సూర్యుడికి సోదరుడు దొరికాడు!
మన ప్రచండ భానుడికి తోబుట్టువు దొరికాడు! అవును.. సూర్యుడు పుట్టిన వాయు, ధూళి మేఘం నుంచే ఆవిర్భవించిన ఓ నక్షత్రాన్ని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనకు 110 కాంతి సంవత్సరాల దూరంలో హెర్క్యూలెస్ నక్షత్రమండలంలో ఈ కొత్త నక్షత్రం ఉందట. రాత్రిపూట ఉత్తర దిక్కున ఆకాశంలో అతిప్రకాశంతో కనిపించే వెగా నక్షత్రానికి పక్కలో భానుడి సోదరుడిని సాధారణ బైనాక్యులర్స్‌తో కూడా చూడవచ్చట. సూర్యుడికి దగ్గరి పోలికలతో ఉండే 30 నక్షత్రాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఎట్టకేలకు సూర్యుడు, ఈ నక్షత్రం ఒకే మేఘంలోని వాయువు, ధూళిని పంచుకుని పుట్టాయని తేల్చారు. ‘హెచ్‌డీ 162826’ అని పేరు పెట్టిన ఈ నక్షత్రం మన సూర్యుడి కన్నా 15 రెట్లు పెద్దగా ఉందట.
భానుడికి తోబుట్టువును కనుగొనడం ఇదే తొలిసారి కాగా.. మరిన్ని తోబుట్టువులను గుర్తించేందుకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. భానుడి తోబుట్టువులపై అధ్యయనం ద్వారా పాలపుంతలో సూర్యుడు ఎక్కడ, ఎలా ఏర్పడ్డాడు? ఎలా పరిణామం చెందాడు? జీవం పుట్టుక ఎలా సాధ్యం అయింది? అన్న అనేక విషయాలు మరింత బాగా అర్థం చేసుకోవచ్చని పరిశోధన బృందం సారథి ఇవాన్ రమిరెజ్ చెబుతున్నారు. అన్నట్టూ.. భానుడి సోదరుడి చుట్టూ కూడా మన భూమి లాంటి గ్రహాలు తిరుగుతుండవచ్చని, వాటిపై జీవం కూడా ఉండే అవకాశముందని అంటున్నారు.