
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్(22) మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన తమ బిడ్డ ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ (22) బీటెక్ పూర్తి చేసుకుని ఎంఎస్ అభ్యసించేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో అమెరికా వెళ్లాడు. మాడిసన్ ప్రాంతంలోని డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో వాతావరణంలో పెనుమార్పులతో ఒక్కసారిగా పొగ మంచు కమ్ముకుని, కారు అదుపుతప్పినట్లు తెలిసిందన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతో పాటు రేవంత్‌కు తీవ్ర గాయాలవ్వగా, రేవంత్ దుర్మరణం చెందినట్లు సమాచారం అందిందన్నారు. దీంతో బోడవాడలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment