Jambling
-
జంబ్లింగ్.. వసూళ్ల గ్యాంబ్లింగ్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో సుమారు 157 ఇంటర్ కళాశాలలున్నాయి. వీటిలో 87వరకు ప్రైవేట్‌వే. విద్యార్థుల నుంచి ప్రయోగ పరీక్షల పేరిట ఇప్పటికే రూ.300నుంచి కళాశాలల స్థాయిని బట్టి రూ.1000 వరకు, ప్రభుత్వ కళాశాలల్లో రూ.100నుంచి రూ.300వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. వీటి మొత్తాల్ని ఏ విధంగా అధికారులకు మామూళ్లివ్వాలన్న విషయమై ఇటీవల ఓ ఆదివారం ఇక్కడి కళాశాలల నిర్వహకులు కొంతమంది రహస్య సమావేశంలో చర్చించుకున్నారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అధికారులతో పాటు డిపార్ట్మెంటల్ అధికారికి, బోర్డు తరఫున స్వ్కాడ్ సిబ్బందికి వాటాలివ్వాల్సిన విషయంలో వ్యూహం రచించుకున్నారు. జంబ్లింగ్ విధానంలో ఇబ్బందులొస్తాయి, డబ్బులిస్తేనే పనవుతుందంటూ విద్యార్థుల్ని కౌన్సిలింగ్ చేసి మరీ డబ్బు పిండుకున్నారు. జంబ్లింగ్ రద్దవడంతో విద్యార్థులు తమ వద్ద వసూలు చేసిన మొత్తాల్లో కొంతయినా వెనక్కు ఇస్తారేమోనని ఆశపడ్డారు. వసూలు చేసిన మొత్తాల్ని అధికారుల వద్ద కాకుండా కిందిస్థాయి సిబ్బంది వద్ద దాయడం కూడా చిచ్చురేపుతోంది. జంబ్లింగ్ రద్దయిన నేపథ్యంలో కళాశాలల నిర్వహకులు భారీగా కాకుండా స్వల్ప మొత్తాల్లోనే పంపకాలు చేయాలంటూ నిర్ణయించడంతో ఆయా మొత్తాలపై వివాదం రేగుతోంది. ఖర్చెవరిది?శ్రీకాకుళంలో జంబ్లింగ్ విధానం అజెండాగా సాగిన రహస్య సమావేశానికి కార్పొరేట్ క ళాశాలల నిర్వహకులే పెత్తనం వహించారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని సమావేశం జరిగే ప్రాంతానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆ మొత్తాల్ని ఏయే అధికారికి ఏ విధంగా వాటాలివ్వాలో వ్యూహం పన్నారు. వసూళ్ల మొత్తంలో 10శాతం సమావేశపు ఖర్చుగా నిర్ణయించారు. మిగిలిన మొత్తాన్ని కళాశాలల తరఫున కొంతమంది మాత్రమే అధికారుల్ని రహస్యంగా కలిసి ముందస్తుగానే చెల్లించాలని నిర్ణయించారు. అయితే విద్యార్థుల నుంచి వసూలైన మొత్తాన్ని తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు తలె త్తడంలో పరీక్షల ప్రారంభానికి ముందురోజు పంపకాలు చేయాలని వ్యూహం పన్నారు. తీరా జంబ్లింగ్ విధానం రద్దయిందని తేలడంతో ఇప్పుడు ఆయా మొత్తాలపై చర్చ జరుగుతోంది. అనవసరంగా సమావేశం పెట్టుకున్నామని, ఖర్చులు వృథా అయ్యాయని మథనపడిపోతున్నారు. కిందిస్థాయికీ ఖర్చులే పరీక్షల సమయంలో మొన్నటివరకూ కొన్ని స్థాయిల్లోనే విచారణాధికారులుగా నియమించేవారు. ఇప్పుడు అధ్యాపకుల్నీ భాగస్వాములుగా కొన్ని ప్రాంతాల్లో నియమించారు. అడ్మిన్ విభాగంలో ఉన్న వారినీ స్క్వాడ్ సిబ్బందిగా వరించే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో తమ కిందిస్థాయి సిబ్బందిని అడ్మిన్ విభాగ అధికారులు ఇప్పటికే ఆయా కళాశాలలకు పంపించేసి వసూళ్లు తెమ్మంటుండడం చర్చనీయాంశమైంది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండడంతో వసూలైన మొత్తాల్ని చెల్లించేసి తమ కళాశాలల విద్యార్థులకు మంచి మార్కులొచ్చేలా చూడాలని నిర్వాహకులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా పట్టణంలో ఉన్న ఆర్ఐవో కార్యాలయం చుట్టూ నిర్వాహకులు క్యూ కట్టారు. బోర్డు ద్వారా వచ్చిన లేఖల్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. స్క్వాడ్ వివరాల్ని తెలుసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగ పరీక్షలు యథాతథంగానే నిర్వహిస్తున్నా జంబ్లింగ్ విధానం కోసం వసూలు చేసిన మొత్తాలతో ఎలాగైనా మేనేజ్ చేసి వెనుక బడిన విద్యార్థుల్ని ఎలాగైనా పాస్ చేయించాలనే దృఢనిశ్చయంతో నిర్వాహకులున్నట్టు తెలిసింది. తెలివైన విద్యార్థులు మాత్రం తాము పరీక్షలకు బాగానే సిద్ధమైనా అంతంత వసూళ్లా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జంబ్లింగ్.. గ్యాంబ్లింగ్!
ఒక్కో విద్యార్థి నుంచి రూ.800 నుంచి 1000 వసూలు చెల్లించకపోతే హాల్టిక్కెట్ల నిరాకరణ {పైవేటు, కార్పొరేట్ కాలేజీల దందా కొల్లగొట్టేది రూ.2 కోట్లపైనే విశాఖపట్నం: జంబ్లింగ్ బెడద తప్పిందని సంతోషిస్తున్న ఇంటర్ విద్యార్థులకు పలు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు సరికొత్త షాక్ ఇస్తున్నాయి. ఇదే వంకతో విద్యార్థుల నుంచి దండిగా దోచుకుంటున్నాయి. గురువారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు రూ.500, కార్పొరేట్ కళాశాలు రూ.800 నుంచి వెయ్యి రూపాయల తక్షణమే చెల్లించాలని నిబంధన విధించాయి. ఈ సొమ్ము ఇస్తేనే ప్రాక్టికల్స్‌కు హాల్‌టిక్కెట్లు ఇస్తామని పితలాటకం పెడుతున్నాయి. దీంతో విద్యార్థులు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిల్లలకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా జంబ్లింగ్ ఉంటుందంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో రద్దు చేసింది. హమ్మయ్యా! అనుకుంటున్న తరుణంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి భారీగా సొమ్ము దండుకునే ఎత్తుగడ వేశాయి. ప్రాక్టికల్ పరీక్షలకు వచ్చే ఎగ్జామినర్లు మార్కులు ఎక్కువగా వేసేలా ‘మేనేజ్’ చేయడానికి ఈ సొమ్ము చెల్లించాల్సిందేనని ఆయా యాజమన్యాలు తెగేసి చెబుతున్నాయి. మీ పిల్లలకు మార్కులు పెరగడం కోసమే ఇదంతా.. మా కోసం కాదు.. అంటుండడంతో విధిలేని పరిస్థితుల్లో పలువురు తల్లిదండ్రులు అడిగినంతా ఇచ్చేస్తున్నారు. చెల్లించని వారి పిల్లలను టార్గెట్ చేసి మార్కులు తగ్గించేస్తారేమోనన్న భయంతో విధిలేక చెల్లిస్తున్న వారూ ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులకు భౌతిక, రసాయనశాస్త్రాలకు 30 చొప్పున 60 మార్కులకు, బైపీసీ వారికి భౌతిక, రసాయన, జంతు, వృక్షశాస్త్రాలకు ఒక్కో దానికి 30 చొప్పున 120 మార్కులకు ప్రాక్టికల్స్ మార్కులుంటాయి. జేఈఈ మెయిన్స్‌కు వెయిటేజీ మార్కులు 40 శాతం, ఎంసెట్‌కు 25 శాతం ఉంది. జేఈఈ మెయిన్స్‌లో ఒక్క మార్కు తేడాలో 1200 ర్యాంకు వెనక్కి పోతుంది. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు తమ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్‌లో ర్యాంకుల కోసం ఎగ్జామినర్స్ (వీరిలో అధికులు కాంట్రాక్టు లెక్చరర్లే) పేపరుకి కొంత మొత్తం చొప్పున ముట్టచెబుతుంటారు. పలు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల నుంచి ఇదివరకే ల్యాబ్ ఫీజుల పేరుతో రూ.1000-1500 వరకు వసూలు చేశారు. ఈ ఏడాది విశాఖ జిల్లా, నగరం మొత్తమ్మీద 172 సెంటర్లలో 33.742 మంది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో దాదాపు 22 వేల మంది (ఎంపీసీ 15 వేలు, బైపీసీ 7 వేలు) ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నారు. వీరు కాకుండా ఒకేషనల్ విద్యార్థులు మరో ఐదు వేల మంది వరకు ఉన్నారు. వీరి నుంచి సగటున రూ.800 చొప్పున వసూలు చేస్తే సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారం బాహాటంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వసూలు నేరమే.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన పనిలేదు. అలా వసూలు చేసే కాలేజీపై చర్యలు తీసుకుంటాం. నోటీసులిచ్చాక జరిమానా కూడా విధిస్తాం. ఇప్పటిదాకా మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి తక్షణమే చర్య తీసుకుంటాం. -టి.నగేష్, ఆర్ఐవో, విశాఖ ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి అక్రమ వసూళ్లు చేస్తున్న కాలేజీలపై ఆర్ఐవో విచారణ జరిపి వాటి గుర్తింపు రద్దుచేయాలి. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇలా వసూలు చేసిన సొమ్మును తిరిగి విద్యార్థులకు చెల్లించాలి. లేనిపక్షంలో ప్రాక్టికల్స్ రాస్తున్న ఏబీవీపీ విద్యార్థుల ద్వారా అక్రమాల సమాచారం తెలుసుకుని ఆర్ఐవోపై చర్య తీసుకునే వరకు ఆందోళన చేస్తాం. -కె.వాసు, జిల్లా కన్వీనర్, ఏబీవీపీ -
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగా పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో కాకుండా, సాధారణ విధానంలోనే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్‌బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 154 పరీక్షా కేంద్రాలు.. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు 64 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో సాధారణ పద్ధతిలోనే ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో పరీక్షా కేంద్రాల సంఖ్య 154కు చేరింది. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాక్టికల్స్‌కు 26,309 మంది విద్యార్థులు..జిల్లాలో 316 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 26,309 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. నాలుగు స్పెల్‌లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి స్పెల్‌లో భాగంగా 46 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో స్పెల్‌లో ఐదు రోజుల వంతున ఈ నెల నాలుగో తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్‌బోర్డు సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీ నిర్వహిస్తారు. ‘గంటా’పథంగా చెప్పినా.. వెనుకడుగు.. ఐదేళ్లుగా జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తామంటూ విద్యాశాఖ మంత్రులు ప్రకటించి, చివరి నిమిషంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ ఏడాది కూడా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అదే బాట పట్టారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ ‘జంబ్లింగ్’ తంతును ‘సాక్షి’ గతేడాది డిసెంబర్ రెండో తేదీన ‘ప్రయోగం ఫలిస్తుందా?’ అని, ఈ ఏడాది జనవరి 12న ‘జంబ్లింగ్ ఉన్నట్టా.. లేనట్టా? శీర్షికలతో కథనాలు ప్రచురించింది కూడా. అధికారుల సమయం, శ్రమ వృథా : జంబ్లింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి ఆయా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనే విషయమై చేపట్టిన సమీక్షా కార్యక్రమాలతో ఇంటర్‌బోర్డు అధికారుల సమయం వృథా అయ్యింది -
ఎక్కడివారు అక్కడే..!
విజయనగరం అర్బన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం మళ్లీ వాయిదా పడింది. ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు ఈ ఏడాదీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చివరికి వాయిదా వేయించాయి. దీంతో విద్యార్థులకు తాము చదివే కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితంగా కళాశాలలో ప్రయోగశాలలు ఉన్నా, లేకు న్నా.. పరికరాలు లేకపోయినా, అసలు ప్రయోగాలు చేయకపోయినా మార్కులు మాత్రం పూర్తిస్థాయిలో పడే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి 100 కళాశాలల్లో పరీక్షా కేంద్రాల జిల్లాలో 171 కళాశాలలు ఉంన్నాయి. వీటిలో 22 ప్రభుత్వ, 5 ఎయిడెడ్ కళాశాలలు, 16 ఆదర్శ పాఠశాలలు, 10 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మిగిలినవి ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాక్టికల్స్ నిర్వహణకు కేవలం 70 కళాశాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో వసతులు ఉన్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు కొన్ని అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. పాత పద్ధతిలోనే ప్రాక్టిల్ నిర్వహించాలనే నిర్ణయంతో 100 కళాశాలలను ఎంపిక చేశారు. వాటిలో ఈ నెల 4వ తేదీ నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు రాయనున్న 14,176 మంది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్కళాశాలలోద్వితీయసంవత్సరసైన్స్విద్యార్థులు14,176మందిప్రయోగపరీక్షలకహాజరుకానున్నారు.ఎంపీసీవిద్యార్థులు5,452మంది, బైపీసీ విద్యార్థులు 4,666 మంది ఉన్నారు.ప్రైవేట్ విద్యార్థులకు సవాల్ ప్రయోగ పరీక్షలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు సవాలుగా మారనున్నాయి. అపార్టుమెంట్లలోని ఇరుకు గదుల్లో ఎక్కువగా ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ థియరీ నిర్వహించేందుకే గదులు చాలడం లేదు. ఇక ప్రయోగాలు ఎక్కడ చేయిస్తారని స్వయంగా ఓ అధ్యాపకుడే విచారం వ్యక్తంచేశారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమయ్యే పిప్పెట్, బ్యూరెట్, టెస్ట్ ట్యూబ్ (పరీక్ష నాళిక) పరికరాలు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మందికి తెలియవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అరకొరగా అయినా ప్రయోగశాలలు ఉన్నాయి. విజయనగరంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో కొన్నేళ్లుగా ల్యాబ్ లేదు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయితే చాలు మార్కులు వచ్చేస్తాయని ఆ విద్యా సంస్థ యాజమాన్యం విద్యార్థులకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు అధికారులను ‘మేనేజ్’ చేస్తూ వస్తున్నారు. ప్రాక్టికల్స్‌లో మార్కుల పేరుతో కొన్ని యాజమన్యాలు అదనంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. -
విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకే జంబ్లింగ్ విధానం
చంద్రబాబు విజయవాడ: విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకే జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సీఎంను కలవగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. జబ్లింగ్ విధానం వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల్లో జరిగే ఇబ్బందులను తెలిపేందుకు కాలేజీల ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన మాట్లాడుతూ.. క్వాలిటీ విద్యలేదని, ఇంజినీరింగ్ కాలేజీ వాళ్ల సంగతి చూడాలని అన్నారు. దీంతో విస్తుపోయిన ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు తాము ఇంజినీరింగ్ కాలేజీలవారం కాదని, జూనియర్ కాలేజీల వ్యక్తులమని చెప్పారు. ఎవరైతేనేమి ఇంటర్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది కదా అంటూ ప్రశ్నించారు. దీంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలకు నోట మాట రాలేదు. తెలంగాణలో జబ్లింగ్ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జబ్లింగ్ పెట్టలేదు. యాజమాన్యాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం విరమించుకుంది. దీన్ని వివరించేందుకు కాలేజీల ప్రతినిధులు ప్రయత్నించగా సీఎం వినిపించుకోలేదు. దీంతో వారు వెనుదిరిగారు. -
జరిగేది జంబ్లింగే!
స్పష్టతనివ్వడంతో ఏర్పాట్లలో జిల్లా అధికారులు 64 కేంద్రాల్లో ఇంటర్ ప్రయోగ పరీక్షలు సగం ప్రైవేట్ కళాశాలల్లోనే ప్రయోగ పరికరాలు హాజరుకానున్న 33,742 మంది విద్యార్థులు తనిఖీలకు నాలుగు స్క్వాడ్లు విశాఖపట్నం: ఈసారైనా ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ ఉంటుందా.. ఉండదా.. అన్న సందేహాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఫిబ్రవరిలో జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా జంబ్లింగ్ విధానం ప్రవేశపెడతామని చెబుతున్న ప్రభుత్వం పరీక్షలు సమీపించే సమయానికి వెనక్కు తగ్గడం అలవాటుగా మారింది. ఈ ఏడాది తప్పనిసరిగా జంబ్లింగ్ అమలు చేస్తామని ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. ఇంతలో ప్రయోగ పరీక్షలకు అవసరమైన పరికరాల కొరత ఉందన్న అంశాన్ని ప్రైవేటు కాలేజీలు తెరపైకి తెచ్చాయి. దీంతో జంబ్లింగ్ అమలుపై నీలినీడలు అలముకున్నాయి. ఒకపక్క ప్రయోగ పరీక్షలుంటాయని అధికారులు, ఉండకపోవచ్చని ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు చెబుతూ వచ్చారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జంబ్లింగ్ విధానాన్ని ఖరారు చేస్తూ మంగళవారం ఇంటర్మీడియట్ కమిషనర్, కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ తనిఖీ అధికారుల (ఆర్‌ఐఓల)తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జంబ్లింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విధివిధానాలను సూచించారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఆర్ఐవో తమర్బ నగేష్ ప్రాక్టికల్ పరీక్షలు జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం తన కార్యాలయంలో సమావేశమాయ్యరు. 64 కేంద్రాల ఎంపిక ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం విశాఖ జిల్లా, నగరంలో మొత్తం 64 కేంద్రాల ను ఎంపిక చేశారు. వీటిలో 23 ప్రభుత్వ, 11 ఎయిడెడ్, మూడు సాంఘిక సంక్షేమ, రెండు గిరిజన సంక్షేమ కళాశాలలు, 24 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 33,742 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల తనిఖీలు, పర్యవేక్షణకు నాలుగు స్క్వాడ్లను నియమిస్తున్నారు. -
జంబ్లింగ్ వద్దే వద్దు!
రాష్ర్ట ప్రభుత్వ చర్యలపై భగ్గుమన్న విద్యార్థిలోకం ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానంపై నిరసన జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిన రహదారులు మంగళగిరిలో విద్యార్థులపై పోలీసుల అత్యుత్సాహం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం నరసరావుపేట ఆర్డీవో కార్యలయం ఎదుట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తొలుత ఆర్డీవో కార్యాలయం ఎదుట బైటాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ఏరియా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని దయారత్నం కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ విధానం రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వినుకొండలో స్తంభించిన ట్రాఫిక్.. వినుకొండ పట్టణంలో ప్రైవేటు కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కొద్దిసేపు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలకు లేని విధానం కేవలం ప్రైవేటు విద్యార్థులపై రుద్దటం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే తమ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కృష్ణవేణి, వాణి, గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్లో ధర్నా.. పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ప్రైవేట్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. విద్యార్థి జేఏసీ స్థానిక నాయకులు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రాక్టిల్స్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎత్తివేయాలని డి మాండ్ చేశారు. పట్టణంలోని తొమ్మిది ప్రైవేట్ కాలేజీలకు చెందిన సుమారు వెయ్యి మంది ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. కొద్దిసేపటికి పోలీసులు విద్యార్థులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. మాచర్లలో ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కార్యక్రమంలో కృష్ణవేణి, పల్నాడు, జయభారత్ జూనియర్ కళాశాలల విద్యార్థులు, యాజమాన్యం పాల్గొన్నారు. మంగళగిరిలో పోలీసుల అత్యుత్సాహం జబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ శాంతియుత ప్రదర్శన చేస్తున్న విద్యార్థి సంఘాలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటన సోమవారం మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్లో చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలతో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, యాజమాన్యాలు మంగళగిరిలో ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల వ్యవహార శైలిపై కళాశాల యాజమాన్యాలు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహ ం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్, ఐఐటీలలో లేని జంబ్లింగ్ విధానం ఇంటర్లో ప్రవేశపెట్టి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తూ జీవో విడుదల చేయగా అదేమంత్రి వర్గంలో ఉన్న నేటి మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి ఆ విధానం ప్రవేశపెట్టడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జ్యోతి, పవన్, పులిపాక ఐజాక్, శ్యామ్, అభిషిత్, కిషోర్, నవీన్, భాషా తదితరులు పాల్గొన్నారు. -
జంబ్లింగ్ మళ్లీ వాయిదా!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలలో అమలు చేయాలని భావించిన జంబ్లింగ్ విధానాన్ని మళ్లీ వాయిదా వేశారు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాదీ ఈ సారి జంబ్లింగ్ తప్పని సరి అని ప్రకటిస్తుండడం, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి మేరకు వాయిదా వేస్తుండడం పరిపాటిగా మారిపోయింది. ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు ఈ ఏడాది కూడా మరోసారి తమ పట్టును నిలుపుకొన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి, చివరికి ఎప్పటిలాగానే వాయిదా వేయించాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఏడేళ్ల క్రితమే ప్రభుత్వం జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ప్రాక్టికల్స్‌కు వర్తించేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ విద్యార్థి చదివిన కళాశాలలోనే ప్రయోగ పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు అధికమార్కులు వేయించుకునే అవకాశం ఉందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయోగ పరీక్షల్లో సైతం జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయడానికి నాలుగేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడితో ఏటా వెనకడుగు వేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలు కలిపి సుమారు 170 వరకూ ఉన్నాయి. వీటిలో చదువుతున్న 12,962 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రయోగ వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏ విధానంలోనైనా ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు 92 కళాశాలలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జంబ్లింగ్ వద్దంటూ ఆందోళనలు చేపట్టిన మేరకు జంబ్లింగ్ కాకుండా సాధారణ పద్ధతిలోనే ప్రాక్టికల పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 92 కళాశాలల్లో సాధారణ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయోగ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్ల జాబితాను సిద్ధం చేసి, ఇంటర్మీడియెట్ బోర్డుకు అధికారులు నివేదించారు. అక్కడి నుంచి నియామక ఉత్తర్వులు రావాల్సి ఉంది. పరీక్షల నిర్వహణ అనంతరం ఏ పూట ప్రశ్నపత్రాలను ఆ పూటే వేల్యుయేషన్ చేసి సీల్‌తో సంబంధిత కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు అప్పగిస్తారు. జిల్లా పరీక్షల కమిటీ ప్రయోగ పరీక్షలు సక్రమంగా జరిగేలా జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) పర్యవేక్షిస్తుంది. ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లు, ఒక సీనియర్ జేఎల్ ఉంటారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తాయి. ఫిబ్రవరి 12 నుంచి ప్రయోగపరీక్షలు: ఆర్ఐఓ ఇంటర్మీడియెట్ రెండో సంవత్సర ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరి 12వ తేదీ నుంచి జరుగుతాయని ఇంటర్మీడియెట్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ) ఎల్.ఆర్.బాబాజీ ‘ న్యూస్‌లైన్’కి తెలిపారు. ఈ మేరకు సీనియర్ అధ్యాపక బృందానికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలోని విద్యార్థులను నాలుగు బ్యాచ్‌లుగా విడదీసి 92 పరీక్ష కేంద్రాలలో నాలుగు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎగ్జామినర్ల జాబితా బోర్డు నుంచి రావలసి ఉందని చెప్పారు. -
ఈసారీ పాతపద్ధతే!
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది కూడా పాతపద్ధతిలోనే జరగనున్నాయి. వాస్తవానికి గత ఏడాది నుంచే జంబ్లింగ్‌లో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని తలపెట్టిన ఇంటర్ బోర్డు కార్పోరేట్ కళాశాలల తీవ్ర ఒత్తిడితో ఆఖరిక్షణంలో నాన్జంబ్లింగ్కే మొగ్గుచూపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి జంబ్లింగ్‌ను కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించించిన అధికారులు మాట నిలుపుకోలేకపోయారు. అందుకు బలమైన కారణం లేకపోలేదు. ఈ ఏడాది కళాశాలలు తెరచింది మొదలు వివిధ కారణాలతో విద్యార్థులకు భారీగా సెలవులొచ్చాయి. దీంతో వారు అన్నివిధాలా నష్టపోయారు. తొలుత స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్ల నివధిక సమ్మె, ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో తరగతులు సక్రమంగా జరగలేదు. ఉద్యమాలతో మూతపడిన కళాశాలలు! సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావంగా ఉపాధ్యాయ సంఘాలతోపాటు అధ్యాపక జేఏసీగా ఏర్పడి ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది సైతం సమ్మెలోకి దిగారు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలలు సుమారు 40 రోజులపాటు మూతపడ్డాయి. అనంతరం రాష్ట్రప్రభుత్వ ఒప్పందంతో మళ్లీ కళాశాలలు తెరచుకున్నాయి. సుమారు ఐదు నెలలు గడిచినప్పటికీ సిలబస్ అంతంతమాత్రంగానే పూర్తయింది. దీంతో కనీసం యూనిట్ టెస్టులతోపాటు త్రైమాసిక పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితి. ఇప్పటికే పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ వెలువడింది. థియరీ పరీక్షలు మార్చి 12 నుంచి, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మొదలుకానున్నాయి. వీటనన్నింటినీ గుర్తించిన ఇంటర్ బోర్డు విద్యార్థులకు కాసింత ఊరట కలిగించేందుకు ప్రాక్టికల్ పరీక్షలను పాతపద్ధతిలోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొని అయోమయాన్ని తొలగించింది. అయితే సర్కారీ కళాశాలల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు మరింత లాభించనుంది. కళాశాలల్లో సౌకర్యాలలేమి! జిల్లాలో 43 ప్రభుత్వ, 11 సాంఘీక, నాలుగు గిరిజన, 86 ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. ఈ విద్యాసంవ్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరం 32 వేల మంది, ద్వితీయ సంవత్సరం 30 వేల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారు. ఇందులో ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు 15 వేల మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇదంతా ఒకెత్తయితే జిల్లాలోని దాదాపు 60 శాతం కళాశాలల్లో పూర్తిస్థాయిలో ప్రాక్టికల్స్‌కు అవసరమైన పరికరాలు లేవు. ముఖ్యంగా శ్రీకాకుళంతోపాటు నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, కోటబొమ్మాళి, పాలకొండ, ఇచ్ఛాపురం, సోంపేట, రణస్థలం, రాజాం ప్రాంతాల్లోని కళాశాలల్లో అసౌకర్యాల లేమి వెంటాడుతోంది. చాలావరకు కళాశాల్లో ఇంతవరకు ప్రాక్టికల్ పరికరాలకు బూజు కూడా దులపలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎంతమొత్తుకున్న కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు మాత్రం మారడంలేదు.