ఉంది. ఇంకా ఈ పాలక్యాన్‌లు అదనపు బరువు. ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తే మాత్రం వీటితో ప్రయోజనం  

13. హీటింగ్‌ యూనిట్‌: చంద్రుడిపై వెలుతురు భాగంలో వేడికి కొదవ లేదు. ఒకవేళ చీకటి భాగంలోకి వెళితే మాత్రం హీటింగ్‌ యూనిట్‌ అవసరం. లేకుంటే ఉత్తదే.  

14. మ్యాగ్నెటిక్‌ కంపాస్‌: చంద్రుడిపై అయ­స్కాంత క్షేత్రం సరిగా లేదు. అందువల్ల అక్కడ మ్యాగ్నెటిక్‌ కంపాస్‌కు పనిలేదు.  

15. అగ్గిపెట్టె: దీన్ని ఎంచుకోవడం అన్నింటికన్నా వృథా. ఎందుకంటే చంద్రుడిపై ఆక్సిజన్‌ ఉండదు కాబటి అగ్గిపుల్ల వెలగదు, మంట అంటుకోదు. మనం సరై్వవ్‌ కావడానికి ఏమాత్రం పనికిరాదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement