3 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్
- నాలుగు దశల్లో 22వ తేదీ వరకు నిర్వహణ
- 1,682 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు
- హాజరు కానున్న 3.20 లక్షల మంది విద్యార్థులు
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు దశలుగా నిర్వహించే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,682 కేంద్రాలను (జనరల్ 1,373, ఒకేషనల్ 309) ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు చెందిన 3,19,185 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. ఇందులో ఎంపీఎసీ విద్యార్థులు 1,56,021 మంది, బీపీసీ విద్యార్థులు 91,687 మంది, జియోగ్రఫీ విద్యార్థులు 350 మంది, ఒకేషనల్ ప్రథమ సంవత్సర విద్యా ర్థులు 39,044 మంది, ఒకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 32,083 మంది హాజ రుకానున్నారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షల్లో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు చర్య లు చేపట్టింది. ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ నుంచి మొదలుకొని పరీక్ష పూర్తి కాగానే వెంటనే మూల్యాంకనం చేసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది.
5,248 మంది ఎగ్జామినర్లు
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు 5,248 మంది ఎగ్జామినర్లను ఇంటర్ బోర్డు నియమించింది. అనుభవజ్ఞులైన ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లను జంబ్లింగ్ పద్ధతిలో ఎగ్జామినర్లుగా నియమించింది. వారు పని చేసే కాలేజీల్లో కాకుండా ఇతర కాలేజీల్లో కేటాయించింది. ప్రాక్టికల్ కేంద్రాలు ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో డిపార్ట్‌మెంటల్ అధికారులను అబ్జర్వర్లుగా నియమించింది. వారితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్, హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలు కూడా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి రాష్ట్ర అబ్జర్వర్లను పంపేందుకు ఏర్పాట్లు చేసింది.
ఆన్‌లైన్ ద్వారానే ప్రశ్నపత్రం
ఈసారి నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసేలా బోర్డు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి పరీక్షకు అరగంట ముందుగా ఎగ్జామినర్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినర్ మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేయాలి. పరీక్ష ముగిశాక పేపరు మూల్యాంకనం చేసి మార్కులను వెంటనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇటీవల ఎగ్జామినర్లకు శిక్షణకు కూడా ఇచ్చింది. హాల్‌టికెట్లను ఇప్పటికే కాలేజీలకు పంపించామని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అలాగే తమ వెబ్‌సైట్‌లోనూ (bietelangana.cgg. gov. in) అందుబాటులో ఉంచామని, విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.