జంబ్లింగ్ మళ్లీ వాయిదా!
Published Sun, Jan 5 2014 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలలో అమలు చేయాలని భావించిన జంబ్లింగ్ విధానాన్ని మళ్లీ వాయిదా వేశారు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాదీ ఈ సారి జంబ్లింగ్ తప్పని సరి అని ప్రకటిస్తుండడం, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి మేరకు వాయిదా వేస్తుండడం పరిపాటిగా మారిపోయింది. ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు ఈ ఏడాది కూడా మరోసారి తమ పట్టును నిలుపుకొన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి, చివరికి ఎప్పటిలాగానే వాయిదా వేయించాయి. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఏడేళ్ల క్రితమే ప్రభుత్వం జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ప్రాక్టికల్స్‌కు వర్తించేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ విద్యార్థి చదివిన కళాశాలలోనే ప్రయోగ పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు అధికమార్కులు వేయించుకునే అవకాశం ఉందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయోగ పరీక్షల్లో సైతం జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయడానికి నాలుగేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడితో ఏటా వెనకడుగు వేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలు కలిపి సుమారు 170 వరకూ ఉన్నాయి.
వీటిలో చదువుతున్న 12,962 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రయోగ వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏ విధానంలోనైనా ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు 92 కళాశాలలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జంబ్లింగ్ వద్దంటూ ఆందోళనలు చేపట్టిన మేరకు జంబ్లింగ్ కాకుండా సాధారణ పద్ధతిలోనే ప్రాక్టికల పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 92 కళాశాలల్లో సాధారణ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయోగ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్ల జాబితాను సిద్ధం చేసి, ఇంటర్మీడియెట్ బోర్డుకు అధికారులు నివేదించారు. అక్కడి నుంచి నియామక ఉత్తర్వులు రావాల్సి ఉంది. పరీక్షల నిర్వహణ అనంతరం ఏ పూట ప్రశ్నపత్రాలను ఆ పూటే వేల్యుయేషన్ చేసి సీల్‌తో సంబంధిత కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు అప్పగిస్తారు.
జిల్లా పరీక్షల కమిటీ
ప్రయోగ పరీక్షలు సక్రమంగా జరిగేలా జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) పర్యవేక్షిస్తుంది. ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లు, ఒక సీనియర్ జేఎల్ ఉంటారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తాయి.
ఫిబ్రవరి 12 నుంచి ప్రయోగపరీక్షలు: ఆర్‌ఐఓ
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సర ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరి 12వ తేదీ నుంచి జరుగుతాయని ఇంటర్మీడియెట్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐఓ) ఎల్.ఆర్.బాబాజీ ‘ న్యూస్‌లైన్’కి తెలిపారు. ఈ మేరకు సీనియర్ అధ్యాపక బృందానికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలోని విద్యార్థులను నాలుగు బ్యాచ్‌లుగా విడదీసి 92 పరీక్ష కేంద్రాలలో నాలుగు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎగ్జామినర్ల జాబితా బోర్డు నుంచి రావలసి ఉందని చెప్పారు.
Advertisement
Advertisement