మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత
అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డు
వాషింగ్టన్: తెలుగు బిడ్డ గోపీ తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత సాధించారు. అంతేకాదు, అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఏడో హ్యూమన్ ఫ్లైట్ ‘ఎన్–25’ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకుపైగా అంతరిక్షంలో విహరించి, క్షేమంగా వెనక్కి తిరిగివచ్చింది. ఈ రాకెట్‌లో ప్రయాణించిన ఆరుగురిలో గోపీ తోటకూర కూడా ఉన్నారు. భూవాతావరణం, ఔటర్‌స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది.
బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన గోపీ తోటకూర ఎంబ్రీ–రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. పైలట్‌గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్‌గా పని చేస్తున్నారు. గోపీకి సాహసాలంటే ఇష్టం. ఇటీవలే టాంజానియాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారోను అధిరోహించారు.
60 ఏళ్ల తర్వాత.. నెరవేరిన కల
అమెరికాకు చెందిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి, ఎయిర్‌ఫోర్స్ మాజీ కెపె్టన్ ఎడ్‌డ్వైట్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఆయన వయసు 90 ఏళ్లు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తిచేశారు. ఆదివారం బ్లూ ఆరిజిన్ ‘ఎన్–25’మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ‘నాసా’అంతరిక్ష ప్రయాణాల కోసం ఎడ్‌డ్వైట్‌ను కూడా ఎంపిక చేశారు. కానీ, ఆయనకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం అప్పట్లో లభించలేదు. 60 ఏళ్ల తర్వాత కల నెరవేర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment