శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది కూడా పాతపద్ధతిలోనే జరగనున్నాయి. వాస్తవానికి గత ఏడాది నుంచే జంబ్లింగ్‌లో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని తలపెట్టిన ఇంటర్ బోర్డు కార్పోరేట్ కళాశాలల తీవ్ర ఒత్తిడితో ఆఖరిక్షణంలో నాన్‌జంబ్లింగ్‌కే మొగ్గుచూపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి జంబ్లింగ్‌ను కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించించిన అధికారులు మాట నిలుపుకోలేకపోయారు.
అందుకు బలమైన కారణం లేకపోలేదు. ఈ ఏడాది కళాశాలలు తెరచింది మొదలు వివిధ కారణాలతో విద్యార్థులకు భారీగా సెలవులొచ్చాయి. దీంతో వారు అన్నివిధాలా నష్టపోయారు. తొలుత స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్ల నివధిక సమ్మె, ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో తరగతులు సక్రమంగా జరగలేదు.
ఉద్యమాలతో మూతపడిన కళాశాలలు!
సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావంగా ఉపాధ్యాయ సంఘాలతోపాటు అధ్యాపక జేఏసీగా ఏర్పడి ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది సైతం సమ్మెలోకి దిగారు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలలు సుమారు 40 రోజులపాటు మూతపడ్డాయి. అనంతరం రాష్ట్రప్రభుత్వ ఒప్పందంతో మళ్లీ కళాశాలలు తెరచుకున్నాయి. సుమారు ఐదు నెలలు గడిచినప్పటికీ సిలబస్ అంతంతమాత్రంగానే పూర్తయింది. దీంతో కనీసం యూనిట్ టెస్టులతోపాటు త్రైమాసిక పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితి.
ఇప్పటికే పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ వెలువడింది. థియరీ పరీక్షలు మార్చి 12 నుంచి, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మొదలుకానున్నాయి. వీటనన్నింటినీ గుర్తించిన ఇంటర్ బోర్డు విద్యార్థులకు కాసింత ఊరట కలిగించేందుకు ప్రాక్టికల్ పరీక్షలను పాతపద్ధతిలోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొని అయోమయాన్ని తొలగించింది. అయితే సర్కారీ కళాశాలల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు మరింత లాభించనుంది.
కళాశాలల్లో సౌకర్యాలలేమి!
జిల్లాలో 43 ప్రభుత్వ, 11 సాంఘీక, నాలుగు గిరిజన, 86 ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. ఈ విద్యాసంవ్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరం 32 వేల మంది, ద్వితీయ సంవత్సరం 30 వేల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారు. ఇందులో ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు 15 వేల మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇదంతా ఒకెత్తయితే జిల్లాలోని దాదాపు 60 శాతం కళాశాలల్లో పూర్తిస్థాయిలో ప్రాక్టికల్స్‌కు అవసరమైన పరికరాలు లేవు. ముఖ్యంగా శ్రీకాకుళంతోపాటు నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, కోటబొమ్మాళి, పాలకొండ, ఇచ్ఛాపురం, సోంపేట, రణస్థలం, రాజాం ప్రాంతాల్లోని కళాశాలల్లో అసౌకర్యాల లేమి వెంటాడుతోంది. చాలావరకు కళాశాల్లో ఇంతవరకు ప్రాక్టికల్ పరికరాలకు బూజు కూడా దులపలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎంతమొత్తుకున్న కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు మాత్రం మారడంలేదు.