
అమెరికాలో దుర్మరణానికి గురైన ఇద్దరు తెలుగు విద్యార్ధుల కుటుంబాలకు మేమున్నామంటూ నెటిజన్లు ముందుకొచ్చారు.
సాక్షి, అమరావతి/ సింధనూరు టౌన్: అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో పీజీ చేస్తున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు కౌశిక్ ఓలేటి, కొయ్యలముడి అజయ్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి టర్నర్‌ఫాల్స్‌ను చూసేందుకు వెళ్లిన సమయంలో కౌశిక్ ఓలేటి నీటిలోకి జారిపడ్డాడు. అతన్ని రక్షించేందుకు అజయ్‌కుమార్ విఫలయత్నం చేసి.. అతనితో పాటు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసింది. ప్రమాద సమయంలో వారు లైఫ్ జాకెట్లను ధరించలేదని అధికారులు తెలిపారు. కాగా అమెరికాలో దుర్మరణానికి గురైన వీరి అంత్యక్రియలు చేపట్టేందుకు, మృతదేహాలను స్వస్థలానికి తరలించడం, వారి విద్యా రుణాలను తీర్చడం వంటి అవసరాలకు పెద్దమనసుతో ముందుకురావాలని వారి స్నేహితులు దాతలను కోరారు. తమకు తోచిన సాయం చేయాలని వారి సన్నిహితులు గోఫండ్‌మి వంటి ఫండింగ్ సైట్లలో నెటిజన్లను కోరారు. ఈ విషాద సమయంలో అందరూ స్పందించి మానవత్వం చాటాలని వారు పిలుపు ఇచ్చారు.మరోవైపు బాధిత విద్యార్ధుల కుటుంబానికి బాసటగా నిలుస్తామంటూ పలువురు తమకు తోచిన సాయం అందిస్తున్నారు.