ఈ ఏడాది అమెరికా వెళ్లిన వారిలో భారతీయులదే ప్రథమ స్థానం
రోజూ 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం
ఈ మేరకు సిబ్బందిని మూడురెట్లు పెంచుతున్నాం
8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్‌లో ఉన్నారు
రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యం
అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
– రెబెకా డ్రామ్
ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్‌లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.
వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..
అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..
అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్‌లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.
బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం..
బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్‌లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు..
అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్‌లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్‌లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.
మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్‌పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్‌సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment