ఒక్కో విద్యార్థి నుంచి రూ.800 నుంచి 1000 వసూలు
చెల్లించకపోతే హాల్‌టిక్కెట్ల నిరాకరణ
{పైవేటు, కార్పొరేట్ కాలేజీల దందా కొల్లగొట్టేది రూ.2 కోట్లపైనే
విశాఖపట్నం: జంబ్లింగ్ బెడద తప్పిందని సంతోషిస్తున్న ఇంటర్ విద్యార్థులకు పలు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు సరికొత్త షాక్ ఇస్తున్నాయి. ఇదే వంకతో విద్యార్థుల నుంచి దండిగా దోచుకుంటున్నాయి. గురువారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు రూ.500, కార్పొరేట్ కళాశాలు రూ.800 నుంచి వెయ్యి రూపాయల తక్షణమే చెల్లించాలని నిబంధన విధించాయి. ఈ సొమ్ము ఇస్తేనే ప్రాక్టికల్స్‌కు హాల్‌టిక్కెట్లు ఇస్తామని పితలాటకం పెడుతున్నాయి. దీంతో విద్యార్థులు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిల్లలకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా జంబ్లింగ్ ఉంటుందంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో రద్దు చేసింది. హమ్మయ్యా! అనుకుంటున్న తరుణంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి భారీగా సొమ్ము దండుకునే ఎత్తుగడ వేశాయి. ప్రాక్టికల్ పరీక్షలకు వచ్చే ఎగ్జామినర్లు మార్కులు ఎక్కువగా వేసేలా ‘మేనేజ్’ చేయడానికి ఈ సొమ్ము చెల్లించాల్సిందేనని ఆయా యాజమన్యాలు తెగేసి చెబుతున్నాయి. మీ పిల్లలకు మార్కులు పెరగడం కోసమే ఇదంతా.. మా కోసం కాదు.. అంటుండడంతో విధిలేని పరిస్థితుల్లో పలువురు తల్లిదండ్రులు అడిగినంతా ఇచ్చేస్తున్నారు. చెల్లించని వారి పిల్లలను టార్గెట్ చేసి మార్కులు తగ్గించేస్తారేమోనన్న భయంతో విధిలేక చెల్లిస్తున్న వారూ ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులకు భౌతిక, రసాయనశాస్త్రాలకు 30 చొప్పున 60 మార్కులకు, బైపీసీ వారికి భౌతిక, రసాయన, జంతు, వృక్షశాస్త్రాలకు ఒక్కో దానికి 30 చొప్పున 120 మార్కులకు ప్రాక్టికల్స్ మార్కులుంటాయి. జేఈఈ మెయిన్స్‌కు వెయిటేజీ మార్కులు 40 శాతం, ఎంసెట్‌కు 25 శాతం ఉంది. జేఈఈ మెయిన్స్‌లో ఒక్క మార్కు తేడాలో 1200 ర్యాంకు వెనక్కి పోతుంది. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు తమ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్‌లో ర్యాంకుల కోసం ఎగ్జామినర్స్ (వీరిలో అధికులు కాంట్రాక్టు లెక్చరర్లే) పేపరుకి కొంత మొత్తం చొప్పున ముట్టచెబుతుంటారు. పలు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల నుంచి ఇదివరకే ల్యాబ్ ఫీజుల పేరుతో రూ.1000-1500 వరకు వసూలు చేశారు.
ఈ ఏడాది విశాఖ జిల్లా, నగరం మొత్తమ్మీద 172 సెంటర్లలో 33.742 మంది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో దాదాపు 22 వేల మంది (ఎంపీసీ 15 వేలు, బైపీసీ 7 వేలు) ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నారు. వీరు కాకుండా ఒకేషనల్ విద్యార్థులు మరో ఐదు వేల మంది వరకు ఉన్నారు. వీరి నుంచి సగటున రూ.800 చొప్పున వసూలు చేస్తే సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారం బాహాటంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
వసూలు నేరమే..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన పనిలేదు. అలా వసూలు చేసే కాలేజీపై చర్యలు తీసుకుంటాం. నోటీసులిచ్చాక జరిమానా కూడా విధిస్తాం. ఇప్పటిదాకా మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి తక్షణమే చర్య తీసుకుంటాం.
-టి.నగేష్, ఆర్‌ఐవో, విశాఖ
ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి
అక్రమ వసూళ్లు చేస్తున్న కాలేజీలపై ఆర్‌ఐవో విచారణ జరిపి వాటి గుర్తింపు రద్దుచేయాలి. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇలా వసూలు చేసిన సొమ్మును తిరిగి విద్యార్థులకు చెల్లించాలి. లేనిపక్షంలో ప్రాక్టికల్స్ రాస్తున్న ఏబీవీపీ విద్యార్థుల ద్వారా అక్రమాల సమాచారం తెలుసుకుని ఆర్‌ఐవోపై చర్య తీసుకునే వరకు ఆందోళన చేస్తాం.
-కె.వాసు, జిల్లా కన్వీనర్, ఏబీవీపీ
జంబ్లింగ్.. గ్యాంబ్లింగ్!
Published Wed, Feb 3 2016 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement