తెలుగువారు చాలా నయం...
సాహిత్యం మీద, జాతీయ బహుళ సంస్కృతి మీద మతతత్వం కన్ను పడుతున్న కాలం ఇది. లేకపోతే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేని తమిళ నవల- మధోరుబాగన్- మీద ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. దీని రచయిత పెరుమాళ్ మురుగన్ అనే సంగతి చదువరులకు తెలిసిందే. మధోరుబాగన్ (తమిళనాడు తిరుచెంగోడ్ ఆలయంలోని అర్ధనారీశ్వరుడికి తమిళ పేరు) నవల గత అయిదేళ్లుగా తమిళనాట కలచువాడు ప్రచురణ సంస్థ ద్వారా ఆ భాష పాఠకులకు అందుబాటులో ఉంది. కానీ వివాదం జరగలేదు. 2013లో ఇది ‘ఒన్ పార్ట్ ఉమెన్’ పేరుతో ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థి అనిరుద్ధన్ వాసుదేవన్ ఆంగ్లానువాదం చేయగా పెంగ్విన్ ద్వారా అందుబాటులోకి వచ్చి వివాదానికి తెర తీసింది. ఈ వివాదంలో ఈ అనువాదానికి కెనడాలో కెనడా లిటరరీ గార్డెన్ అవార్డు వచ్చిందన్న సంగతి కూడా కొట్టుకుపోయింది.
ఇంతకూ ఇందులో ఏముంది? కాముని పున్నమి వంటి ఒక దేవాలయ ఆచారం ఉంది. పన్నెండేళ్లుగా పిల్లలు లేని ‘పొన్న’ అనే ఒక రైతుభార్య భర్త అంగీకారం వుందని తలుస్తూ ఒక తిరుణాలనాటి రాత్రి అటువంటి కాముని పండుగలో అపరిచితుడి ద్వారా బిడ్డను పొందేందుకు ఇంటి నుంచి బయలుదేరడం ఈ నవలలో ముగింపు సన్నివేశం. తమిళనాడులోని కొంగునాడు ప్రాంతంలో ఉన్నట్టుగా చెబుతున్న ఈ ఆచారం ఇప్పటిది కాదు. స్వతంత్రానికి పూర్వం దాదాపు ఎనిమిది దశాబ్దాల ముందరిది. నవలలో కథాకాలం కూడా అదే. అయితే ఈ అంశం మాత్రమే ఈ నవల కాదు.
రచయిత స్వయంగా కొంగునాడు ప్రాంతవాసి కావడాన ఆ ప్రాంత శ్రమజీవుల మాండలిక సామెతలూ నుడికారం కూడా సవిస్తరంగా కనిపిస్తాయి. మురుగన్ రాసిన ముందరి నవలల్లో కూలమధారి (తాడి ఋతువులు - The seasons of the Palm) అనే నవల కూడా ఆంగ్లంలో అందుబాటులో వుంది. ఇదో మేకలు కాసుకునే దళిత కుటుంబాల కథ. ఈ నవల కూడా తమిళ సంస్కృతిని లోతుగా చూపేదే. ఇలాంటి సంస్కృతినీ, తేట తమిళ భాషనూ చూపుతాడనే పెరుమాళ్ మురుగన్‌ను తమిళ పాఠకులు గౌరవిస్తారు.
ఏమైనా ఇంత పెద్ద గొడవ ఏమాత్రం అవసరం లేని ఈ నవలపై- పైగా గత అయిదేళ్ళుగా అందుబాటులో వున్న నవలపై హటాత్తుగా ఆంక్షలూ అభ్యంతరాలూ పుస్తక దహనాలూ చోటు చేసుకోవడం ఒక పథకం ప్రకారం జరిగిన చర్యగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఇందులో రచయితకు నష్టం చేయడం కన్నా వేరెవరో లబ్ధి పొందే అంశమే ఉందన్న సంగతీ సత్యదూరం కాదు. వేధింపులూ భయపెట్టడాలూ పెరిగి పోయాక పెరుమాళ్ మురుగన్ తుదకు విసిగిపోయి రచయితగా తాను మరణించాను అనే ప్రకటన ఇస్తూ ఇక నన్ను ఏ సాహిత్య సభలకూ పిలవకండి అని అర్థించారు. ఇది ఏ రచయితకూ పట్టవలసిన గతి కాదు. ఒక రచన తమకు నచ్చక పోతే తాము ఏమైనా చేయవచ్చు అని కొన్ని వర్గాలు అనుకుంటే దానిని అడ్డుకోవలసిన పాలనా వ్యవస్థ ఆ భావనకు మద్దతుగా పని చేయడం అన్యాయం. రాజ్యాంగం కల్పించిన అభివ్యక్తి స్వేచ్ఛకు భంగకరంగా వ్యవహరిస్తే అది నిజంగా ప్రతిఘటించవలసిన విషయం.
ఐతే ఆ నవలలోని అంశం తమిళులకు కొత్త ఏమో కానీ వివాహిత స్త్రీలు పిల్లలను పొందే విషయంలో, భర్త అసమర్థత కారణమైతే ఏం చేస్తూ వచ్చారో, భారతం కాలం నుంచి ఈ సమాజంలో అందరూ ఎరిగినదే. దేవుళ్ళ మహిమలూ, బ్రాహ్మణుల గొప్పతనాలూ వీటిని నిరసిస్తూ 1925లో పెరియార్ ద్రావిడ చైతన్య ఉద్యమాలు (అవి అప్పట్లోనే రాజకీయంగా జస్టిస్ పార్టీ వారిని కలుపుకుని కాంగ్రెస్ వ్యతిరేక కూటమిగా ఎదిగినప్పటికీ) మొదలు పెట్టడానికి ముందే తెలుగు సమాజంలో ఈ లౌకికభావన బలంగా ఉన్నది. ఉదార భావాల ఆదరణలో తెలుగు సమాజం ఎప్పుడూ తమిళ సమాజం కన్నా ముందరే ఉన్నది. వితంతు పునర్వివాహ ఆచరణలో వీరేశలింగం యావత్ దక్షిణ భారతదేశానికే తొలి అడుగు వేసిన క్రాంతదర్శి. ఆయన జరిపిస్తేనే అప్పటి మన రాజధాని అయిన మద్రాసులో కూడా తదుపరి ఈ వివాహాలు జరిగాయి.
ఇక సాహిత్యంలో గురజాడ 1910లోనే ‘ఆ దేవుళ్ళందరూ ఒక్కటే అయితే ఆ పీనుగలందరినీ ఒక్క చోటే తగలేసి ఆ పూజలేవో జరిపించరాదా?’ అంటాడు. ఈ కథలు బహుశా తమిళులు ఎరగరు. తాపీ ధర్మారావుగారి దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు కూడా వారు చదువుకుని ఉండరు. ఇందులో కొంగునాడు దేవాలయంలో ఒకప్పుడు జరిగేవంటున్న కాముని పున్నములు, రవికల పండుగల గురించి ఒకనాటి తెలుగు సాహితీ సమాజం విపుల ప్రస్తావనలు చేసింది. ఇవేవీ తమిళ సమాజం ఎరిగినట్టు లేదు. రాముడికి సీత ఏమవుతుంది?, రామాయణ విషవృక్షం వంటి రచనలన్నీ కొత్త ఆలోచనల వేదికలే. వీటిని తెలుగువారు చదివి వాడిగా వేడిగా చర్చించారే తప్ప ఆ రచనలపై రచయితలపై ఆంక్షలు కోరి, దాడులకు దిగలేదు. మధోరుబాగన్‌లో భార్య పొన్న తన సంతానం కోసం ఆలయ తిరునాళ్ళలో అపరిచిత సంగమం కోసం వెళ్లింది అన్నదే అంత సహించలేని విషయంగా నేటి నైతిక ఉద్యమకారులకు ఎందుకు మారింది అన్నది ఒక అజ్ఞాన జనితావేశంగానే కనిపిస్తుంది తప్ప ప్రపంచ సాహిత్యంలో ఇటువంటి విషయాలు ఎప్పుడో చెప్పారు అన్నది వారికి తెలిసి రావడం కష్టం.
ఈ సంవత్సరపు శత జయంతి కథకుడు చాసో ‘ఏలూరెళ్లాలి’ కథలో ఒక వివాహిత స్త్రీ ఎలా ఒక పద్దెనిమిదేళ్ల కుర్రవాడితో సంబంధం ద్వారా బిడ్డను పొంది, తన ఆస్తికి చెందిన సంక్రమణ హక్కును కాపాడుకున్నదో రాస్తే ఆ కథలోని పరిస్థితులను పాత్ర నిస్సహాయతను తెలుగు సమాజం సానుభూతితో అర్థం చేసుకుంది. కథను ఆదరించింది. అలాగే చాసో రాసిన ‘లేడీ కరుణాకరం’ కథలో భర్తకు తెలిసేట్టుగానే మరొకరితో సంబంధం పెట్టుకునే కరుణాకరం భార్యను చూసి సమాజ పోకడలను బేరీజు వేసుకునే ప్రయత్నం చేసింది. అలాగే అస్సామ్ సాహిత్యంలో ఇందిరా గోస్వామి బ్రాహ్మణ వితంతువుల గురించి రాసిన కథలు తమిళులకు తెలియవా?
చెడ్డ ఆలోచనలకు తగిన ఆయుధం మంచి ఆలోచనలే. వివేకం, విజ్ఞానం కలగడానికి ఖచ్చితమైన దారి ఉదార భావనల విద్య మాత్రమే. పెరుమాళ్ మురుగన్‌ను పోగొట్టుకునే ఒక దురదృష్టకర మానవ సమాజం ఒక సొంత గొంతు పలుకుతున్న మానవస్వరాన్ని పోగొట్టుకున్నట్టే. ఇందుకే ఏ రంగు గల సాహిత్య అణచివేతనైనా ఆధునిక సమాజ పౌరులుగా అందరూ వ్యతిరేకించాల్సి ఉంది. అదే ఇవాళ్టి అత్యవసర పరిస్థితి.
- రామతీర్థ 98492 00385