International students
-
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. – రెబెకా డ్రామ్ ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్‌లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్‌లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం.. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్‌లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు.. అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్‌లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్‌పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. -
కనువిప్పు కలిగించే కోత!
కెనడాతో మరో తంటా వచ్చి పడింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ పర్మిట్లపై రెండేళ్ళ పాటు పరిమితులు విధిస్తున్నట్టు ఆ దేశం సోమవారం ప్రకటించింది. వీసాల సంఖ్య తగ్గిందంటే, కాలేజీ డిగ్రీ కోసం అక్కడకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గనుందన్న మాట. ఈ వీసాల కోత అన్ని దేశాలకూ వర్తించేదే అయినా, మనవాళ్ళ విదేశీ విద్యకు కెనడా ఓ ప్రధాన కేంద్రం కావడంతో భారతీయ విద్యార్థి లోకం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. కెనడా గడ్డపై ఓ ఖలిస్తానీ తీవ్రవాది హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ దేశం చేసిన ఆరోపణలతో ఇప్పటికే భారత – కెనడా దౌత్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. ఆ కథ కొలిక్కి రాకముందే, విదేశీ స్టూడెంట్ వీసాలకు కెనడా చెక్ పెట్టడం ఇంకో కుదుపు రేపింది. ఇటీవల కెనడాకు వెళ్ళి చదువుకొంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అతి పెద్ద వర్గాలలో ఒకటి భారతీయ విద్యార్థి వర్గం. 2022లో 2.25 లక్షల పైచిలుకు మంది మన పిల్లలు అక్కడకు చదువులకు వెళ్ళారు. వివరంగా చెప్పాలంటే, ఆ ఏడాది కెనడా ఇచ్చిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41 శాతానికి పైగా భారతీయ విద్యార్థులకే దక్కాయి. ఇక, 2023 సెప్టెంబర్ నాటి కెనడా సర్కార్ గణాంకాల ప్రకారం అక్కడ చదువుకు అనుమతి పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది భారతీయులే. 12 శాతంతో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తీరా ఇప్పుడీ కొత్త నిబంధనలు అలా కెనడాకు వెళ్ళి చదవాలనుకుంటున్న వారికి అశనిపాతమే. వారంతా ఇతర దేశాల వంక చూడాల్సిన పరిస్థితి. 2023లో కెనడా 10 లక్షలకు పైగా స్టడీ పర్మిట్లిచ్చింది. దశాబ్ది క్రితంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. తాజా ప్రతిపాదనతో ఈ ఏడాది ఆ పర్మిట్ల సంఖ్య 3.64 లక్షలకు తగ్గనుంది. అంటే, 35 శాతం కోత పడుతుంది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి ప్రధానంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకే వర్తిస్తుంది. గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్‌డీలకు ఇది వర్తించకపోవడం ఊరట. అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లకు షరతులు వర్తిస్తాయి. గతంలో కెనడాలో పీహెచ్డీ, మాస్టర్స్ కోర్సులు చేస్తుంటే మూడేళ్ళ వర్క్ పర్మిట్ దక్కేది. ఆ దేశంలో శాశ్వత నివాసం సంపాదించడానికి ఈ పర్మిట్లు దగ్గరి దోవ. ప్రధానంగా పంజాబీలు కెనడాలో చదువుతూనే, లేదంటే తాత్కాలిక ఉద్యోగాల్లో చేరుతూనే జీవిత భాగస్వామిని వీసాపై రప్పిస్తుంటారు. ఇక ఆ వీలుండదు. స్టడీ పర్మిట్లలో కోతతో విదేశీ విద్యార్థులకే కాదు... కెనడాకూ దెబ్బ తగలనుంది. పెద్దయెత్తున విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి కెనడాలోని పలు విద్యాసంస్థలు తమ ప్రాంగణాలను విస్తరించాయి. తాజా పరిమితితో వాటికి ఎదురుదెబ్బ తగలనుంది. అంతర్జాతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏటా 1640 కోట్ల డాలర్ల మేర ఆదాయం వస్తోంది. కోతలతో ఇప్పుడు దానికి గండి పడనుంది. అలాగే, జీవన వ్యయం భరించగలమంటూ ప్రతి విదేశీ విద్యార్థీ 20 వేల కెనడా డాలర్ల విలువైన ‘గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్’ (జీఐసీ) తీసుకోవడం తప్పనిసరి. అలా కొత్త విద్యార్థుల వల్ల కెనడా బ్యాంకులు సైతం ఇంతకాలం లాభపడ్డాయి. తాజా నిబంధనలతో వాటికీ నష్టమే. అలాగే, దాదాపు లక్ష ఖాళీలతో కెనడాలో శ్రామికశక్తి కొరత ఉంది. విదేశీ విద్యార్థులు ఆ లోటును కొంత భర్తీ చేస్తూ వచ్చారు. గడచిన 2023లో ఒక్క ఆహారసేవల రంగంలో 11 లక్షల మంది కార్మికు లుంటే, వారిలో 4.6 శాతం మంది ఈ అంతర్జాతీయ విద్యార్థులే. ఆ లెక్కలన్నీ ఇక మారిపోతాయి. శ్రామికశక్తి కొరత పెరుగుతుంది. అయినా, కెనడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్న ఈ కోత నిర్ణయం వెనుక అనివార్యతలు అనేకం. చదువు పూర్తి చేసుకొని, అక్కడే వర్క్ పర్మిట్లతో జీవనోపాధి సంపాదించడం సులభం గనక విదేశీ విద్యకు కెనడా పాపులర్ గమ్యస్థానం. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి, అద్దెకు అపార్ట్ మెంట్లు దొరకని పరిస్థితి. నిరుడు కెనడా వ్యాప్తంగా అద్దెలు 7.7 శాతం పెరిగాయి. గృహవసతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. దాంతో ట్రూడో సర్కారుపై ఒత్తిడి పెరిగింది. విదేశీయుల వలసల్ని అతిగా అనుమతించడమే ఈ సంక్షోభానికి కారణమని కెనడా జాతీయుల భావన. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ఇది లాభించింది. పైగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓటమి పాలవుతారని ప్రజాభిప్రాయ సేకరణల మాట. ఈ పరిస్థితుల్లో స్వదేశీయుల్ని సమాధానపరిచి, వలస జీవుల అడ్డుకట్టకై ట్రూడో సర్కార్ ఈ వీసాల కోతను ఆశ్రయించింది. విద్యార్థుల సంఖ్యను వాటంగా చేసుకొని, కొన్ని సంస్థలు కోర్సుల నాణ్యతలో రాజీ పడుతున్న వైనానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్య చేపట్టామని కెనడా మాట. తాజా పరిణామం భారత్‌కు కనువిప్పు. కెనడాలో పలు ప్రైవేట్ సంస్థలు ట్యూషన్ ఫీజులేమో భారీగా వసూలు చేస్తూ, నాణ్యత లేని చదువులు అందిస్తున్నాయి. అయినా భారతీయ విద్యార్థులు కెనడాకో, మరో విదేశానికో వెళ్ళి, ఎంత ఖర్చయినా పెట్టి కోర్సులు చేసి, అక్కడే స్థిరపడాలనుకుంటున్నారంటే తప్పు ఎక్కడున్నట్టు? మన దేశంలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నట్టు? ఇది పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. 2025 నాటికి భారతీయ కుటుంబాలు పిల్లల విదేశీ చదువులకై ఏటా 7 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తాయని అంచనా. చిన్న పట్నాలు, బస్తీల నుంచీ విదేశీ విద్య, నివాసంపై మోజు పెరుగుతుండడం గమనార్హం. నాణ్యమైన ఉన్నత విద్య, ఉపాధి కల్పనలో మన ప్రభుత్వాల వైఫల్యాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ వాస్తవాలు గ్రహించి, ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేదంటే, అమెరికాలో ఉద్యోగాలకు, కెనడాలో వీసాలకు కోత పడినప్పుడల్లా దిక్కుతోచని మనవాళ్ళు మరో దేశం దిక్కు చూడాల్సిన ఖర్మ తప్పదు! -
అమెరికాలో ఉద్యోగావకాశాలు.. ఎస్ఎల్యూ నుంచి లెవెల్అప్ ప్రోగ్రాం
హైదరాబాద్: అమెరికన్ విశ్వవిద్యాలయం సెయింట్ లూయిస్ యూనివర్సిటీ (ఎస్ఎల్యూ) తమ అంతర్జాతీయ విద్యార్థులు స్థానికంగా ఉద్యోగావకాశాలను దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పించనుంది. ఇందులో భాగంగా వారు ఉద్యోగానుభవం పొందేందుకు ఉపయోగపడే లెవెల్అప్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎల్యూ అసోసియేట్ ప్రొవోస్ట్ ఎరిక్ ఆర్మ్బ్రెక్ట్ తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో అనుభవాన్ని గడించేందుకు, జాబ్ మార్కెట్లో కంపెనీల దృష్టిని ఆకర్షించేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎక్సెలరేట్ సంస్థతో జట్టు కట్టినట్లు పేర్కొన్నారు. -
ఏయూలో సందడిగా విదేశీ విద్యార్థుల వీడ్కోలు (ఫోటోలు)
-
Study Abroad: విదేశీ స్కాలర్‌షిప్‌లకు మార్గమిదిగో..!
గత కొన్నేళ్లుగా దేశంలోని యువత దృష్టి విదేశీ యూనివర్సిటీల్లో చదువులపై ఎక్కువగా ఉంటోంది. ఏదో రకంగా స్టడీ కోసం అబ్రాడ్‌కు వెళ్లాలని గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. వీరి మార్గంలో అధిక ఫీజులు, ఇతర వ్యయాలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ప్రతిభావంతులకు ఆర్థిక అవరోధాలు అడ్డురాకూడదనే సదాశయంతో వివిధ దేశాలు, పలు ట్రస్టులు స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశీ విద్య అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు సంబంధించి ముఖ్యమైన స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లపై ప్రత్యేక కథనం.. ఆస్ట్రేలియా అవార్డ్స్ స్కాలర్షిప్స్ వీటిని ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ అందిస్తోంది. ఆస్ట్రేలియాలో పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపుతోపాటు రీసెర్చ్, అకడమిక్ వ్యయాలకు సరిపడే మొత్తం స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది. వెబ్సైట్: dfat.gov.au ► ఎండీవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్: ఈ ప్రోగ్రామ్ పరిధిలో పీజీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ లభిస్తుంది. పీజీ అభ్యర్థులకు రెండేళ్లు, పీహెచ్డీ అభ్యర్థులకు మూడున్నరేళ్ల వరకు స్కాలర్షిప్ గడువు ఉంటుంది. ► ఎండీవర్ ఆస్ట్రేలియా చెంగ్ కాంగ్ రీసెర్చ్ ఫెలోషిప్: నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో రీసెర్చ్ చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం. ఎంపికైన అభ్యర్థులకు 23,500 ఆస్ట్రేలియా డాలర్లు లభిస్తాయి. ► ఎండీవవర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అవార్డ్స్: ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిధిలోని కళాశాలలు, యూనివర్సిటీలలో డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, అసోసియేట్ డిగ్రీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు వీటిని అందజేస్తారు. ► ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్కాలర్షిప్స్: పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు ఉద్దేశించిన పథకం ఇది. ప్రతి ఏటా మూడు వందల మంది విదేశీ విద్యార్థులను ఆయా ప్రామాణికాల(రీసెర్చ్ టాపిక్, అకడమిక్ రికార్డ్ తదితర) ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్స్: https://india.highcommission.gov.au/ https://www.studyinaustralia.gov.au/ కెనడా: బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ హెల్త్ సైన్స్, నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో రీసెర్చ్ ఔత్సాహికులకు బాంటింగ్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్‌ను అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి డెబ్భై వేల డాలర్లు లభిస్తాయి. ఏటా 70 ఫెలోషిప్స్(అన్ని దేశాలకు కలిపి) అందుబాటులో ఉంటాయి. వ్యవధి: రెండు సంవత్సరాలు. వెబ్సైట్: banting.fellowships-bourses.gc.ca ► ట్రుడే సాలర్షిప్స్: వీటిని ది ట్రుడే ఫౌండేషన్ అందిస్తోంది. డాక్టోరల్(రీసెర్చ్) స్టడీస్ విద్యార్థులకు అందిస్తారు. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో పీహెచ్డీ చేస్తున్న వారికి ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా అరవై వేల డాలర్ల స్కాలర్‌షిప్‌తోపాటు 20 వేల డాలర్ల ట్రావెలింగ్ అలవెన్స్ లభిస్తుంది. వెబ్సైట్: www.trudeaufoundation.ca ► వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్: కెనడియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, నేచురల్ సైన్సెస్, ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం... వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్. కెనడాలోని యూనివర్సిటీల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాన్ని ఖరారు చేసుకున్న అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏటా యాభై వేల డాలర్లు చొప్పున మూడేళ్లపాటు స్కాలర్షిప్ అందిస్తారు. వెబ్సైట్: vanier.gc.ca ► కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్–మాస్టర్స్ ప్రోగ్రామ్స్: ఇది కెనడా ప్రభుత్వ గుర్తించిన యూనివర్సిటీల్లో మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకం. ఏటా కెనడా సహా అన్ని దేశాలకు సంబంధించి మొత్తం 2,500 మందికి వీటిని అందజేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి 17,500 డాలర్లు స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది. వెబ్సైట్: https://www.nserc-crsng.gc.ca/ -
యూకేలో సరికొత్త వీసా నిబంధనలు
లండన్: విదేశీ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం సరికొత్త వీసా నిబంధనలను గురువారం వెల్లడించింది. అయితే సరికొత్త వీసా రావాలంటే కనీసం 70పాయింట్లు పరిమితిని విధించారు. ఈ నేపథ్యంలో మెరిట్ విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా నూతన వీసా విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే విద్యార్థులు కోర్సు ప్రారంభానికి 6 నెలల ముందే వీసా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు. అయితే గత ఆర్థిక సంవత్సరం 50,000 మంది దేశీయ విద్యార్థులు యూకేలో వీసా పొంది చదువుకున్నట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. అయితే కోర్సు పూర్తయిన తరువాత కూడా కొందరు విద్యార్థులు అక్రమంగా ఉంటున్నారని, వీసా నిబంధనలు పాటిస్తున్న వారికి ఎలాంటి ఢోకా ఉండదని యూకే వర్గాలు పేర్కొన్నాయి. -
ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన రాష్ట్రాలు
వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం చేసిన మార్పులను దేశంలోని 17 రాష్ట్రాలు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలు న్యాయస్థానంలో సవాలు చేశాయి. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు వెళ్లిపోయేలా చేయడం క్రూరమైన విషయమే కాకుండా చట్టవ్యతిరేకమైందంటూ రాష్ట్రాల తరఫు న్యాయవాదులకు నేతృత్వం వహిస్తున్న మసాచూసెట్స్ అటార్నీ జనరల్ మౌరా హీలీ వ్యాఖ్యానించారు. హార్వర్డ్, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఐసీఈకి వ్యతిరేకంగా కేసులు దాఖలు చేసిన కొన్నిరోజులకే 17 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలు అదే చర్య తీసుకోవడం గమనార్హం. ఆన్లైన్ క్లాసుల ద్వారా మాత్రమే విద్యాబోధన అందించే యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థులు వారి దేశాలకు వెళ్లిపోవాలని ఈ నెల 6వ తేదీన యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మాసాచూసెట్స్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్, ఐసీఈలపై కేసు దాఖలైంది. దీంతోపాటు ప్రముఖ ఐటీ సంస్థలు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌లు కూడా న్యాయస్థానాల్లో సవాలు చేశాయి. హార్వర్డ్, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లో భాగస్వాములవుతున్నట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. అమెరికాలో దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. -
అమెరికన్లకే ఉద్యోగాలు...!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలన్న విధానం విదేశీ విద్యార్థుల పాలిట పట్ల శాపంగా మారుతోంది. అమెరికా ఫస్ట్ అన్న తన నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో భాగంగా హెచ్ 1 బీ వీసా నిబంధనల్లో మార్పు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికన్లతోనే అక్కడి ఉద్యోగాల భర్తీకి ఆ దేశ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కారణంగా విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ దాకా పరిశీలిస్తే... అమెరికా పౌరసత్వం లేదా ఫెడరల్ ప్రభుత్వం నుంచి ‘వర్క్ ఆథరైజేషన్’ ఉన్న వారినే అక్కడి కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవడం 19 శాతం పెరిగింది. వీసా నిబంధనల ప్రభావం కారణంగా అమెరికాలోని బిజినెస్ స్కూళ్లలో చదువుకున్న విదేశీవిద్యార్థుల ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. రెండున్నర కోట్ల ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ ఓ నివేదికలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. 2017లో 55 శాతం అమెరికా కంపెనీలు విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. 2018లో అది 47 శాతానికి పడిపోయింది. హెచ్ 1బీ వీసా దరఖాస్తులపై ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడినట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతమున్న విధానం మేరకు సాంకేతిక, సైద్ధాంతిక నైపుణ్యమున్న వలసదారులు కాని వారిని (నాన్ ఇమ్మిగ్రెంట్స్) కూడా అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో తీసుకునేందుకు హెచ్ 1బీ కేటగిరి అనుమతిస్తోంది. ఇది మూడేళ్ల వరకు చెల్లుబాటు కావడంతో పాటు మళ్లీ పొడిగించేందుకు అవకాశాలుంటాయి. అయినప్పటికీ ఆయా రంగాల్లో విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నట్టు వెల్లడైంది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, వర్క్ పర్మిట్లు పొందుతున్న వారి సంఖ్య మాత్రం దిగజారినట్టు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,14,503 హెచ్ 1బీ వీసాలు అనుమతించగా, 2017లో అది 1,08,101కు పడిపోయింది. వీరిలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారి సంఖ్య 52,002 నుంచి 45,405కు తగ్గిపోయింది. హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. 200717 మధ్య కాలంలో ఈ వీసాల కోసం అమెరికా పౌర, వలస సేవా సంస్థ (యూఎస్సీఐఎస్)కు 22 లక్షల మంది ఇండియన్లు దరఖాస్తు చేసుకోగా.. 3,01,000 మందితో చైనీయులు రెండోస్థానంలో నిలిచారు. -
విజయీభవ..
నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రేపు సెకండియర్ పరీక్షలు ఆరంభం హెల్ప్‌లైన్ నంబర్లు 040 - 23236433, 23242696 సిటీబ్యూరో: ఏడాదంతా చదివి...రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమైన ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. బుధవారం నుంచి ప్రారంభమవుతున్న పరీక్షలకు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో హాజరై.. అంతే ఉత్సాహంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాగా ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి బుధవారం జంట జిల్లాల్లో 1.79 లక్షల మంది ద్వితీయ భాష పరీక్షను తొలిగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో 189, రంగారెడ్డి జిల్లా పరిధిలో 244 కేంద్రాల్లో జరిగే పరీక్షల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు 8 గంటల లోపే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుంటే మేలు. 8.30 గంటలకు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. విద్యార్థులను సకాలంలో కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఆర్టీసీ సమాయత్తమైంది. ‘ఎగ్జామ్ స్పెషల్’ పేరిట బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు పూర్తి చే సింది. హాల్‌టికెట్, పెన్నులు కచ్చితంగా విద్యార్థులు తీసుకెళ్లాలి. డౌన్లోడ్ చేసిన హాల్‌టికెట్‌తోపాటు కళాశాల గుర్తింపు కార్డు తప్పనిసరికాదు. కాకపోతే వెంట ఉంటే మేలు. ఇక గురువారం మొదలయ్యే సెకండియర్ పరీక్షలకు 1.98 లక్షల మంది సన్నద్ధం అవుతున్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు: ఉదయం ఏడు గంటల నుంచే పనిచేస్తాయి. నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెంటనే సంప్రదింవచ్చు. హైదరాబాద్ జిల్లా 040-23236433 రంగారెడ్డి జిల్లా: 040-23242696, 23244625 హైదరాబాద్ జిల్లా పరీక్షల కమిటీ సభ్యుల నంబర్లు: 9908215359, 9347201789, 9849557401, 9391012604, 9849524111 -
జంబ్లింగ్.. గ్యాంబ్లింగ్!
ఒక్కో విద్యార్థి నుంచి రూ.800 నుంచి 1000 వసూలు చెల్లించకపోతే హాల్టిక్కెట్ల నిరాకరణ {పైవేటు, కార్పొరేట్ కాలేజీల దందా కొల్లగొట్టేది రూ.2 కోట్లపైనే విశాఖపట్నం: జంబ్లింగ్ బెడద తప్పిందని సంతోషిస్తున్న ఇంటర్ విద్యార్థులకు పలు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు సరికొత్త షాక్ ఇస్తున్నాయి. ఇదే వంకతో విద్యార్థుల నుంచి దండిగా దోచుకుంటున్నాయి. గురువారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు రూ.500, కార్పొరేట్ కళాశాలు రూ.800 నుంచి వెయ్యి రూపాయల తక్షణమే చెల్లించాలని నిబంధన విధించాయి. ఈ సొమ్ము ఇస్తేనే ప్రాక్టికల్స్‌కు హాల్‌టిక్కెట్లు ఇస్తామని పితలాటకం పెడుతున్నాయి. దీంతో విద్యార్థులు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిల్లలకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా జంబ్లింగ్ ఉంటుందంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో రద్దు చేసింది. హమ్మయ్యా! అనుకుంటున్న తరుణంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి భారీగా సొమ్ము దండుకునే ఎత్తుగడ వేశాయి. ప్రాక్టికల్ పరీక్షలకు వచ్చే ఎగ్జామినర్లు మార్కులు ఎక్కువగా వేసేలా ‘మేనేజ్’ చేయడానికి ఈ సొమ్ము చెల్లించాల్సిందేనని ఆయా యాజమన్యాలు తెగేసి చెబుతున్నాయి. మీ పిల్లలకు మార్కులు పెరగడం కోసమే ఇదంతా.. మా కోసం కాదు.. అంటుండడంతో విధిలేని పరిస్థితుల్లో పలువురు తల్లిదండ్రులు అడిగినంతా ఇచ్చేస్తున్నారు. చెల్లించని వారి పిల్లలను టార్గెట్ చేసి మార్కులు తగ్గించేస్తారేమోనన్న భయంతో విధిలేక చెల్లిస్తున్న వారూ ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులకు భౌతిక, రసాయనశాస్త్రాలకు 30 చొప్పున 60 మార్కులకు, బైపీసీ వారికి భౌతిక, రసాయన, జంతు, వృక్షశాస్త్రాలకు ఒక్కో దానికి 30 చొప్పున 120 మార్కులకు ప్రాక్టికల్స్ మార్కులుంటాయి. జేఈఈ మెయిన్స్‌కు వెయిటేజీ మార్కులు 40 శాతం, ఎంసెట్‌కు 25 శాతం ఉంది. జేఈఈ మెయిన్స్‌లో ఒక్క మార్కు తేడాలో 1200 ర్యాంకు వెనక్కి పోతుంది. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు తమ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్‌లో ర్యాంకుల కోసం ఎగ్జామినర్స్ (వీరిలో అధికులు కాంట్రాక్టు లెక్చరర్లే) పేపరుకి కొంత మొత్తం చొప్పున ముట్టచెబుతుంటారు. పలు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల నుంచి ఇదివరకే ల్యాబ్ ఫీజుల పేరుతో రూ.1000-1500 వరకు వసూలు చేశారు. ఈ ఏడాది విశాఖ జిల్లా, నగరం మొత్తమ్మీద 172 సెంటర్లలో 33.742 మంది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో దాదాపు 22 వేల మంది (ఎంపీసీ 15 వేలు, బైపీసీ 7 వేలు) ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నారు. వీరు కాకుండా ఒకేషనల్ విద్యార్థులు మరో ఐదు వేల మంది వరకు ఉన్నారు. వీరి నుంచి సగటున రూ.800 చొప్పున వసూలు చేస్తే సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారం బాహాటంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వసూలు నేరమే.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన పనిలేదు. అలా వసూలు చేసే కాలేజీపై చర్యలు తీసుకుంటాం. నోటీసులిచ్చాక జరిమానా కూడా విధిస్తాం. ఇప్పటిదాకా మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి తక్షణమే చర్య తీసుకుంటాం. -టి.నగేష్, ఆర్ఐవో, విశాఖ ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి అక్రమ వసూళ్లు చేస్తున్న కాలేజీలపై ఆర్ఐవో విచారణ జరిపి వాటి గుర్తింపు రద్దుచేయాలి. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇలా వసూలు చేసిన సొమ్మును తిరిగి విద్యార్థులకు చెల్లించాలి. లేనిపక్షంలో ప్రాక్టికల్స్ రాస్తున్న ఏబీవీపీ విద్యార్థుల ద్వారా అక్రమాల సమాచారం తెలుసుకుని ఆర్ఐవోపై చర్య తీసుకునే వరకు ఆందోళన చేస్తాం. -కె.వాసు, జిల్లా కన్వీనర్, ఏబీవీపీ -
యూఎస్‌లో 20 శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు
వాషింగ్టన్ : యూఎస్‌లోని పలు విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అది ఎంతగా అంటే 20 శాతం మేర పెరిగిందని యూఎస్ గురువారం విడుదల చేసిన ఓ అధికారిక నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జులై నుంచి నవంబర్ వరకు 1.8 లక్షల మంది బారతీయ విద్యార్థులు దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్శిటీల్లో చదువుతున్నారని పేర్కొంది. యూఎస్‌లో భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యపై గతేడాది విడుదల చేసిన నివేదికలో కంటే ఈ ఏడాది 20.7 శాతం అధికమని స్పష్టం చేసింది. అయితే వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు 1.2 మిలియన్ల మంది యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని ఆ నివేదికలో పేర్కొంది. యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల జాబితాలో చైనా అగ్రస్థానంలో నిలవగా... ఆ తర్వాత వరుస స్థానాలను ఇండియా, దక్షిణ కొరియా నిలిచాయని వెల్లడించింది. -
భారతీయ విద్యానిలయాలు వెలవెల!
నాణ్యమైన విద్య అందుతుందంటే చాలు.. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లేందుకు యువత సిద్ధపడుతున్న పరిస్థితులు ఇప్పటివి! కుటుంబ ఆదాయాల్లో పెరుగుదల, రుణాల లభ్యత, అందుబాటులో ఉపకారవేతనాలు.. ఇలా వివిధ అవకాశాలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువులకు ద్వారాలు తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించి ఏ విశ్వవిద్యాలయాలు అత్యున్నతమైనవో తెలుసుకోవడంతో పాటు విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రపంచ ర్యాంకింగ్స్ దోహదపడుతున్నాయి.. బ్రిటన్‌కు చెందిన విద్య, కెరీర్ సలహా సంస్థ క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్).. తాజాగా ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. కొలమానాలు క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితా తయారీకి ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అవి.. 1. విద్యా సంబంధ ఖ్యాతి, 2. యాజమాన్య కీర్తి, 3. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి, 4. అంతర్జాతీయ ఫ్యాకల్టీ, 5. అంతర్జాతీయ విద్యార్థులు, 6. ఫ్యాకల్టీ- ప్రశంసలతో కూడిన వ్యక్తిగత వివరణ. ర్యాంకింగ్స్‌లో టాప్-200లో ఏ ఒక్క భారతీయ విద్యాసంస్థకూ స్థానం లభించకపోవడం గమనార్హం. ర్యాంకు సంస్థ దేశం 1 మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూఎస్ 2 యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూకే 2 ఇంపీరియల్ కాలేజీ లండన్ యూకే 4 హార్వర్డ్ యూనివర్సిటీ యూఎస్ 5 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూకే భారత్‌లో ప్రపంచ ర్యాంకు సంస్థ ఆసియా ర్యాంకు 222 ఐఐటీ బాంబే 41 235 ఐఐటీ ఢిల్లీ 38 300 ఐఐటీ కాన్పూర్ 52 322 ఐఐటీ మద్రాస్ 53 324 ఐఐటీ ఖరగ్‌పూర్ 60 421-430 యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 81 461-470 ఐఐటీ రూర్కీ 70 551-600 ఐఐటీ గౌహతి 95 పొరుగు దేశం చైనాకు సైతం టాప్ 100లో మూడు ర్యాంకులు దక్కాయి. నెం.1 మిట్ అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్).. ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితాలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. 2012 నుంచి జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 1861, ఏప్రిల్ 10న ఏర్పాటైన దగ్గరి నుంచి విద్యా నాణ్యత, పరిశోధనల పరంగా విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘మైండ్ అండ్ హ్యాండ్’ నినాదంతో 1,030 మంది ప్రొఫెసర్లు, 779 మంది ఇతర బోధనా సిబ్బందితో నిత్యనూతనంగా, సామాజిక దృక్పథంతో కోర్సులను అందిస్తోంది. 2013-14లో వర్సిటీలోని విద్యార్థుల సంఖ్య 11,301. పరిశోధనల కోణంలో చూస్తే వర్సిటీ అనేక ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఇంజనీరింగ్ ప్రాక్టికల్ మైక్రోవేవ్ రాడార్, హైస్పీడ్ ఫొటోగ్రఫీ వంటి ఆవిష్కరణలు వెలుగుచూశాయి. వివిధ అంశాల్లో విశ్వవిద్యాలయం స్కోర్ (మొత్తం 100కు) అంశం స్కోర్ విద్యా సంబంధ ఖ్యాతి 100 యాజమాన్య కీర్తి 100 విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 100 అంతర్జాతీయ ఫ్యాకల్టీ 99.80 అంతర్జాతీయ విద్యార్థులు 95.60 ఫ్యాకల్టీ- సైటేషన్స 100 భారత్‌లో నెం.1-ఐఐటీ బాంబే క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో గతేడాది 233 స్థానంలో నిలిచిన ఐఐటీ బాంబే ఈసారి 222వ ర్యాంకు సాధించింది. భారత్ పరంగా చూస్తే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఐఐటీ 1958లో ఏర్పాటైంది. ఉత్తమ బోధనా సిబ్బంది, విద్యాసేవలను అందించడంలో నవ్యత, పరిశోధన ప్రాజెక్టులు ఇలా వివిధ అంశాల్లో ముందుంటూ దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా గుర్తింపు సాధించింది. వివిధ అంశాల్లో విశ్వవిద్యాలయం స్కోర్ అంశం స్కోర్ విద్యా సంబంధ ఖ్యాతి 66 యాజమాన్య కీర్తి 92.50 విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 28.80 అంతర్జాతీయ ఫ్యాకల్టీ 4.60 అంతర్జాతీయ విద్యార్థులు 1.60 ఫ్యాకల్టీ- సైటేషన్స 44.30 ‘‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలో 222వ స్థానం, దేశంలో మొదటి స్థానం పొందినందుకు ఆనందించాల్సిన సమయమిది. విద్యా సంబంధ ఖ్యాతి (అఛ్చిఛ్ఛీఝజీఛి ఖ్ఛఞఠ్ట్చ్టజీౌ)లో 160 వ ర్యాంకు, యాజమాన్య కీర్తి లో 60వ ర్యాంకు సాధించాం. ఇంజనీరింగ్, టెక్నాలజీ ఫ్యాకల్టీ విభాగంలో ఐఐటీ బాంబే 53వ ర్యాంకు సాధించడం గర్వకారణం’’ - రష్మీ ఉదయ్‌కుమార్, ఏపీఐవో, ఐఐటీ బాంబే. అగ్రరాజ్యాలదే ఆధిపత్యం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రరాజ్యాల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. గతంలో మాదిరి ఇవి ఈసారి కూడా ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. టాప్ 1, 4, 7, 8, 9, 10 స్థానాలు అమెరికా ఖాతాలో చేరగా, 2, 5 స్థానాలు యూకేకు దఖలుపడ్డాయి. ఇతర ర్యాంకుల్లోనూ ఈ రెండు దేశాలకు చెందిన యూనివర్సిటీలే ఆధిపత్యం ప్రదర్శించాయి. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, కెమిస్ట్రీ, బయలాజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లింగ్విస్టిక్స్ తదితర సబ్జెక్టుల పరంగా కేటాయించిన ర్యాంకుల్లోనూ అగ్రరాజ్యాల హవా స్పష్టమైంది. సత్తా చాటిన చిన్న దేశాలు జనంలో ఘనంగా ఉన్న భారత్ తీవ్ర నిరాశకు గురిచేయగా; చిన్న దేశాలు సైతం ఉత్తమ ర్యాంకులు సాధించాయి. స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 12వ స్థానం కైవసం చేసుకుంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, మెక్‌గిల్ యూనివర్సిటీలకు వరుసగా 20, 21 స్థానాలు దక్కాయి. సింగపూర్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియాలు సైతం చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాయి. బోధనా సిబ్బంది, మౌలిక వసతులు, నిధులు.. వీటిలో లోపాలే మనకు శాపాలు కనీస సౌకర్యాలు లేకున్నా, మెరుగైన విద్యను అందించే విద్యావిధానం మనది. మేధో సంపత్తిలో భారతీయులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. విద్యా సంస్థల విషయంలో అగ్ర రాజ్యాలతో ఇక్కడి వ్యవస్థను పోల్చడం సరికాదు. వందల ఏళ్ల కిందట రూపుదిద్దుకున్న క్యాంపస్‌లలో అన్ని విధాలా అభివృద్ధి జరిగే ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా వంటి దేశాల విశ్వవిద్యాలయాలలో మౌలికవసతులు, నిపుణులైన సిబ్బంది, ప్రయోగశాలలు, నిధులు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ర్యాంకింగ్ నిర్ధరణలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో పబ్లికేషన్స్‌ను పరిశీలిస్తే ఉదాహరణకు జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో 1000 మందికి పైగా ఫ్యాకల్టీ ఉంటారు. ఇక్కడ 70-80 మంది ఉంటారు. ఈ రెండింట్లో పబ్లికేషన్స్‌ను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. మన దేశంలో సరైన ఫ్యాక ల్టీ, మౌలిక వసతులు, నిధులు ఈ మూడింటిలోనూ లోపాలే మన విద్యా వ్యవస్థకు శాపాలని చెప్పొచ్చు. చైనా విద్యాసంస్థలు ముందు వరుసలో ఉండటానికి కారణం అక్కడ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యమే. 2000కు ముందు అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు ఆ దేశం నుంచి ఒకరు లేదా ఇద్దరు ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ సదస్సు జరిగినా చైనా నుంచి 15-20 మంది వరకు హాజరవుతున్నారు. పరిశోధన-అభివృద్ధి విషయంలో విద్యాలయాలు పూర్తిగా ప్రభుత్వ నిధులపైనే ఆధారపడాలి. ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశోధనలు చేసే అవకాశం ఇక్కడ లేదు. కార్పొరేట్ సంస్థలు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ను విద్యాసంస్థలకు చేరువచేస్తే కొంత వెసులుబాటు దొరుకుతుంది. విద్యాలయాలకు సరైన వనరులు ఉండి, స్వేచ్ఛ ఇచ్చి, కొత్తఆలోచనలను పలు విభాగాలు సంయుక్తంగా పంచుకునే అవకాశం ఉంటే ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. - డాక్టర్ కృష్ణన్ సుందర రాజన్, అసోసియేట్ ప్రొఫెసర్, ఐఐఐటీ-హైదరాబాద్. -
సంక్షేమానికి మంగళం
సాక్షి, బెంగళూరు : ఎన్నికల్లో గెలవడానికి ముందూ వెనకా ఆలోచించకుండా అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆటు తరువాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైనట్లుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా పీయూసీ (ఇంటర్) విద్యార్థులకు ల్యాప్‌టాప్ చేతికి అందలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిధులు లేవనే నెపంతో గతంలో ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలకు మంగళం పాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో పీయూసీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందజేస్తామని పేర్కొంది. ఇదే విషయాన్ని ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసి ప్రసంగంలో (2014 జనవరి 22)లో కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలోని సుమారు 10 లక్ష మంది పీయూసీ విద్యార్థులు ఉన్నారు. వీరందరికి ల్యాప్‌టాప్‌లు అందించడానికి రూ1,000 కోట్లు అవసరం అవుతాయి. ఈ ఏడాది విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్ (రూ 21,305 కోట్లు)లో ఇది కేవలం 4.6 శాతం మాత్రమే. అయితే నిధుల కొరతను సాకుగా చూపుతూ ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకానికి స్వస్తిపలికినట్లు తెలుస్తోంది. కనీసం మెరిట్ స్టూడెంట్స్ (80 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నవారికి) ల్యాప్‌టాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో అధికారులు నివేదిక తయారు చేసి ఇందుకు రూ.300 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతులెత్తేసిన ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యార్థినులకు అందిస్తున్న ఉచిత సైకిళ్ల వితరణ కూడా నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది. 2012-13 ఏడాదికి అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ చివరిసారిగా విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేసింది. అటు పై 2013-14 ఏడాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సైకిల్ కూడా కొనుగోలు చేయకం పోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాజీవ్ విద్యా మిషన్ నుంచి నిధులు వస్తాయనే ఉద్దేశంతో ఆరు నుంచి పదోతరగతి విద్యార్థినులకు ఉచితంగా ఏడాదికి 100 శానిటరి నాప్కిన్లు ఇవ్వనున్నట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. ఇందుకు మంత్రిమండలి కూడా ఆమోదముద్ర వేసింది. అయితే కేంద్రం నుంచి అవసరమైన నిధులు ఇప్పటికీ అందలేదు. దీంతో నాప్కిన్ల వితరణ పథకం అమలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అనుకున్నంత మేర పన్నులు వసూలు కావడం లేదు. దీంతో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే నిధులు చాలడం లేదు. అంతేకాకుండా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు అసాధ్యమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అందువల్లే మానిఫెస్టోలో పేర్కొన్న పలు సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి అటకెక్కించే ఆలోచనలో ఉన్నారు.’ అని పేర్కొన్నారు.