కేన్సర్ కణాలకు కాంతి, ఆమ్లాలతో చెక్..
కేన్సర్‌కు మరింత సురక్షితమైన, మెరుగైన చికిత్స అందించేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. కేన్సర్ కణితుల్లోకి కొన్ని ఆమ్లాలను పంపి.. పై నుంచి అతినీలలోహిత కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా సాధారణ కణాలకు నష్టం జరక్కుండానే కేన్సర్ కణితిని నాశనం చేయవచ్చని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కాంతి ద్వారా కేన్సర్ కణాలను చంపేందుకు ఫొటోడైనమిక్ థెరపీ పేరుతో ఒక పద్ధతి అందుబాటులో ఉంది. దీనికి ఆమ్లాన్ని జోడించడం కొత్త పద్ధతి తాలూకు విశేషం. సాధారణంగా కేన్సర్ కణితి పరిసరాల్లో ఆమ్లయుత వాతావరణం ఉంటుంది.
ఈ యాసిడ్లను తీసివేసేందుకు కణితి చుట్టూ కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. కానీ ఆ రక్తకణాలను తమకు పోషకాలు అందించేవిగా మార్చేసుకుంటాయి కేన్సర్ కణాలు. ప్రొఫెసర్ మాథ్యూ గోడ్విన్.. రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగా కేన్సర్ కణితి లోపలి భాగంలోకి ‘నైట్రోబెంజాల్డీహైడ్’ ఆమ్లాన్ని ఎక్కించారు. తర్వాత కణితిపైకి అతినీలలోహిత కిరణాలను ప్రసారం చేశారు. దీంతో అక్కడి ఆమ్ల గాఢత విపరీతంగా పెరిగిపోయి 2 గంటల్లోనే 95 శాతం కణాలు నాశనమయ్యాయి. మందులకు లొంగని కేన్సర్ కణాలతో తన పద్ధతికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో గోడ్విన్ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు.