సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత్ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా రికార్డులు సృష్టించింది. ల్యాండర్ దిగిన మరికొన్ని గంటలకే దాని నుంచి రోవర్ కూడా బయటకొచ్చి తన పనిని మొదలుపెట్టేసింది. మొత్తం 14 రోజులపాటు రోవర్ చంద్రుడిపై అన్వేషణలు కొనసాగించనుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు రోజులు పూర్తయ్యాయి. మరో ఏడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజులు కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరువాత చంద్రుడిపై 14 రోజులపాటు చిమ్మ చీకట్లు ఆవరించడంతోపాటు భారీగా మంచు కురుస్తుందని పేర్కొంటున్నారు. దీంతో ల్యాండర్, రోవర్‌లు పనిచేస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తదుపరి 14 రోజులు తర్వాత ల్యాండర్, రోవర్లు ఉన్న చోట మళ్లీ సూర్యకిరణాలు పడతాయి. వీటికి సోలార్ ప్యానెల్స్ రీస్టార్ట్ అయితే ల్యాండర్, రోవర్లు తిరిగి పనిచేస్తాయి. లేదంటే వాటి కాలపరిమితి తీరిపోయినట్టేనని చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు తన ఏడు రోజుల ప్రయాణంలో రోవర్ సుమారు 250 మీటర్ల దూరం ప్రయాణం చేసినట్టు ఇస్రో వెల్లడించింది.
విజయవంతంగా లిబ్స్..
కాగా రోవర్‌లో అమర్చిన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (లిబ్స్) అనే పేలోడ్ విజయవంతంగా పనిచేయడం వల్ల చంద్రుడిలో దాగిన రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ ఉనికిని తొలిసారి కనుగొన్నారు. అలాగే అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ తో పాటు ఆక్సిజన్ కూడా ఉన్నట్లుగా తేలింది.
ప్రస్తుతం హైడ్రోజన్ కోసం మరింతగా రోవర్ పరిశోధనలు చేస్తోంది. అయితే లిబ్స్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై శక్తివంతమైన లేజర్‌ను షూట్ చేసినప్పుడు.. అందులో నుంచి వెలువడే కాంతి ఆధారంగా మూలకాలను గుర్తించి ఆ డేటాను ఇస్రో భూ నియంత్రిత కేంద్రానికి పంపుతోంది. ఈ సైంటిఫిక్ పేలోడ్‌ను బెంగళూరులోని లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టం (లియోస్) అభివృద్ధి చేసింది.
భారత్, చైనాకు చెందిన రెండు రోవర్లు
మరోవైపు 2019 జనవరి 3న చంద్రుడి దక్షిణ ధృవం ప్రాంతంలో ఐట్కిన్ బేసిన్‌లో చైనాకు చెందిన వాంగ్–4 మిషన్ యూటూ 2 రోవర్ సైతం పరిశోధనలు చేస్తోంది. భారత్, చైనా రోవర్ల మధ్య దూరం 1,948 కిలోమీటర్లు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఒకేసారి రెండు రోవర్లు పనిచేయడం ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు.
నీలి రంగు నిండు జాబిలి!
ఆకాశంలో నిండు జాబిలి నీలి రంగులో కనువిందు చేసింది. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో విజయవాడలో ఇలా అరుదైన బ్లూ మూన్ సాక్షాత్కరించింది. ఒకే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడిని బ్లూమూన్ అంటారు. ఆగస్టు ఒకటో తేదీన ఒకసారి, 30వ తేదీన రెండోసారి కనిపించింది. ఇలా ఒకే నెలలో రెండవసారి రోజూ కంటే పెద్దదిగా కనిపించడం విశేషం. ఈ సూపర్ బ్లూ మూన్ 2037 వరకు మళ్లీ కనిపించదని నిపుణులు చెబుతున్నారు.
– విశాల్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment