University of texas
-
ఆకాశంలో దెయ్యం
పెద్దగా నోరు తెరుచుకుని మీదికొస్తున్న దెయ్యంలా.. చూడగానే వామ్మో అనిపించేలా ఉందికదా! ఇది ఏ గ్రాఫిక్స్ బొమ్మనో, సరదాగా సృష్టించిన చిత్రమో కాదు.. సుదూర అంతరిక్షంలోని ఓ భారీ గెలాక్సీ (నక్షత్రాల గుంపు) ఇది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) సాయంతో టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ గెలాక్సీని గుర్తించారు. మన విశ్వం పుట్టుక తొలినాళ్లలోనే ఈ గెలాక్సీ ఏర్పడిందని.. అది భారీగా దుమ్ము, ఇతర ఖగోళ పదార్థాలతో నిండి ఉందని వారు తెలిపారు. విసిరివేసినట్టుగా ఉన్న ఆ ఖగోళ పదార్థాల నుంచి వేలాది కొత్త నక్షత్రాలు జన్మిస్తున్నాయని.. ఈ క్రమంలో దెయ్యం ముఖం వంటి ఆకృతి ఏర్పడిందని వివరించారు. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రాలు మసకగా ఉండటంతో.. ఓ చిత్రకారుడితో మరింత స్పష్టత వచ్చేలా మార్చామని వివరించారు. -
చందమామపై యాక్సిడెంట్.. మీరేం తీసుకెళ్తారు?
మన ఇస్రో మొన్న చందమామపైకి రోవర్‌ను పంపింది. నిన్న రష్యా కూడా పంపింది. ఇంకొన్నేళ్లు ఆగితే మనుషులూ వెళతారు. అక్కడక్కడా కాలనీలు కట్టుకుంటారు. అప్పుడప్పుడూ జనం భూమ్మీదికి, చంద్రుడిపైకి వచ్చిపోతూ ఉంటారు. ఇంతవరకు సరేగానీ.. ఒకవేళ మీరు చంద్రుడిపైకి వెళ్లిన అంతరిక్ష నౌకలో సమస్య వచ్చి, మనుషుల కాలనీకి దూరంగా పడిపోతే ఎలా? అంతరిక్ష నౌకలో దెబ్బతినగా మిగిలిన వస్తువులను ఎలా వాడుతారు? అన్న ఓ కొత్త సవాల్ తెరపైకి వచ్చింది. అదేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఆలోచనకు పరీక్ష.. మెదడుకు మేత.. అంతరిక్షంలో విహరించాలన్నది చాలా మంది కల. ఇప్పటికే చంద్రుడిపై అడుగుపెట్టాం. ఇటీవల మరిన్ని ప్రయోగాలు చేపట్టాం. భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీలనూ కట్టేసుకోనున్నాం. 2025లో మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు అమెరికా ఆర్టిమిస్ మిషన్‌ను కూడా చేపట్టింది. ఈ క్రమంలో చంద్రుడిపైకి రాకపోకలు మొదలై, ఏదైనా సమస్య వస్తే ఎలాగన్న ప్రశ్న ఓ వైపు.. అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి మేధోశక్తికి పరీక్ష పెట్టడం, కొత్త ఆలోచనలు కల్పించే లక్ష్యం మరోవైపు.. అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ ‘ది నాసా మూన్ సరై్వవల్ టెస్ట్’ను రూపొందించింది. ఏ వస్తువుకు.. ఎంత ప్రాధాన్యత అంటూ.. మీరు చంద్రుడిపైకి కొంత మందితో కలిసి వెళ్లిన స్పేస్‌షిప్.. మనుషులు ఉండే కాలనీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. కమ్యూనికేషన్ పరికరాలు పాడయ్యాయి. స్పేస్‌షిప్‌లో పాడైనవి పోగా మిగిలిన 15 వస్తువుల సాయంతో.. అక్కడి నుంచి నడుస్తూ కాలనీకి వెళ్లాలి. గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎగురుతూ, నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న సామగ్రి, పరికరాల లిస్టు ఇది.. వీటిలో దేనికి మొదటి ప్రాధాన్యత, తర్వాత దేనికి.. ఇలా అన్నింటికి నంబర్లు వేయాలి. ఉన్నవి ఇవీ.. ప్రాధాన్యతలు ఏవి? ♦ అగ్గిపెట్టె ♦ పోషకాలన్నీ దట్టించిన ప్రత్యేక ఆహారం ♦ 50 అడుగుల నైలాన్ తాడు ♦ పారాచూట్ సిల్క్ (వస్త్రం) ♦ పోర్టబుల్ హీటింగ్ యూనిట్ (వేడిని ఇచ్చే పరికరం) ♦ రెండు కాలిబర్ పిస్టళ్లు ♦ ఒక బాక్స్ నిండా పాల సీసాలు ♦ ఒక్కోటీ 45కిలోల బరువున్న రెండు ఆక్సిజన్ సిలిండర్లు ♦ అంతరిక్షంలో చుక్కల స్థానాన్ని బట్టి మన స్థానం తెలుసుకునే మ్యాప్ ♦ లైఫ్ రాఫ్ట్ (అత్యవసర సమయాల్లో ఒక్కసారిగా గాలి నిండి పడవలా మారే బెలూన్) ♦ దిక్కులను చూపించే మాగ్నెటిక్ కంపాస్ ♦ 20 లీటర్ల నీళ్ల క్యాన్ ♦ సిగ్నల్ ఫ్లేర్స్ (బాణాసంచా రాకెట్లా గాల్లోకి పంపి మన స్థానం తెలిపే పరికరం) ♦ వివిధ రకాల విటమిన్లు, అత్యవసర మందుల సిరంజీలు ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ♦ సోలార్ పవర్‌తో పనిచేస్తూ.. ఎఫ్ఎం రేడియో సిగ్నళ్లు పంపే, అందుకునే పరికరం (చందమామపై కాలనీకి దూరంగా చిక్కుకుపోయిన మీరు వీటిలో ఏయే పరికరాలకు ఎంత ప్రాధాన్యత క్రమం ఇస్తారో ఇవ్వండి. తర్వాత కింద నాసా నిపుణులు ఇచ్చిన ఫలితాలు చూడండి) ఇదీ ప్రాధాన్యత.. దేనికి? ఎందుకు? 1. ఆక్సిజన్ ట్యాంకులు: అంతరిక్షంలో మనం జీవించడానికి ఆక్సిజన్ అత్యంత కీలకం. ఆహారం లేకుండా కొన్నిరోజులు ఉండొచ్చు. స్పేస్‌సూట్ శరీరంలోని నీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఇంకొన్ని రోజులు బతకొచ్చు. కానీ ఆక్సిజన్ లేకుంటే నిమిషం కూడా బతకలేం. అందుకే దీనికి ఫస్ట్ ప్రయారిటీ. చంద్రుడిపై గ్రావిటీ తక్కువ కాబట్టి ఆక్సిజన్ ట్యాంకుల బరువు కూడా పెద్ద విషయమేం కాదు. భూమ్మీదితో పోలిస్తే.. ఒక్కో ట్యాంకు ఏడెనిమిది కిలోలే ఉంటుందట. 2. మంచి నీళ్లు: ఆక్సిజన్ తర్వాత అత్యంత ముఖ్యమైనవి మంచి నీళ్లే. తగిన స్థాయిలో నీళ్లు ఉంటే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చు. కాలనీకి చేరుకోవచ్చు. 3. అంతరిక్ష మ్యాప్: చంద్రుడిపై కూడా దాదాపు భూమి నుంచి చూసినట్టే.. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు కనిపిస్తాయి. అందువల్ల ముందే కాలనీలు మార్క్ చేసి ఉన్న మ్యాప్ ఉంటే.. ఆ వైపుగా ప్రయాణం చేయవచ్చు. 4. ప్రత్యేక ఆహారం: చిక్కుకున్న చోటి నుంచి కాలనీకి వెళ్లాలన్నా, రెస్క్యూ బృందం వచ్చేదాకా బతకాలన్నా ఆహారం కావాల్సిందే. 5. ఎఫ్ఎం పరికరం: ఎఫ్ఎం ట్రాన్స్మిటర్/రిసీవర్ పరికరాలు కొన్ని కిలోమీటర్ల వరకే సిగ్నళ్లను పంపడం, అందుకోవడం చేయగలుగుతాయి. అయినా అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూకు, సమీపంలోని ఇతర బృందాలకు సమాచారం ఇవ్వడానికి పనికివస్తాయి. 6. నైలాన్ తాడు: చంద్రుడిపై నైలాన్ తాడు ఎందుకు అనిపించొచ్చు. అక్కడ గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు తాడుతో పట్టుకుని ఉండొచ్చు. చిన్నపాటి కొండల్లాంటివి ఉంటే ఎక్కడానికి వినియోగించుకోవచ్చు. మన సామగ్రిని ఒక్కదగ్గర కట్టి ఉంచుకోవచ్చు. 7. ఫస్ట్ ఎయిడ్ కిట్: స్పేస్ షిప్ కూలిపోయినప్పుడు గాయపడినా, ప్రయాణంలో సమస్య తలెత్తినా, ఏదైనా అకస్మాత్తు అనారోగ్యానికి గురైనా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో లాభం ఉంటుంది. అందులోని విటమిన్ ఇంజెక్షన్లు.. మన శరీరం సంతులనంగా ఉండటానికి తోడ్పడుతాయి. 8. పారాచూట్ వస్త్రం: చంద్రుడిపై వాతావరణం ఉండదు. కాబట్టి సూర్యుడి అతినీలలోహిత (యూవీ) కిరణాలు నేరుగా పడతాయి. దీనితో స్పేస్ సూట్, సామగ్రితోపాటు మన కళ్లకూ నష్టం. అలా జరగకుండా పారాచూట్ వస్త్రం కప్పుకోవచ్చు. 9. లైఫ్ రాఫ్ట్: అత్యవసర పరిస్థితుల్లో వాడే లైఫ్రాఫ్ట్లో వేగంగా వాయువు నిండటానికి కార్బన్ డయాక్సైడ్ను బాగా ఒత్తిడితో నింపిన బాటిళ్లు ఉంటాయి. చంద్రుడిపై గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి.. బాటిళ్లను స్పేస్సూట్కు కట్టుకుని, కార్బన్ డయాక్సైడ్ను మెల్లగా వదులుతూ ఉంటే.. రాకెట్లా ముందుకెళ్లిపోవచ్చు. 10. సిగ్నల్ ఫ్లేర్స్: కాలనీలకు దూరంగా ఎక్కడో స్పేస్‌షిప్ కూలిపోతే.. సిగ్నల్ ఫ్లేర్స్‌తో ప్రయోజనం లేనట్టే. అయితే రెస్క్యూ బృందాలు వచ్చినప్పుడు మాత్రం వాటితో మనమున్న స్థానాన్ని గుర్తించేలా చేయవచ్చు. 11. కాలిబర్ పిస్టళ్లు: చందమామపై పిస్టళ్లు దేనికి అనే అనుమానం రావొచ్చు. అయితే లైఫ్ రాఫ్ట్లలోని కార్బన్ డయాక్సైడ్ క్యాన్ల తరహాలో.. మనం వేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు రాకెట్లలాగా పిస్టల్ కాల్పులు ఉపయోగపడతాయట. 12. పాల క్యాన్లు: పోషకాలతో కూడిన ప్రత్యేక ఆహారం ఎలాగూ ఉంది. ఇంకా ఈ పాలక్యాన్లు అదనపు బరువు. ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తే మాత్రం వీటితో ప్రయోజనం 13. హీటింగ్ యూనిట్: చంద్రుడిపై వెలుతురు భాగంలో వేడికి కొదవ లేదు. ఒకవేళ చీకటి భాగంలోకి వెళితే మాత్రం హీటింగ్ యూనిట్ అవసరం. లేకుంటే ఉత్తదే. 14. మ్యాగ్నెటిక్ కంపాస్: చంద్రుడిపై అయస్కాంత క్షేత్రం సరిగా లేదు. అందువల్ల అక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్‌కు పనిలేదు. 15. అగ్గిపెట్టె: దీన్ని ఎంచుకోవడం అన్నింటికన్నా వృథా. ఎందుకంటే చంద్రుడిపై ఆక్సిజన్ ఉండదు కాబటి అగ్గిపుల్ల వెలగదు, మంట అంటుకోదు. మనం సరై్వవ్ కావడానికి ఏమాత్రం పనికిరాదు. -
ఈ–స్కూటర్‌తో డేటా హ్యాక్!
హూస్టన్: ఎలక్ట్రానిక్–స్కూటర్లను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ నిపుణులు తాజా పరిశోధన ద్వారా వెల్లడించారు. ఇందులో భారతీయ నిపుణులు పాల్గొన్నారు. వాహనదారుల గోప్యతకు సంబంధించిన వివరాలను ఈ–స్కూటర్ల ద్వారా హ్యాక్ చేయొచ్చని వీరు చెబుతున్నారు. ఈ–స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసినపుడు.. రెండింటి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీంతో ఆ వాహనం ప్రయాణించే ప్రాంతం, ఎంత దూరం తిరిగింది వంటి వివరాలు ఫోను, వాహనాల్లో నిక్షిప్తం అవుతాయి. ఇదే హ్యాకర్లకు అవకాశం కల్పిస్తోందని వారు తెలిపారు. ఈ వివరాల ద్వారా వాహనదారులు తరచుగా తిరిగే మార్గాలను, వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఉండే లొకేషన్ వంటి వివరాలను హ్యాకర్లు తెలుసుకుంటారని చెప్పారు. సైబర్ సెక్యూరిటీని పటిష్టంగా ఉండేలా మోటారు వాహనాల కంపెనీలు తమ వాహనాలను తయారు చేయాలని వారు సూచించారు. -
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతులను కోయలమూడి అజయ్‌కుమార్ (23), వోలేటి తేజ కౌశిక్ (22)గా గుర్తించినట్లు మీడియా కథనం పేర్కొంది. అర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న అజయ్, తేజ యూఎస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఓక్లహోమాకు వెళ్లారు. మంగళవారం అక్కడి టర్నర్‌ఫాల్స్ అనే జలపాతంలో వారిలో ఓ వ్యక్తి ఈతకు వెళ్లి మునిగిపోగా, అతడ్ని రక్షించడానికి దూకిన మరో వ్యక్తి కూడా నీళ్లలో మునిగిపోయాడు. -
విద్యార్ధుల విషాదాంతం : ఎన్ఆర్ఐల దాతృత్వం
సాక్షి, అమరావతి/ సింధనూరు టౌన్: అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో పీజీ చేస్తున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు కౌశిక్ ఓలేటి, కొయ్యలముడి అజయ్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి టర్నర్‌ఫాల్స్‌ను చూసేందుకు వెళ్లిన సమయంలో కౌశిక్ ఓలేటి నీటిలోకి జారిపడ్డాడు. అతన్ని రక్షించేందుకు అజయ్‌కుమార్ విఫలయత్నం చేసి.. అతనితో పాటు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసింది. ప్రమాద సమయంలో వారు లైఫ్ జాకెట్లను ధరించలేదని అధికారులు తెలిపారు. కాగా అమెరికాలో దుర్మరణానికి గురైన వీరి అంత్యక్రియలు చేపట్టేందుకు, మృతదేహాలను స్వస్థలానికి తరలించడం, వారి విద్యా రుణాలను తీర్చడం వంటి అవసరాలకు పెద్దమనసుతో ముందుకురావాలని వారి స్నేహితులు దాతలను కోరారు. తమకు తోచిన సాయం చేయాలని వారి సన్నిహితులు గోఫండ్‌మి వంటి ఫండింగ్ సైట్లలో నెటిజన్లను కోరారు. ఈ విషాద సమయంలో అందరూ స్పందించి మానవత్వం చాటాలని వారు పిలుపు ఇచ్చారు.మరోవైపు బాధిత విద్యార్ధుల కుటుంబానికి బాసటగా నిలుస్తామంటూ పలువురు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. -
డల్లాస్‌లో జరిగిన ప్రమాదంలో భారత విద్యార్థి మృతి
డల్లాస్: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఓ భారత విద్యార్థి అక్కడ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల లింటో ఫిలిప్ నాలుగు నెలల కిందట మాస్టర్స్ కోసం డల్లాస్ వెళ్లాడు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు సుసాన్ ఫిలిప్, పీఎం ఫిలిప్ దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో మాస్టర్స్ చేస్తున్న లింటో శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి సాహసోపేతమైన కయాకింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. కయాకింగ్ అనేది నీటిలో ఒక చిన్న పడవపై చేసే ప్రయాణం. లేక్ రే హుబ్బార్డ్‌లో లింటో కయాకింగ్ చేస్తుండగా.. జలల ప్రవాహం అధికంగా ఉండటంతో అతని కయాక్ తిరగబడిందని డల్లాస్ పోలీసులు తెలిపారు. దీంతో లింటో నీళ్లలో కొట్టుకుపోయాడని వెల్లడించారు. గల్లంతయిన అతడి మృతదేహాన్ని గుర్తించిన రెస్యూ సిబ్బంది పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. -
షుగర్.. నో ఫికర్
మధుమేహంతో చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. అలాంటి వారికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త చెబుతున్నారు. ఓ ప్రత్యేక విధానం ద్వారా ఇన్సు లిన్‌ను ఉత్పత్తి చేసే క్లోమకణాల సంఖ్యను గణ నీయంగా పెంచగలిగామని, తద్వారా శరీరంలో ఈ వ్యాధి అన్నదే లేకుండా చేయగలిగా మంటున్నారు. ప్రస్తుతానికి ఇది టైప్–1 మధు మేహులకు పూర్తి స్థాయిలో వ్యాధిని నయం చేస్తుందని, టైప్–2 వారికి ఇన్సులిన్‌ను తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు బ్రూనో డోరియన్, రాల్ఫ్ డిఫ్రోన్జోలు తెలిపారు. ఈ పద్ధతిని ఎలుకలపై ప్రయోగించి విజయవంతమయ్యాయని, ఏడాది పాటు ఈ వ్యాధి రాకుండా అడ్డుకోగలిగామన్నారు. క్లోమ గ్రంథిలో బీటా కణాలతో పాటు ఇతర కణాలు కూడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా మార్చామని చెప్పారు. దీంతో రక్తంలోని గ్లూకోజ్ మోతాదును నియంత్రించగలిగామని వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు ఒక వైరస్‌ను వాహకంగా వాడుకుని క్లోమ కణాలకు కొన్ని జన్యువులను అందజేశారు. దీంతో బీటా కణాలు కానివి కూడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయని డిఫ్రోన్జో పేర్కొన్నారు. -
కేన్సర్ కణాలకు కాంతి, ఆమ్లాలతో చెక్..
కేన్సర్‌కు మరింత సురక్షితమైన, మెరుగైన చికిత్స అందించేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. కేన్సర్ కణితుల్లోకి కొన్ని ఆమ్లాలను పంపి.. పై నుంచి అతినీలలోహిత కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా సాధారణ కణాలకు నష్టం జరక్కుండానే కేన్సర్ కణితిని నాశనం చేయవచ్చని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కాంతి ద్వారా కేన్సర్ కణాలను చంపేందుకు ఫొటోడైనమిక్ థెరపీ పేరుతో ఒక పద్ధతి అందుబాటులో ఉంది. దీనికి ఆమ్లాన్ని జోడించడం కొత్త పద్ధతి తాలూకు విశేషం. సాధారణంగా కేన్సర్ కణితి పరిసరాల్లో ఆమ్లయుత వాతావరణం ఉంటుంది. ఈ యాసిడ్లను తీసివేసేందుకు కణితి చుట్టూ కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. కానీ ఆ రక్తకణాలను తమకు పోషకాలు అందించేవిగా మార్చేసుకుంటాయి కేన్సర్ కణాలు. ప్రొఫెసర్ మాథ్యూ గోడ్విన్.. రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగా కేన్సర్ కణితి లోపలి భాగంలోకి ‘నైట్రోబెంజాల్డీహైడ్’ ఆమ్లాన్ని ఎక్కించారు. తర్వాత కణితిపైకి అతినీలలోహిత కిరణాలను ప్రసారం చేశారు. దీంతో అక్కడి ఆమ్ల గాఢత విపరీతంగా పెరిగిపోయి 2 గంటల్లోనే 95 శాతం కణాలు నాశనమయ్యాయి. మందులకు లొంగని కేన్సర్ కణాలతో తన పద్ధతికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో గోడ్విన్ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. -
ఆ వర్సిటీలోకి తుపాకులు తేవచ్చు!
చికాగో: తరగతి గదికి వెళ్లే విద్యార్థులు పెన్నులు, పుస్తకాలు, ట్రెండు మారింది కాబట్టి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం సర్వసాధారణం. కానీ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులు మాత్రం ఇక నుంచి తుపాకులు కూడా తరగతి గదిలోకి తీసుకెళ్లొచ్చు. ఈ మేరకు అక్కడి రాష్ట్ర చట్ట సభ సభ్యులు బిల్‌ను ఆమోదించారు. -
తెలుగువారు చాలా నయం...
సాహిత్యం మీద, జాతీయ బహుళ సంస్కృతి మీద మతతత్వం కన్ను పడుతున్న కాలం ఇది. లేకపోతే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేని తమిళ నవల- మధోరుబాగన్- మీద ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. దీని రచయిత పెరుమాళ్ మురుగన్ అనే సంగతి చదువరులకు తెలిసిందే. మధోరుబాగన్ (తమిళనాడు తిరుచెంగోడ్ ఆలయంలోని అర్ధనారీశ్వరుడికి తమిళ పేరు) నవల గత అయిదేళ్లుగా తమిళనాట కలచువాడు ప్రచురణ సంస్థ ద్వారా ఆ భాష పాఠకులకు అందుబాటులో ఉంది. కానీ వివాదం జరగలేదు. 2013లో ఇది ‘ఒన్ పార్ట్ ఉమెన్’ పేరుతో ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థి అనిరుద్ధన్ వాసుదేవన్ ఆంగ్లానువాదం చేయగా పెంగ్విన్ ద్వారా అందుబాటులోకి వచ్చి వివాదానికి తెర తీసింది. ఈ వివాదంలో ఈ అనువాదానికి కెనడాలో కెనడా లిటరరీ గార్డెన్ అవార్డు వచ్చిందన్న సంగతి కూడా కొట్టుకుపోయింది. ఇంతకూ ఇందులో ఏముంది? కాముని పున్నమి వంటి ఒక దేవాలయ ఆచారం ఉంది. పన్నెండేళ్లుగా పిల్లలు లేని ‘పొన్న’ అనే ఒక రైతుభార్య భర్త అంగీకారం వుందని తలుస్తూ ఒక తిరుణాలనాటి రాత్రి అటువంటి కాముని పండుగలో అపరిచితుడి ద్వారా బిడ్డను పొందేందుకు ఇంటి నుంచి బయలుదేరడం ఈ నవలలో ముగింపు సన్నివేశం. తమిళనాడులోని కొంగునాడు ప్రాంతంలో ఉన్నట్టుగా చెబుతున్న ఈ ఆచారం ఇప్పటిది కాదు. స్వతంత్రానికి పూర్వం దాదాపు ఎనిమిది దశాబ్దాల ముందరిది. నవలలో కథాకాలం కూడా అదే. అయితే ఈ అంశం మాత్రమే ఈ నవల కాదు. రచయిత స్వయంగా కొంగునాడు ప్రాంతవాసి కావడాన ఆ ప్రాంత శ్రమజీవుల మాండలిక సామెతలూ నుడికారం కూడా సవిస్తరంగా కనిపిస్తాయి. మురుగన్ రాసిన ముందరి నవలల్లో కూలమధారి (తాడి ఋతువులు - The seasons of the Palm) అనే నవల కూడా ఆంగ్లంలో అందుబాటులో వుంది. ఇదో మేకలు కాసుకునే దళిత కుటుంబాల కథ. ఈ నవల కూడా తమిళ సంస్కృతిని లోతుగా చూపేదే. ఇలాంటి సంస్కృతినీ, తేట తమిళ భాషనూ చూపుతాడనే పెరుమాళ్ మురుగన్‌ను తమిళ పాఠకులు గౌరవిస్తారు. ఏమైనా ఇంత పెద్ద గొడవ ఏమాత్రం అవసరం లేని ఈ నవలపై- పైగా గత అయిదేళ్ళుగా అందుబాటులో వున్న నవలపై హటాత్తుగా ఆంక్షలూ అభ్యంతరాలూ పుస్తక దహనాలూ చోటు చేసుకోవడం ఒక పథకం ప్రకారం జరిగిన చర్యగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఇందులో రచయితకు నష్టం చేయడం కన్నా వేరెవరో లబ్ధి పొందే అంశమే ఉందన్న సంగతీ సత్యదూరం కాదు. వేధింపులూ భయపెట్టడాలూ పెరిగి పోయాక పెరుమాళ్ మురుగన్ తుదకు విసిగిపోయి రచయితగా తాను మరణించాను అనే ప్రకటన ఇస్తూ ఇక నన్ను ఏ సాహిత్య సభలకూ పిలవకండి అని అర్థించారు. ఇది ఏ రచయితకూ పట్టవలసిన గతి కాదు. ఒక రచన తమకు నచ్చక పోతే తాము ఏమైనా చేయవచ్చు అని కొన్ని వర్గాలు అనుకుంటే దానిని అడ్డుకోవలసిన పాలనా వ్యవస్థ ఆ భావనకు మద్దతుగా పని చేయడం అన్యాయం. రాజ్యాంగం కల్పించిన అభివ్యక్తి స్వేచ్ఛకు భంగకరంగా వ్యవహరిస్తే అది నిజంగా ప్రతిఘటించవలసిన విషయం. ఐతే ఆ నవలలోని అంశం తమిళులకు కొత్త ఏమో కానీ వివాహిత స్త్రీలు పిల్లలను పొందే విషయంలో, భర్త అసమర్థత కారణమైతే ఏం చేస్తూ వచ్చారో, భారతం కాలం నుంచి ఈ సమాజంలో అందరూ ఎరిగినదే. దేవుళ్ళ మహిమలూ, బ్రాహ్మణుల గొప్పతనాలూ వీటిని నిరసిస్తూ 1925లో పెరియార్ ద్రావిడ చైతన్య ఉద్యమాలు (అవి అప్పట్లోనే రాజకీయంగా జస్టిస్ పార్టీ వారిని కలుపుకుని కాంగ్రెస్ వ్యతిరేక కూటమిగా ఎదిగినప్పటికీ) మొదలు పెట్టడానికి ముందే తెలుగు సమాజంలో ఈ లౌకికభావన బలంగా ఉన్నది. ఉదార భావాల ఆదరణలో తెలుగు సమాజం ఎప్పుడూ తమిళ సమాజం కన్నా ముందరే ఉన్నది. వితంతు పునర్వివాహ ఆచరణలో వీరేశలింగం యావత్ దక్షిణ భారతదేశానికే తొలి అడుగు వేసిన క్రాంతదర్శి. ఆయన జరిపిస్తేనే అప్పటి మన రాజధాని అయిన మద్రాసులో కూడా తదుపరి ఈ వివాహాలు జరిగాయి. ఇక సాహిత్యంలో గురజాడ 1910లోనే ‘ఆ దేవుళ్ళందరూ ఒక్కటే అయితే ఆ పీనుగలందరినీ ఒక్క చోటే తగలేసి ఆ పూజలేవో జరిపించరాదా?’ అంటాడు. ఈ కథలు బహుశా తమిళులు ఎరగరు. తాపీ ధర్మారావుగారి దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు కూడా వారు చదువుకుని ఉండరు. ఇందులో కొంగునాడు దేవాలయంలో ఒకప్పుడు జరిగేవంటున్న కాముని పున్నములు, రవికల పండుగల గురించి ఒకనాటి తెలుగు సాహితీ సమాజం విపుల ప్రస్తావనలు చేసింది. ఇవేవీ తమిళ సమాజం ఎరిగినట్టు లేదు. రాముడికి సీత ఏమవుతుంది?, రామాయణ విషవృక్షం వంటి రచనలన్నీ కొత్త ఆలోచనల వేదికలే. వీటిని తెలుగువారు చదివి వాడిగా వేడిగా చర్చించారే తప్ప ఆ రచనలపై రచయితలపై ఆంక్షలు కోరి, దాడులకు దిగలేదు. మధోరుబాగన్లో భార్య పొన్న తన సంతానం కోసం ఆలయ తిరునాళ్ళలో అపరిచిత సంగమం కోసం వెళ్లింది అన్నదే అంత సహించలేని విషయంగా నేటి నైతిక ఉద్యమకారులకు ఎందుకు మారింది అన్నది ఒక అజ్ఞాన జనితావేశంగానే కనిపిస్తుంది తప్ప ప్రపంచ సాహిత్యంలో ఇటువంటి విషయాలు ఎప్పుడో చెప్పారు అన్నది వారికి తెలిసి రావడం కష్టం. ఈ సంవత్సరపు శత జయంతి కథకుడు చాసో ‘ఏలూరెళ్లాలి’ కథలో ఒక వివాహిత స్త్రీ ఎలా ఒక పద్దెనిమిదేళ్ల కుర్రవాడితో సంబంధం ద్వారా బిడ్డను పొంది, తన ఆస్తికి చెందిన సంక్రమణ హక్కును కాపాడుకున్నదో రాస్తే ఆ కథలోని పరిస్థితులను పాత్ర నిస్సహాయతను తెలుగు సమాజం సానుభూతితో అర్థం చేసుకుంది. కథను ఆదరించింది. అలాగే చాసో రాసిన ‘లేడీ కరుణాకరం’ కథలో భర్తకు తెలిసేట్టుగానే మరొకరితో సంబంధం పెట్టుకునే కరుణాకరం భార్యను చూసి సమాజ పోకడలను బేరీజు వేసుకునే ప్రయత్నం చేసింది. అలాగే అస్సామ్ సాహిత్యంలో ఇందిరా గోస్వామి బ్రాహ్మణ వితంతువుల గురించి రాసిన కథలు తమిళులకు తెలియవా? చెడ్డ ఆలోచనలకు తగిన ఆయుధం మంచి ఆలోచనలే. వివేకం, విజ్ఞానం కలగడానికి ఖచ్చితమైన దారి ఉదార భావనల విద్య మాత్రమే. పెరుమాళ్ మురుగన్‌ను పోగొట్టుకునే ఒక దురదృష్టకర మానవ సమాజం ఒక సొంత గొంతు పలుకుతున్న మానవస్వరాన్ని పోగొట్టుకున్నట్టే. ఇందుకే ఏ రంగు గల సాహిత్య అణచివేతనైనా ఆధునిక సమాజ పౌరులుగా అందరూ వ్యతిరేకించాల్సి ఉంది. అదే ఇవాళ్టి అత్యవసర పరిస్థితి. - రామతీర్థ 98492 00385 -
సూర్యుడికి సోదరుడు దొరికాడు!
మన ప్రచండ భానుడికి తోబుట్టువు దొరికాడు! అవును.. సూర్యుడు పుట్టిన వాయు, ధూళి మేఘం నుంచే ఆవిర్భవించిన ఓ నక్షత్రాన్ని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనకు 110 కాంతి సంవత్సరాల దూరంలో హెర్క్యూలెస్ నక్షత్రమండలంలో ఈ కొత్త నక్షత్రం ఉందట. రాత్రిపూట ఉత్తర దిక్కున ఆకాశంలో అతిప్రకాశంతో కనిపించే వెగా నక్షత్రానికి పక్కలో భానుడి సోదరుడిని సాధారణ బైనాక్యులర్స్‌తో కూడా చూడవచ్చట. సూర్యుడికి దగ్గరి పోలికలతో ఉండే 30 నక్షత్రాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఎట్టకేలకు సూర్యుడు, ఈ నక్షత్రం ఒకే మేఘంలోని వాయువు, ధూళిని పంచుకుని పుట్టాయని తేల్చారు. ‘హెచ్డీ 162826’ అని పేరు పెట్టిన ఈ నక్షత్రం మన సూర్యుడి కన్నా 15 రెట్లు పెద్దగా ఉందట. భానుడికి తోబుట్టువును కనుగొనడం ఇదే తొలిసారి కాగా.. మరిన్ని తోబుట్టువులను గుర్తించేందుకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. భానుడి తోబుట్టువులపై అధ్యయనం ద్వారా పాలపుంతలో సూర్యుడు ఎక్కడ, ఎలా ఏర్పడ్డాడు? ఎలా పరిణామం చెందాడు? జీవం పుట్టుక ఎలా సాధ్యం అయింది? అన్న అనేక విషయాలు మరింత బాగా అర్థం చేసుకోవచ్చని పరిశోధన బృందం సారథి ఇవాన్ రమిరెజ్ చెబుతున్నారు. అన్నట్టూ.. భానుడి సోదరుడి చుట్టూ కూడా మన భూమి లాంటి గ్రహాలు తిరుగుతుండవచ్చని, వాటిపై జీవం కూడా ఉండే అవకాశముందని అంటున్నారు. -
వన్-వే సౌండ్ మెషిన్..!
వాషింగ్టన్: ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణించేలా చేసే వినూత్న సౌండ్ మెషిన్ ఇది. పేరు ‘అకౌస్టిక్ సర్క్యులేటర్’. సాధారణంగా ధ్వని, ఇతర తరంగాలు ముందుకు, అదే మార్గంలో వెనకకు రెండు దిశల్లో కూడా ప్రయాణిస్తుంటాయి. అయితే ఈ మెషిన్ ధ్వని తరంగాలను ప్రత్యేక ఫ్యాన్ సాయంతో తిప్పుతూ విడుదల చేస్తుంది. దీంతో దీని ద్వారా వెలువడే ధ్వని తరంగాలు తిరిగి వెనక్కి రాలేవు. ఉదాహరణకు.. ఓ గొట్టం ద్వారా ఈ ధ్వని తరంగాలను పంపించామనుకోండి.. ఆ గొట్టం చివర ఉన్న వ్యక్తి మాత్రమే ఈ తరంగాలను వింటాడు. అక్కడి నుంచి ఇవతలికి ఎలాంటి శబ్దమూ తిరిగి రాదు. అలాగే ఈ శబ్దాన్ని అతడి నుంచి మరో దిశగా కూడా పంపించవచ్చు కానీ.. అతడికి కూడా తిరిగి ఆ దిశలో ఎలాంటి శబ్దాలూ వినపడవన్నమాట. అధునాతన గూఢచర్య పరికరాల తయారీకి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని దీనిని తయారు చేసిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.