జంబ్లింగ్ వద్దే వద్దు! | ambling do not want to stay! | Sakshi
Sakshi News home page

జంబ్లింగ్ వద్దే వద్దు!

Published Tue, Jan 5 2016 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

ambling do not want to stay!

రాష్ర్ట ప్రభుత్వ చర్యలపై భగ్గుమన్న విద్యార్థిలోకం
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానంపై నిరసన
జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిన రహదారులు
మంగళగిరిలో విద్యార్థులపై పోలీసుల అత్యుత్సాహం
విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో

 
 ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం నరసరావుపేట ఆర్డీవో కార్యలయం ఎదుట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తొలుత ఆర్డీవో కార్యాలయం ఎదుట బైటాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ఏరియా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని దయారత్నం కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ విధానం రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

వినుకొండలో స్తంభించిన ట్రాఫిక్..
వినుకొండ పట్టణంలో ప్రైవేటు కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కొద్దిసేపు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలకు లేని విధానం కేవలం ప్రైవేటు విద్యార్థులపై రుద్దటం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే తమ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కృష్ణవేణి, వాణి, గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్‌లో ధర్నా..
పట్టణంలోని ఐలాండ్ సెంటర్‌లో ప్రైవేట్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. విద్యార్థి జేఏసీ స్థానిక నాయకులు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రాక్టిల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎత్తివేయాలని డి మాండ్ చేశారు. పట్టణంలోని తొమ్మిది ప్రైవేట్ కాలేజీలకు చెందిన సుమారు వెయ్యి మంది ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. కొద్దిసేపటికి పోలీసులు విద్యార్థులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు.
 
 మాచర్లలో ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కార్యక్రమంలో కృష్ణవేణి, పల్నాడు, జయభారత్ జూనియర్ కళాశాలల విద్యార్థులు, యాజమాన్యం పాల్గొన్నారు.
 
మంగళగిరిలో పోలీసుల అత్యుత్సాహం
 జబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ శాంతియుత ప్రదర్శన చేస్తున్న విద్యార్థి సంఘాలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటన సోమవారం మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలతో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, యాజమాన్యాలు మంగళగిరిలో ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల వ్యవహార శైలిపై కళాశాల యాజమాన్యాలు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహ ం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్, ఐఐటీలలో లేని జంబ్లింగ్ విధానం ఇంటర్‌లో ప్రవేశపెట్టి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తూ జీవో విడుదల చేయగా అదేమంత్రి వర్గంలో ఉన్న నేటి మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి ఆ విధానం ప్రవేశపెట్టడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జ్యోతి, పవన్, పులిపాక ఐజాక్, శ్యామ్, అభిషిత్, కిషోర్, నవీన్, భాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement