Intermediate practical
-
ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్!
3 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జిల్లాలో 69 సెంటర్ల ఏర్పాటు ప్రైవేటు కాలేజీలకు ప్రత్యేక అధికారులు నర్సీపట్నం: ఎట్టకేలకు ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లుగా ప్రాక్టికల్స్ సైతం థియరీ పరీక్షల మాదిరిగానే నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నా, వాటిని నిలుపుదల చేసేందుకు కార్పొరేట్ కాలేజీలు ఒత్తిడి చేసేవి. ఈ విధంగా ప్రతి ఏటా ఈ విధానం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ప్రభుత్వం ఈ ఏడాది దీనిపై గట్టి నిర్ణయం తీసుకొని, జంబ్లింగ్ విధానంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3 నుంచి 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు లేనిచోట సమీపంలోని వేరే కళాశాలల నుంచి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షలు జం బ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు తొలి అడుగు పడింది. వీటి నిర్వహణకు గాను జిల్లాలో 69 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 24 ప్రభుత్వ కళాశాలలు, 11 ఎయిడెడ్, 3 ట్రైబల్, 3 సాంఘిక సంక్షేమంతోపాటు 28 ప్రైవేటు కళాశాలలను ఎంపిక చేశారు. వీటిలో ఈ ఏడాది 36,616మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ నుంచి 29,140మంది, బైపీసీ నుంచి 7515 మంది విద్యార్థులున్నారు. జిల్లాలో మొత్తం 263 కాలేజీల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. స్క్వాడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా ఒక్కో దానికి ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమిస్తున్నారు. ఈ విధంగా తొలిసా రి జంబ్లింగ్ విధానంలో జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్‌ను పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టి.నగేష్ కుమార్ పేర్కొన్నారు. ఇదీ మతలబు.. ఇంతవరకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్ రాసే విద్యార్థులకు వారి ర్యాంకుల్లో ఇంటర్ మార్కులు వెయిటే జీ ఉండేది. జేఈఈ మెయిన్స్ 40 శాతం, ఎంసెట్‌కు 25 శాతం ఉండేది. దీంతో ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు అవసరమయ్యేవి. దీంతో ప్రైవేటు కళాశాలలు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేందుకు గాను పరోక్షంగా ఈ ప్రాక్టికల్స్ దోహదపడేవి. దీంతో కార్పోరేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, జంబ్లింగ్ విధానం అమల్లోకి రాకుండా చేసేవారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్ వెయిటేజీ తీసేయ్యడంతో కార్పొరేట్ కాలేజీలు వెనక్కు తగ్గాయి. దీంతో ప్రభుత్వం జంబ్లింగ్ విధానాన్ని అడ్డంకులు లేకుండా అమల్లోకి తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఈ పరీక్షలు కచ్చితంగా ఎటువంటి అవకతవకల్లేకుండా జరిగితే గ్రామీణ విద్యార్థులకు వరంగా మారనుంది. -
3 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్
నాలుగు దశల్లో 22వ తేదీ వరకు నిర్వహణ 1,682 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు హాజరు కానున్న 3.20 లక్షల మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు దశలుగా నిర్వహించే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,682 కేంద్రాలను (జనరల్ 1,373, ఒకేషనల్ 309) ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు చెందిన 3,19,185 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. ఇందులో ఎంపీఎసీ విద్యార్థులు 1,56,021 మంది, బీపీసీ విద్యార్థులు 91,687 మంది, జియోగ్రఫీ విద్యార్థులు 350 మంది, ఒకేషనల్ ప్రథమ సంవత్సర విద్యా ర్థులు 39,044 మంది, ఒకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 32,083 మంది హాజ రుకానున్నారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షల్లో ఆన్లైన్ విధానాన్ని అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు చర్య లు చేపట్టింది. ప్రశ్నపత్రం డౌన్లోడ్ నుంచి మొదలుకొని పరీక్ష పూర్తి కాగానే వెంటనే మూల్యాంకనం చేసి, ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. 5,248 మంది ఎగ్జామినర్లు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు 5,248 మంది ఎగ్జామినర్లను ఇంటర్ బోర్డు నియమించింది. అనుభవజ్ఞులైన ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లను జంబ్లింగ్ పద్ధతిలో ఎగ్జామినర్లుగా నియమించింది. వారు పని చేసే కాలేజీల్లో కాకుండా ఇతర కాలేజీల్లో కేటాయించింది. ప్రాక్టికల్ కేంద్రాలు ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో డిపార్ట్మెంటల్ అధికారులను అబ్జర్వర్లుగా నియమించింది. వారితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్, హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలు కూడా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి రాష్ట్ర అబ్జర్వర్లను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ ద్వారానే ప్రశ్నపత్రం ఈసారి నుంచి ఆన్లైన్ ద్వారా ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసేలా బోర్డు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి పరీక్షకు అరగంట ముందుగా ఎగ్జామినర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినర్ మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేయాలి. పరీక్ష ముగిశాక పేపరు మూల్యాంకనం చేసి మార్కులను వెంటనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇటీవల ఎగ్జామినర్లకు శిక్షణకు కూడా ఇచ్చింది. హాల్‌టికెట్లను ఇప్పటికే కాలేజీలకు పంపించామని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అలాగే తమ వెబ్సైట్లోనూ (bietelangana.cgg. gov. in) అందుబాటులో ఉంచామని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. -
ఈసారీ పాతపద్ధతే!
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది కూడా పాతపద్ధతిలోనే జరగనున్నాయి. వాస్తవానికి గత ఏడాది నుంచే జంబ్లింగ్‌లో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని తలపెట్టిన ఇంటర్ బోర్డు కార్పోరేట్ కళాశాలల తీవ్ర ఒత్తిడితో ఆఖరిక్షణంలో నాన్జంబ్లింగ్కే మొగ్గుచూపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి జంబ్లింగ్‌ను కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించించిన అధికారులు మాట నిలుపుకోలేకపోయారు. అందుకు బలమైన కారణం లేకపోలేదు. ఈ ఏడాది కళాశాలలు తెరచింది మొదలు వివిధ కారణాలతో విద్యార్థులకు భారీగా సెలవులొచ్చాయి. దీంతో వారు అన్నివిధాలా నష్టపోయారు. తొలుత స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్ల నివధిక సమ్మె, ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో తరగతులు సక్రమంగా జరగలేదు. ఉద్యమాలతో మూతపడిన కళాశాలలు! సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావంగా ఉపాధ్యాయ సంఘాలతోపాటు అధ్యాపక జేఏసీగా ఏర్పడి ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది సైతం సమ్మెలోకి దిగారు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలలు సుమారు 40 రోజులపాటు మూతపడ్డాయి. అనంతరం రాష్ట్రప్రభుత్వ ఒప్పందంతో మళ్లీ కళాశాలలు తెరచుకున్నాయి. సుమారు ఐదు నెలలు గడిచినప్పటికీ సిలబస్ అంతంతమాత్రంగానే పూర్తయింది. దీంతో కనీసం యూనిట్ టెస్టులతోపాటు త్రైమాసిక పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితి. ఇప్పటికే పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ వెలువడింది. థియరీ పరీక్షలు మార్చి 12 నుంచి, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మొదలుకానున్నాయి. వీటనన్నింటినీ గుర్తించిన ఇంటర్ బోర్డు విద్యార్థులకు కాసింత ఊరట కలిగించేందుకు ప్రాక్టికల్ పరీక్షలను పాతపద్ధతిలోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొని అయోమయాన్ని తొలగించింది. అయితే సర్కారీ కళాశాలల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు మరింత లాభించనుంది. కళాశాలల్లో సౌకర్యాలలేమి! జిల్లాలో 43 ప్రభుత్వ, 11 సాంఘీక, నాలుగు గిరిజన, 86 ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. ఈ విద్యాసంవ్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరం 32 వేల మంది, ద్వితీయ సంవత్సరం 30 వేల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారు. ఇందులో ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు 15 వేల మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇదంతా ఒకెత్తయితే జిల్లాలోని దాదాపు 60 శాతం కళాశాలల్లో పూర్తిస్థాయిలో ప్రాక్టికల్స్‌కు అవసరమైన పరికరాలు లేవు. ముఖ్యంగా శ్రీకాకుళంతోపాటు నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, కోటబొమ్మాళి, పాలకొండ, ఇచ్ఛాపురం, సోంపేట, రణస్థలం, రాజాం ప్రాంతాల్లోని కళాశాలల్లో అసౌకర్యాల లేమి వెంటాడుతోంది. చాలావరకు కళాశాల్లో ఇంతవరకు ప్రాక్టికల్ పరికరాలకు బూజు కూడా దులపలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎంతమొత్తుకున్న కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు మాత్రం మారడంలేదు.